టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్!
Publish Date:Jul 15, 2022
Advertisement
టూ బర్డ్స్ ఎట్ వన్ షాట్.. కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే సర్కార్ ఏర్పడిన నాటి నుంచి బీజేపీ అనుసరిస్తున్న వ్యూహం ఇదే. గత ఎనిమిదేళ్లుగా దేశంలో బీజేపీ ఏం చేసినా తన వ్యతిరేకులను ఇరుకున పెట్టడం, ఇబ్బందుల పాలు చేయడం, సరెండర్ అయ్యేలా చేసుకోవడం. ఈ త్రిసూత్ర పథకంతోనే ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా బీజేపీ తీరు అదే. రాష్ట్ర విభజన నాటి నుంచీ తీసుకుంటే.. తమకు కొరుకుడు పడని తెలుగు రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెట్టేసైనా సరే అక్కడ పాగా వేయాలన్నదే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభ ఆమోదం పొందిన సమయంలో తెలంగాణ ఎంపీలను ఉద్దేశించి, అప్పట్లో సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలను ఒక సారి గుర్తు చేసుకుంటే.. ఆ పార్టీ విధానమేమిటన్నది తేలిపోతుంది. ‘పెద్దమ్మ’(సోనియా గాంధీ)నే కాదు ‘చిన్నమ్మ’ (సుష్మా స్వరాజ్)ను కూడా గుర్తుంచుకోండి.. అంటూ ఆమె చేసిన వ్యాఖ్య తెలంగాణ ఏర్పాటుకు తాము అన్ని విధాలుగా సహకరించామని చెప్పడమే. అయితే ఆ తరువాత ఇన్నేళ్లకు మోడీ రాష్ట్ర విభజన అస్తవ్యస్థంగా జరిగిందంటూ అదే లోక్ సభ సాక్షిగా ఒక ప్రకటన చేశారు. అంటే రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందనీ, దానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామనీ చెప్పకనే చెప్పినట్లే కదా. అయితే అప్పట్లో అన్ని విధాలుగా రాష్ట్ర విభజన బిల్లు అప్పట్లో రాజ్యసభ ముందుకు బిల్లు వచ్చినప్పుడు అప్పటికి బీజేపీ ఎంపీ అయిన వెంకయ్యనాయుడు ఏపీకి ప్రత్యేక హోదా కోరారు. ఆ తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చినా అది నెరవేరలేదు. ఆ సంగతి పక్కన పెడితే హైదరాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. 2024 జూన్ 2తో హైదరాబాద్ కు ఉమ్మడి రాజధాని హోదా పోతుంది. హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఇక్కడే కేంద్రం కొత్త ఎత్తుగడతో ముందుకు వస్తోంది. ఎవరూ కోరకుండానే హైదరాబాద్ ను మరో పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా కొనసాగించబోతోంది. ఆ మేరకు ఇప్పటికే బీజేపీ టాప్ లీడర్ షిప్ ఒక నిర్ణయానికి వచ్చేసిందని అంటున్నారు. ఈ వర్షాకాల సమావేశాలలోనే అందుకు సంబంధించిన బిల్లు ప్రవేశ పెట్టి ఆమోదింప చేసుకునే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో ఒకే సారి ఇటు కేసీఆర్ కు.. అటు జగన్ కు చెక్ పెట్టవచ్చని బీజేపీ భావిస్తోంది. అదెలాగంటే.. అటు మూడు రాజధానులు అంటూ జగన్ ప్రదర్శిస్తున్న దూకుడుకు బ్రేక్ వేయడం.. ఇటు మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఆంధ్రప్రదేశ్ తో పంచుకోక తప్పని పరిస్థితిని కేసీఆర్ కు కల్పించడం. అంతే కాకుండా ఉమ్మడి రాజధానిలో గవర్నర్ కు ఉన్న విచక్షణాధికారాలను, శాంతి భద్రతలపై గవర్నర్ ఆజమాయిషీని గట్టిగా అమలు చేయడం ద్వారా కేసీఆర్ కు కళ్లెం వేయడం. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా రెండు ప్రభుత్వాలనూ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడమే వ్యూహంగా ఉమ్మడి రాజధాని అంశాన్ని బలంగా తెరపైకి తీసుకువచ్చేందుకు బీజేపీ కృత నిశ్చయంతో ఉందని బీజేపీ జాతీయ నాయకులు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. సరే అదే జరిగితే ఏమౌతుంది. ముందుగా ఏపీ విషయాన్ని తీసుకుంటే.. తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లంటూ మూడు రాజధానుల విషయంలో కోర్టుల ఆదేశాలను సైతం పట్టించుకోకుండా ముందుకు వెళుతున్న జగన్ కు ఇక అడుగు ముందుకు వేసే అవకాశం ఉండదు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో పదేళ్ల పాటు ఉంటుంది కనుక ఇప్పటికిప్పుడు మూడు రాజధానుల కోసం హడావుడి ఎందుకు గమ్మునుండని బ్రేక్ వేయడానికి అవకాశం లభిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. ఏపీతో రాజధానిని పంచుకోవడానికి కేసీఆర్ సుతరామూ అంగీకరించరు. ఇప్పటికే జలాల విషయంలో ఏపీతో ఉన్న తగవులు చాలవన్నట్లు ఇప్పుడు రాజధాని విషయంలో కూడా తగాదాలు పడాల్సి వస్తే ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రులు టీఆర్ఎస్ కు దూరం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఆయన తెలంగాణ రాజధానిగా వరంగల్ ను ముందుకు తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కాకుండా యూనియన్ టెరటరీగా మార్చాలని గతంలో తాను ఆమోదించిన ప్రతిపాదననే తెరమీదకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఒక విధంగా బీజేపీ కోరుకునేది కూడా అదే. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలూ తమ హామీలను నెరవేర్చలేని స్థితికి వెళ్లి.. ఆ రెండు రాష్ట్రాలలోనూ బలపడాలన్న రాజకీయ ప్రయోజనాన్ని సాధించడం కోసం బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాలు పన్నుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడు రాజధానుల విషయంలో అడుగు ముందుకు వేయలేక.. అమరావతిని నిర్వీర్యం చేసి జగన్ ప్రజల ముందు దోషిలా నిలబడే పరిస్థితిని అటు ఏపీలో.. ఇటు తనంత తానుగా హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అన్న డిమాండ్ చేసి, తెలంగాణ ప్రజలలో కేసీఆర్ ను పలుచన అయ్యే పరిస్థితిని ఇటు తెలంగాణలో తీసుకురావడం ద్వారా రెండు రాష్ట్రాలలోనూ ప్రగతికి, సమస్యల పరిష్కారానికీ బీజేపీ అయితేనే అవకాశం ఉంటుందన్న భావన జనంలో కలిగించి రాజకీయ లబ్ధి పొందడమే బీజేపీ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్లమెంటు ఆమోదం పొందేందుకు సహకరించినా బీజేపీకి తెలుగు రాష్ట్రాలలో అనుకున్న గుర్తింపు రాలేదు. రాజకీయంగా ప్రయోజనమూ చేకూరలేదు.
http://www.teluguone.com/news/content/hyderabad-as-telugu-states-combined-capital-for-another-10--25-139779.html





