విపక్ష హోదా.. జగన్ కు ఆ అర్హత లేదు!
Publish Date:Jul 24, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును లెక్క చేయడం లేదు. విపక్ష హోదాకు వైసీపీ తగదని విస్పష్టంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అలాగే జగన్ కు విపక్ష నేతగా ఉండే అర్హత లేదని తేల్చేశారు. అయినా జగన్ మాత్రం విపక్ష హోదా కోసం తహతహలాడుతున్నారు. ఆ హోదా ద్వారా తనకు కేబినెట్ ర్యాంక్, తద్వారా దక్కే గౌరవం కోసం వెంపర్లాడుతున్నారు. ఇందు కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తన తీరు ద్వారా తనకు విపక్ష నేత హోదా అర్హత లేదని తనకు తానే రుజువు చేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చకు గైర్హాజర్ అవ్వడం ద్వారా రాజకీయనాయకుడిగా తన బాధ్యతా రాహిత్యాన్ని జగన్ చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక కారణం. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని విస్పష్టంగా చెప్పింది. ప్రజలు కూడా ఈ చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అది వేరే సంగతి. ఇప్పుడు ఈ చట్టం రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చకు జగన్ గైర్హాజరు అయ్యారు. అసలు సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా లేరు. అంటే తాను తీసుకువచ్చిన చట్టాల విషయంలో తనకు ఇసుమంతైనా బాధ్యత లేదని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంటే తన ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని సమర్ధిస్తూ అసెంబ్లీలో తన గళాన్ని బలంగా వినిపించే ఒక మంచి అవకాశాన్ని జగన్ సభకు గైర్హాజర్ కావడం ద్వారా చేజార్చుకున్నారు. అలా చేజార్చుకోవడమే కాదు.. తాను తీసుకువచ్చిన చట్టం వల్ల ప్రయోజనం లేదనీ, ఇది ప్రజా వ్యతిరేక చట్టమనీ పరోక్షంగా అంగీకరించేసినట్లైంది. ఇలా తన బాధ్యతారాహిత్యాన్ని చాటుకుని జగన్ తనకు విపక్ష నేత హోదా అర్హత లేదని తానే రుజువు చేసుకున్నట్లైందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-not-eligible-for-opposition-status-25-181427.html





