జగన్మోహనా.. నీ పాలనకు నీవే బాధ్యుడవు
Publish Date:Jul 15, 2022
Advertisement
ఎవరన్నా జీవితంలో వృద్ధిలోకి రావాలనే కోరుకుంటారు. అందుకు కష్టపడతారు, సాధించిన తర్వాత ప్రతిష్టను కాపాడుకోవడానికి మంచి పనులు చేస్తూ కుటుంబాన్ని, జనాన్ని ఆకట్టుకుంటారు. పాపం జగన్ రెడ్డికి ఇవేమీ బొత్తిగా మింగుడుపడని సూక్తులు. వై.ఎస్ రాజకీయ వారసునిగా 2019లో జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కానీ అయ్యవారికి మంత్రులు, సలహాదారులు, ఇంటా బయటా రవ్వంత అభిమానించే వారి మాటలేవీ రుచించలేదు. అధికారపీఠం ఎక్కగానే విపక్షాలమీద విరుచుకుపడటమే తప్ప ప్రత్యేకిం చి వారి అనుభవాన్నుంచీ తెలు సుకున్నది, నేర్చుకున్నదేమీ లేదు. తండ్రి అడుగు జాడల్లో వెళతాడని గంపెడాశలు పెట్టుకున్న కుటుం బాన్ని కూడా ఖంగుతినిపించారు సీఎం జగన్. పార్టీ అధినేతగా, రాష్ట్ర సీఎంగా వున్నామన్న ధ్యాస కంటే విపక్షాలను ఎన్నిరకాలుగా వేధించవచ్చు, తిట్ట వచ్చన్నదే ప్రధానంగా భావించి తన తీరుతెన్నులు, భాషాప్రయోగం అన్నింటా మార్పు బాగా స్పష్టం చేశా రు. ఆయనతో పాటు మంత్రిమండలిలో వున్నవారూ కూడా నాయకుని అడుగుజాడలనే అనుసరించ డం పెద్ద వింతేమీ కాదు. నోటి దురద అదేదో ఆకుతో కాకుండా అర్ధం పర్ధంలేని వ్యాఖ్యలతో, తిట్లతో వది లించుకోవచ్చన్న గొప్ప సూత్రాన్ని పాటించడం అలవర్చుకున్నారు. విషయం కంటే విషం కక్కడం సులువు గదా.. అదే అనుసరించారు. మూడేళ్ల పాలనా కాలం ముగిసింది. తీరా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు.. ప్రజల అసహనం, విపక్షాల మండిపాటు, సంక్షేమాన్ని కోరుకున్నవారి నుంచి నొసటి విరుపు లూ.. అంతే! కానీ అవన్నీ చాలా వివరంగా తెలిసేట్టు చేసినా జగన్‌లో జర్రంతయినా మార్పు రాలేదు. పైగా మరింత దారుణంగా మంత్రులచేత విపక్షం మీద విరుచుకుపడేందుకు అవకాశం కల్పించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి జరిగినప్పుడు, ఆ దాడి కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల సానుభూతి కోసం స్వయంగా చేయించుకున్నారని ఆరోపిస్తూ కోడి కత్తి కహాని సినిమా కూడా బాగానే ఆడిందని తెలుగుదేశం పార్టీ సెటైర్ వేసింది. కాగా మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా జగన్ కేంద్రానికి ముద్దుబిడ్డగా మారేడన్న మాట అం తటా వినపడుతోంది. వారికి ఈయనతో అవసరం అందువల్ల జగన్‌ను పెంచి పోసిస్తున్నారన్నది విపక్షా లు అంటున్నాయి. అందుకే హామీలు, ప్రాజెక్టుల గురించి చర్చించి, వాదించి ఏదో ఒకటి సాధిద్దా మని ఢిల్లీ వెళుతోన్న ప్రతీ సారీ కేవలం ఫోటోలకే పరిమితం కావడం అందర్నీ విసిగెత్తిస్తోంది. యావత్ ప్రయా ణం వ్యర్ధమే అవు తోంది. కేవలం ఇంట రగులుతున్న కాగడా వేడి తప్పించుకోవడానికే ఆయన అలా తప్పించుకు తిరుగు తున్నారు. అన్నింటికి మించి బాబాయి వివేకానంద హత్య కేసు మరీ తలభారాన్ని పెంచింది. ఇటు విప క్షాలు, అటు సిబిఐ కూడా అదేమయింది, ఇదేమి చేశారన్న ప్రశ్నల బాణాలు, తూటాలతో ఇబ్బంది పడడం కన్నా తప్పించుకొనువాడు ధన్యుడన్నది పాటించడమే జగన్ అనుసరిస్తు న్న మార్గం. దీనికి తోడు ఇటీవల పార్టీ ప్లీనరీ పేరుతో తల్లి విజయ లక్ష్మిని పార్టీ గౌరవాధ్యక్షురాలన్న పదవి నుంచి తప్పిం చేసి తనను శాశ్వత అధ్యక్షునిగా ప్రకటించుకున్నారు. దీంతో కుటుంబ కలహాలు 70 ఎంఎం తెర మీదకి వచ్చేశాయి. అటు షర్మిల తెగ కష్టపడుతోంది, ఆమెకు సహాయపడటమే ఇప్పటి రాజ ధర్మం అను కున్న జగన్ తల్లిగారు షర్మిల పంచకి చేరినట్టే. అయితే దీన్ని జగన్ ప్రభుత్వ సలహాదా రుడు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి అనేక రంగులతో గొప్ప చిత్రంగా మార్చి ప్రజలకు చూపించే యత్నం చేస్తూ నే వున్నారు. కానీ ఇవేవీ ప్రజలకు బొత్తిగా రుచించడం లేదు. ఎవరి టేస్టు వారిది. ఇక మిగిలిన కాలమంతా కృష్ణా, రామా అనుకుంటూ గడిపేయడంలో వున్న సౌఖ్యం దేనిలోనూ వుండదని పెన్షన్ జీవులు అనుకుంటారు. జగన్ కూడా ఇక మిగిలిన కాలమంతా మోదీయే నాకు తండ్రి, అన్న, జీవము, జీవితమూనూ.. అనుకుంటూ మోడీ నామస్మరణతో పాలనాకాలం ముగించేయవచ్చు. మూడేళ్ల తర్వాత మంత్రిమండలిలో కొత్త ముఖాలను తీసుకువచ్చినంత మాత్రాన గొప్పగా సాధించేదీ ఏమీ వుండదు. రాష్ట్రప్రజలు, వైఎస్ కుటుంబం ఒకటి తలిస్తే.. జగన్ మరోటి తలిచారు.. కాలం చాలా పవర్‌ఫుల్ బ్రో!
అసలు ఏ పథకమూ ప్రజాసంక్షేమ హితం కాదు. ఏ ఆలోచనా ప్రజలకు ప్రశాంతత ఇవ్వడం లేదు. దీనికి తోడు మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇదిగాదన్నా.. అని చెప్పే అవకాశం, స్వేచ్ఛా అస్సలు లేకపోవడం మరింత విడ్డూరంగా మారింది. ఆర్ధిక పరిస్థితులు, రాష్ట్ర హోదా అంశం, మద్యపాన నిషేధం ఏవీ కూడా ప్రచారాల, హామీల ఆవరణ దాటనే లేదు. కేవలం అన్నింటికీ నవ్వు నటించడం తప్ప చేసిందేమీ లేద న్నది చిత్రంగా ఆయనకీ తెలుసు. ఈ పరిస్థితులను గ్రహించి హితవు చెప్పే ధైర్యం లేక మంత్రులు కాస్తంత వెనగ్గానే వుంటున్నారా లేక మనకెందుకులే అన్న ధోరణితో వ్యవహరిస్తున్నారా అన్నది వారికి కాకున్నా ప్రజలకు బాగా తెలిసింది.
http://www.teluguone.com/news/content/jaganits-your-fault-25-139782.html





