జగన్ ఢిల్లీ ధర్నాకు ఇండియా కూటమి నేతలు.. జగన్ ది సెల్ఫ్ గోలేనా?
Publish Date:Jul 24, 2024
Advertisement
రాజకీయ హింసాకాండతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతోందని ఆరోపిస్తూ, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగారు. తనకున్న 11 మంది ఎమ్మెల్యేలు, కొందరు ఎమ్మెల్సీలు, నలుగురు ఎంపీలు, పార్టీ రాజ్యసభ సభ్యులతో హస్తిన వేదికగా ఆయన చేసిన ధర్నా ఒక విధంగా సెల్ఫ్ గోలేనంటున్నారు పరిశీలకులు. ఈ ధర్నా ద్వారా జగన్ తాను కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి చేరువ అవుతున్నాన్న సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ హాజరు కాలేదు కానీ ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలైన సమాజ్ వాదీ పార్టీ. అన్నాడీఎంకే, శివసేన రెండు గ్రూపులు, ఐయుఎంఎల్ పార్టీలకు చెందిన సభ్యులు హాజరయ్యారు. అయితే అలా హాజరైన వారిలో అఖిలేష్ యాదవ్ ను మినహాయిస్తే మిగిలిన ఎవరూ పెద్దగా గుర్తింపు ఉన్న వారు కాదు. వారి వారి పార్టీల్లోనే వారు చిన్న నేతలు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసి ఉన్నదంటూ ఏమైనా ఉందంటే అది వీరంతా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు. వీరైనా ఎలా వచ్చారంటే.. గత పదేళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి, ఆ క్రమంలో పలు పార్లమెంటరీ కమిటీల్లో ఉన్నారు. ఆ విధంగా ఆయన తనకున్న పలుకుబడిని ఉపయోగించి కొందరు ఎంపీలను జగన్ ధర్నాకు తీసుకురావడంలో సఫలమయ్యారు. అలాగే మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వానీ, ఈయన రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఓ డైరెక్టర్, ఈయనను జగన్ రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. దీంతో ఆయన రిలయెన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా తన పరపతిని ఉపయోగించి మరి కొంత మంది ఎంపీలను జగన్ ధర్నాకు తీసుకువచ్చారు. సరే ఎలా వస్తే ఏమిటి కానీ, జగన్ ధర్నాకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు హస్తినలో జగన్ నిర్వహించిన ధర్నాకు హాజరయ్యారు. అంటే బీజేపీ వ్యతిరేక పార్టీలు జగన్ కు మద్దతుగా నిలిచాయి. దీని ద్వారా జగన్ కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తాను కాంగ్రెస్ కు, ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమికి చేరువ అవుతున్నాన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇలా సంకేతాలు పంపడం ద్వారా రాజ్యసభలో తనకున్న సభ్యుల బలంతో బీజేపీని బ్లాక్ మెయిల్ చేయగలనని జగన్ భావిస్తుంటే భావిస్తుండ వచ్చు గాక, కానీ జగన్ పార్టీని చీల్చడం అన్నది చిటికెలో పని అని ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలే సంకేతాలిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ రాజ్యసభ సభ్యలు తెలుగుదేశం, జనసేన, బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఇంత కాలం ఏ బీజేపీ అండతో అయితే జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ ను జాప్యం చేసుకోగలిగారో, అదే బీజేపీ ఆ కేసుల విచారణకు వేగవంతం చేసి జగన్ ను ఉక్కిరిబిక్కిర చేయడం ఖాయమని అంటున్నారు. మొత్తం మీద ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మద్దతుతో హస్తినలో ధర్నాకు దిగి జగన్ సెల్ఫ్ గోల్ చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-self-goal-with-delhi-dharna-25-181423.html





