జగన్ ‘ద్వంద్వ మతతత్వం’ గోల!
Publish Date:May 16, 2024
Advertisement
కొంతమందికి రెండు దేశాల్లో పౌరసత్వం వుంటుంది. దాన్ని ‘ద్వంద్వ పౌరసత్వం’ అంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ వ్యవహారాన్ని చూస్తుంటే ‘ద్వంద్వ మతతత్వం’ అనే పదాన్ని సృష్టించాలని అనిపిస్తోంది. జగన్ పూర్వికులు ఏనాడో హిందూ మతాన్ని వదిలి క్రైస్తవాన్ని స్వీకరించారు. జగన్ కుటుంబం మొత్తం నిరంతరం ఏసు ప్రభువుకి ప్రార్థన చేసుకుంటూ వుంటారు. మంచిదే.. ఎవరి మత విశ్వాసాలు వారివి. అమెరికా పారిపోయిన విజయమ్మ అయితే, గత ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు చేతిలో బైబిల్ లేకుండా ఏనాడూ కనిపించలేదు. హిందూ మతానికి దూరమైపోయినప్పటికీ ఈ కుటుంబం ‘రెడ్డి’ అనే హిందూ కులాన్ని మాత్రం అక్కున చేర్చుకుంది. ఇది వీరి పెద్ద మనసుకు నిదర్శనం. అసలు ఈ కుటుంబం రెడ్లే కాదని, రెడ్ల ఓట్ల కోసమే ఆ మకుటం తగిలించుకున్నారని కొంతమంది నిఖార్సయిన రెడ్లు వాదిస్తూ వుంటారుగానీ, ఆ వాదనలోకి ఇప్పుడు వెళ్ళడం అనవసరం. అటు క్రైస్తవ మతానికి, ఇటు హిందూ కులానికి న్యాయం చేస్తూ ఈ కుటుంబం చాలా అభివృద్ధిలోకి వచ్చింది.. సంతోషం! అయితే, ఆమధ్య... అంటే, 2019 ఎన్నికలకు ముందు విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి అండ్ జగన్ రాసుకుని పూసుకుని తిరిగిన రోజుల్లో ఆయన ఓ ఫైన్ మార్నింగ్ జగన్‌ని నీళ్ళలో ముంచి, పైకి లేపి హిందువుగా మార్చేశారు. దాంతో హిందుత్వ భావాలు వున్నవాళ్ళందరూ మురిసిపోయారు. అయితే ఆ మురిపెం ఎక్కువకాలం మిగల్లేదు. ఆ తర్వాత జగన్ ఏనాడూ వ్యక్తిగత హోదాలో ఏనాడూ ఏ హిందూ దేవాలయానికి వెళ్ళిన ధాఖలాలు లేవు. యథాతథంగా క్రైస్తవ మత ప్రార్థనా కార్యక్రమాల్లో పాల్గొనడం, జెరూసలేం వెళ్ళడం లాంటివి జరిగిపోతూనే వున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా హిందూ దేవాలయాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు జగన్ ప్రవర్తించే తీరు జగద్విదితమే. దేవాలయంలో ఇచ్చే ప్రసాదాలు, తీర్థాలు తీసుకుంటున్నప్పుడు ఆయనలో అయిష్టత స్పష్టంగా కనిపిస్తూనే వుండేది. హిందూ మత విశ్వాసాలను పాటించకపోయినప్పటికీ, హిందూ దేవాలయాల నుంచి వచ్చిన ఆదాయాన్ని ఇతర మతాల వారికి మళ్ళించినప్పటికీ, హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులకు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ఎవరూ ఏమీ చేయలేక సర్వం మూసుకున్న పరిస్థితి. జగన్ తన క్రైస్తవంలోనే కొనసాగుతున్న యథాతథ పరిస్థితి. అదేంటో, ఎన్నికల సమయం రాగానే మరోసారి జగన్ మనసు హిందూ విశ్వాసాల మీదకి మళ్ళింది. అధికారాన్ని వచ్చేలా చేసే రాజశ్యామల యాగం మీద మక్కువతో ఆయన గత 41 రోజులకు పైగా తాడేపల్లి నివాసంలో సీక్రెట్‌గా రాజశ్యామల యాగం క్రతువులు పూర్తి చేశారు. యాగం చివరిరోజైన బుధవారం నాడు జరిగిన పూర్ణాహుతిలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా కూడా విశాఖ శారదాపీఠంలోని ఆలయంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో జగన్ రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం ఫలితంగానే తనకు అధికారం దక్కిందని జగన్ నమ్ముతున్నట్టున్నారు. అందుకు ఈసారి కూడా రాజశ్యామల యాగం ప్లాన్ చేశారు. కాకపోతే, స్వరూపానందేంద్ర సరస్వతితో జగన్‌కి చెడింది కాబట్టి, ఇప్పుడు ఆ బాధ్యత మరెవరో స్వీకరించి పూర్తి చేశారు. అంతా బాగుందిగానీ, ఇంతకీ జగన్ హిందువా, క్రైస్తవుడా అనే సందేహం, అయోమయం అటు హిందువులలో, క్రైస్తవులలో పెరిగిపోతోంది. సర్లే, ఏ మతం అయితే ఏం గానీ, వున్నది ఒకే దేవుడు.. కనిపించేవనీ దేవుడి రకరకాల రూపాలు అంతే.. ఇంతకీ ఆయన చేసిన రాజశ్యామల యాగం ఈసారి ఫలిస్తుందా? కచ్చితంగా ఫలించదు. ఎందుకంటే, రాజశ్యామల దేవత కూడా ఓటరు దేవుళ్ళ లాంటిదే. అప్పట్లో జగన్ ‘ఒక్క ఛాన్స్’ అని ప్రాధేయపడ్డాడు కాబట్టి, ఓటరు దేవుళ్ళ తరహాలోనే రాజశ్యామల దేవత కూడా కరుణించి అధికారం ఇచ్చింది. ఈ ఐదేళ్ళ పాలనలో జగన్ నిజ స్వరూపం ఏమిటో తెలిసిపోయింది కాబట్టి, ఇటు ఓటరు ఓటు వేయలేదు.. అటు రాజశ్యామలా దేవి కూడా కరుణించదు. రాజశ్యామలా దేవి కూడా ఓటరు దేవుడి లాంటిదే జగనప్పా.. ఓటరు బూత్‌కి వచ్చి ఓటు వేస్తాడు.. రాజశ్యామలాదేవి అలా ఓటు వేయకుండానే అనుగ్రహిస్తుంది. మిగతా అంతా సేమ్ టు సేమ్.. అయినా, జగన్ అంటే పడిచచ్చే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.
http://www.teluguone.com/news/content/jagan-rayashyamala-yagam-39-176159.html