రేపిస్టుల్ని కుళ్లబొడిపించి... కారం పెట్టించేదట
Publish Date:Feb 10, 2017
Advertisement
రేప్ చేసిన వాళ్లని తలకిందులుగా వేలాడదీయాలి. చితగ్గొట్టాలి. తరువాత ఆ దెబ్బలపై కారం పూయాలి! అప్పుడు తమని ప్రాణాలతో వదిలిపెట్టమని రేపిస్టులు గావుకేకలు పెడుతుంటే.. మహిళలు వార్ని చూడాలి! ఏంటీ ఈ మాటలు అనుకుంటున్నారా? ఇవి సాక్షాత్తూ కేంద్ర సీనియర్ మంత్రి ఉమాభారతి చేప్పినవి! అంతే కాదు, ఆ టైపులో రేపిస్టులకి తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు పోలీసుల చేత ట్రీట్మెంట్ ఇప్పించేదాన్నని ఆమె ప్రకటించారు! అదీ ఒక ఎన్నికల బహిరంగ సభలో! రేపిస్టులకి కఠినమైన శిక్షలు పడాలని అందరూ కోరుకుంటారు. కాని, స్వయంగా అధికార పక్షంలోని మంత్రి పోలీసుల చేత దౌర్జన్యం చేయించానని చెప్పటం కొంచెం ఆందోనకరమే! అయినా కూడా గతంలో మధ్యప్రదేశ్ కి సీఎంగా పని చేసిన ఉమాభారతి తాను అలా చేశానని చెప్పటంలో కొంత అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం వుంది. ఉత్తరాదిలో మహిళల మీద దాడుల విషయంలో చాలా తేడా వుంటుంది. మన దగ్గరిలా పరిస్థితులు వుండవు. నిర్భయ ఉదంతాలు అక్కడ సర్వ సాధారణం. అదీ ప్రస్తుతం ఎన్నికలు ఎదుర్కొంటోన్న యూపీలో అయితే మరీ దారుణం. ఎస్పీ నేతలు, వారి అనుచరులు చేసే ఆగడాలు భరించనలవి కాకుండా వుంటాయని పబ్లిగ్గానే చెప్పుకుంటారు. అయిదేళ్ల అఖిలేష్ పాలనలో బోలెడు రేప్ కేసులు వెలుగు చూశాయి. ఇక వెలుగు చూడనవి అయితే లెక్కించటానికి కూడా వీలుండదు. ఉమాభారతి రేపిస్టుల్ని శిక్షించటం గురించి మాట్లాడటానికి కారణం ఈ మధ్య బులంద్ షహర్ అనే ప్రాంతంలో హైవేకు పక్కనే తల్లికూతుళ్లని గ్యాంగ్ రేప్ చేశారు. ఇది పెద్ద దుమారం రేపింది. అయినా కూడా ఉత్తర్ ప్రదేశ్లోని రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోలేకపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఉమాభారతి ఆవేశంగా తన హయంలో జరిపిన న్యాయం గురించి వివరించారు. పోలీసులు థర్డ్ డిగ్రీ వాడి రేపిస్టుల్ని హింసించటం చట్ట రిత్యా సరైంది కాకపోవచ్చు. కాని, చాలా సందర్భాల్లో రేప్ కేసులు కోర్టుకు వచ్చి నిర్వీర్యం అయిపోతుంటాయి. రేప్ బాధితులకే మరింత నరకం చూపిస్తుంటాయి. నిర్భయ కేసులో కూడా అసలు నిందితుడు మైనర్ అంటూ మూడేళ్ల జైలుశిక్షతో సరిపెట్టేశారు. ఇవన్నీ కారణాల చేతనే ఉమాభారతి రేపిస్టులకి నరకం చూపించి బాధితుల కాళ్లు పట్టిస్తానని అన్నారు. ఒకవేళ బీజేపి ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలోకి వస్తే ఉమాభారతి చెప్పినట్టు కర్కశమైన శిక్షలు రేపిస్టులకి వేయకున్నా... అక్కడి స్త్రీల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. అత్యంత పెద్ద రాష్ట్రంలో రేపిస్టులు స్వేచ్ఛగా అరాచకం చేస్తుండటం మన వ్యవస్థకే అవమానం!
http://www.teluguone.com/news/content/uma-bharathi-45-72019.html





