నాడూ నేడు ఫలితం ఉపాధ్యాయులకు వేధింపులు.. విద్యార్థులకు వేదన..
Publish Date:Jun 7, 2022
Advertisement
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్థంగా తయారైంది. ఉపాధ్యాయులకు బోధించే సమయం ఇవ్వకుండా వారికి బోధనేతర పనులు అప్పగించి తీవ్ర ఒత్తడి పెంచి వేధించింది. పాఠశాలకు ఎంత మంది పిల్లలు హాజరయ్యారు, మధ్యాహ్న భోజనం ఎంత మంది పిల్లలకు అందించారు వంటి వివరాలన్నీ ఫోటోలు తీసి వాట్సాప్ లో పెట్టి సంబంధిత అధికారులకు పంపాలంటూ విడ్డూరమైన నిబంధనలతో రాష్ట్రంలో బోధనను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ సర్కార్ దే అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ అస్తవ్యస్థ విధానాల ఫలితమే టెన్త్ పరీక్షా ఫలితాలలో గణనీయంగా తగ్గిన ఉత్తీర్ణతా శాతమని పరిశీలకులు అంటున్నారు. ఇదే విషయంపై తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీడియా సమావేశంలో జగన్ నాడూ.. నేడూ అంటూ చేసిన ఆర్భాటపు ప్రచారం ఫలితంగానే రెండు లక్షల మంది విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. టెన్త్ లో ఉత్తీర్ణతా శాతం తగ్గడానికి విద్యార్థుల తప్పిదమేమీ లేదని తెలుుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. టెన్త్ ఉత్తీర్ణతా శాతం తగ్గిందంటే అందుకు జగన్ ఫెయిల్యూరే తప్ప మరోకటి కాదని విమర్శించారు. ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పే పని తప్ప మిగిలిన పనులన్నీ అంటగట్టి విద్యార్థులకు చదువులు అందకుండా చేసిన ఫలితమే టెన్త్ లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం తగ్గడానికి కారణమని చంద్రబాబు విమర్శించారు. మంగళవారం మీడియాతో మట్లాడిన ఆయన జగన్ మూడేళ్లుగా నాడు-నేడు అంటే చేసిన ఆర్భాటపు ప్రచారానికి నేడు టెన్త్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతానికీ పొంతనా, పోలికే లేదన్న ఆయన.. తెలుగుదేశం హయాంలో 90 నుంచి 95శాతం ఉన్న ఉత్తీర్ణత నేడు 67 శాతానికి పడిపోవడం అంటే రాష్ట్రంలో పాఠశాల విద్యావ్యవస్థ ఎంత దౌర్బాగ్య స్థితికి దిగజారిందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు. యాప్ లు, వాట్సప్ లలో ఫొటోలు అంటూ ఉపాధ్యాయులకు విద్యార్థులకు పాఠాలు చెప్పే సమయం కూడా ఇవ్వకుండా వేధించిన ఫలితమే ఈ ఫలితాలని తెలుగుదేశం అధినేత విమర్శించారు. ఈ మూడేళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ జరగలేదు. ఉన్న ఉపాధ్యాయులకు కూడా బోధనేతర పనులు అప్పగించారు. బడుల విలీనం అంటూ అస్తవ్యస్థ విధానాలను అమలు చేశారు. ఆ ఫలితం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల నేటి వేదన రూపంలో కనిపిస్తోందని చంద్రబాబు దుయ్యబట్టారు. దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి దాపురించడానికి జగన్ విధానాలే కారణమని, ఇందుకు ఆయనే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు. ఈ తప్పు విద్యార్ధులది ఎంత మాత్రం కాదన్న చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యానికి విద్యార్థులు విపరీత నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు.
http://www.teluguone.com/news/content/jagan-polacies-reflects--decline-in-10th-results--25-137195.html





