కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ వచ్చే ఏడాది నుంచే.. నిజమేనా?
Publish Date:Nov 1, 2024
Advertisement
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత వరుసగా రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని విజయాలను సాధించిన కేసీఆర్.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి బోల్తా పడ్డారు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యం అన్నది పైపై మాటే వాస్తవంగా ఆయన దేశానికి ప్రధాని కావాలన్న ఆంక్ష, కాంక్ష తోనే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి, తెలంగాణను వదిలేసి ఇతర రాష్ట్రాల రాజకీయాలలో తలదూర్చారన్నది పరిశీలకులు విశ్లేషణ. అయితే ఆయన వ్యూహాలు వికటించాయి. ఎత్తుగడలు ఫలించలేదు. పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలూ, ప్రజలే కాదు.. చివరాఖరికి కేసీఆర్ నేల విడిచి చేసిన సాముని తెలంగాణ ప్రజలే అంగీకరించలేదు. ఫలితం 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం. తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి సారిగా బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మారిపోయారు. అయితే ఈ మార్పును కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారు. పార్టీ నేతల మీద కోపమో, తన మీద తనకే కోపమో.. లేక సావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన తనను ఓడించారని ప్రజలపై అలకబూనారో తెలియదు కానీ.. ఓటమి తరువాత కేసీఆర్ మరీ నల్లపూస అయిపోయారు. ఈ పదిన్నర నెలల పైచిలుకు కాలంలో ఆయన జనం ముందుకు వచ్చింది, మీడియాతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. ఏదో మొక్కుబడికి ఒక సారి అసెంబ్లీకి హాజరయ్యారు. ఆ తరువాత లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రచారం చేశారంటే చేశారనిపించుకున్నారు. అయితే లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కనీసం బోణీ కూడా కొట్టలేదు. పుండు మీద కారం చల్లినట్లు వరుసగా రెండో సారి కూడా జనం తిరస్కరించడంతో కేసీఆర్ పూర్తిగా అజ్ణాత వాసంలోకి వెళ్లిపోయారు. అయితే కేటీఆర్, హరీస్ సహా బీఆర్ఎస్ నేతలు మాత్రం కేసీఆర్ లేస్తే మనిషి కాదు. మళ్లీ రాజకీయంగా క్రియాశీలం అవుతారు. రేవంత్ సర్కార్ కు ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు అంటూ చెబుతూ వస్తున్నారు. అదీకాక బీఆర్ఎస్ కు కర్త, కర్మ, క్రియ వంటి కేసీఆర్ మౌనం ఆ పార్టీకి తీరని నష్టం చూకూరుస్తోంది. పార్టీ శ్రేణులు సైతం కేసీఆర్ మౌనం పట్ల అసంతృప్తితో ఉండటమే కాకుండా తరచుగా ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ కీలక నేతలు కేసీఆర్ ఫలానా తేదీన బాంబు పేలుస్తారు. మళ్లీ రాజకీయాలలో క్రియాశీలం అవుతారు అంటూ తేదీలు ప్రకటిస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు తేదీలను వారు ప్రకటించారు. ఆ తేదీలు వచ్చాయి. వెళ్లిపోయాయి. కానీ కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు. ఈ తరుణంలో తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ కు ముహూర్తం ప్రకటించేశారు. ఎక్స్ వేదికగా ఆయన నిర్వహించే ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో ఆయనీ ప్రకటన చేశారు. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన మార్గదర్శకంలోనే తాము పని చేస్తున్నామని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ కు కనీసం ఏడాది సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారని వివరణ కూడా ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆయన మళ్లీ రాజకీయాలలో యాక్టివ్ అవుతారు అని కేటీఆర్ ఒక నెటిజన్ ప్రశ్నకు సవివరంగా సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానం బానే ఉంది కానీ, పార్టీ అధినేత రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇవ్వాలని అనుకున్నప్పుడు.. కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు రేవంత్ సర్కార్ పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. సమయం ఇవ్వాలన్న కేసీఆర్ నిర్ణయంతో వీరు విభేదించారా? లేక కేసీఆర్ మార్గదర్శకత్వంలోనే వీరు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటే.. ఆ మాత్రం దానికి కేసీఆర్ మౌనం ఎందుకు? అంటూ నెటిజనులు కేసీఆర్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-to-start-political-second-innings-from-january-39-187721.html