షర్మిల పగ ఇప్పట్లో చల్లారేట్టు లేదు!
Publish Date:Jul 24, 2024
Advertisement
సాధారణంగా అన్నాచెల్లెళ్ళ మధ్య కోపతాపాలు, పగలు ప్రతికారాలు ఎక్కువకాలం వుండవని అంటూ వుంటారు. వదిన కారణంగానో, ఆస్తిపాస్తుల కారణంగానో అన్నాచెల్లెళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినప్పటికీ, ఏదో ఒక సందర్భంలో చెల్లెమ్మతో అన్నయ్య ‘బాగున్నావా చెల్లెమ్మా’ అంటే, సదరు చెల్లెలు మురిసిపోతుంది. అలాగే సదరు అన్నయ్యతో చెల్లెమ్మ ‘మంచిగున్నావా అన్నయ్యా’ అంటే సదరు అన్నయ్య కరిగిపోతాడు. ఇక అప్పట్నుంచి వాళ్ళిద్దరూ ‘‘అన్నా చెల్లెలి అనుబంధం.. జన్మజన్మల సంబంధం’’ అని పాటలు పాడుకుంటూ తమ అనుబంధాన్ని కొనసాగిస్తారు. అయితే జగన్, షర్మిల విషయంలో మాత్రం మాత్రం పైన పేర్కొన్న కరిగిపోవడాలు, మురిసిపోవడాలు లాంటివేవీ కనిపించటంలేదు.. కేవలం ముదిరిపోవడాలు.. మురిగిపోవడాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ‘చెల్లెమ్మా’ అనడానికి జగన్ రెడీగా వున్నప్పటికీ, ‘వెళ్ళమ్మా’ అనే విధంగానే షర్మిల వ్యవహార శైలి కనిపిస్తోంది. మొత్తానికి జగన్ ఏ విషయంలో షర్మిలకు అన్యాయం చేశాడోగానీ, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరక ముందుకు వరకు జగన్ మీద తనకున్న వ్యతిరేకతను అంతగా బయటపెట్టలేదు. ఎప్పుడైతే ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిందో, అప్పటి నుంచి ఆమెలో వున్న ‘చంద్రముఖ’, ‘అపరిచితురాలు’ బయటకి వచ్చారు. జగన్‌ని ఎడాపెడా విమర్శించడం ప్రారంభించారు. ఆ విమర్శలు కూడా ఏదో తూతూమంత్రం విమర్శలు కాదు.. జగన్ నషాళానికి అంటే విమర్శలు... జగన్ అండ్ పార్టీ కక్కలేని, మింగలేని విమర్శలు. జగన్‌ని వేరే ఎవరైనా విమర్శిస్తే బూతులతో రెచ్చిపోయే జగన్ పార్టీ మూకలు షర్మిల విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి వచ్చింది. వేరేవాళ్ళని తిట్టినట్టుగా షర్మిలని తిడితే అది తిరిగి తమ పీకకే చుట్టుకుంటుందన్న భయంతో తమను తాము కంట్రోల్ చేసుకున్నారు. అప్పటి వరకు బాబాయ్ హత్య గురించి మరచిపోయిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కాగానే ‘హు కిల్డ్ బాబాయ్’ అనే ప్రశ్నను ఒక బాణంలాగా తయారు చేసుకుని జగన్ మీదకి వదిలారు. అలాగే మరో చెల్లెలు, వివేకా కుమార్తె సునీత కూడా షర్మిలకు తోడు రావడంతో ఇద్దరూ కలసి జగన్‌ని ఒక ఆట ఆడుకున్నారు. ఎలక్షన్ సందర్భంగా వీళ్ళు పెట్టిన శాపనార్థాలు కూడా జగన్ తుక్కుతుక్కుగా ఓడిపోవడానికి ఒక కారణంగా కొంతమంది భావిస్తూ వుంటారు. జగన్‌ని షర్మిల వందరకాలుగా విమర్శిస్తుంటే తట్టుకోలేక జగన్ ఒకే ఒకసారి ఆమెని విమర్శించాడు. అది కూడా ఆమె కట్టుకున్న చీర రంగు గురించి మాట్లాడాడు. అంతే, ఆ పాయింట్ పట్టుకుని షర్మిల జగన్‌ని ఎడాపెడా వాయించేసింది. ఆ తర్వాత షర్మిల విషయంలో జగన్ కిక్కురుమంటే ఒట్టు. షర్మిల తన మదర్ సెంటిమెంట్ ప్రయోగించి తల్లి విజయమ్మని కూడా జగన్‌కి విజయవంతంగా దూరం చేసేసింది. జగన్ బారి నుంచి తప్పించుకుని అమెరికా వెళ్ళిపోయిన విజయమ్మ అక్కడ నుంచి ‘షర్మిలకు ఓటు వేయండి’ అంటూ ఏపీ ఓటర్లను రిక్వెస్ట్ చేశారు. అంటే జగన్‌కి ఓటు వేయొద్దని చెప్పకనే చెప్పారు. కన్నతల్లిని కూడా జగన్‌కి వ్యతిరేకం చేసేసిన పవర్‌ఫుల్ పగ షర్మిలది. అందరి కృషితోతోపాటు షర్మిల శాపనార్థాలు కూడా ఫలించి జగన్ ఎన్నికలలో తుక్కుతుక్కుగా ఓడిపోయాడు. అయినప్పటికీ అన్నయ్య మీద షర్మిలకు జాలి కలగలేదు. చచ్చిన పాముని ఇంకా చంపడం ఎందుకులే అనే సానుభూతి కూడా కలగలేదు. జగన్ అధికారంలో వున్నప్పుడు అన్నయ్యని ఏ స్థాయిలో విమర్శించిందో అధికారం కోల్పోయిన తర్వాత కూడా విమర్శల డోసు ఎంతమాత్రం తగ్గలేదు. ప్రభుత్వ పథకాలను జగన్ అండ్ కో విమర్శిస్తే, ప్రభుత్వం కంటే ముందే షర్మిల ముందుకొచ్చి జగన్ మీద విమర్శలు గుప్పిస్తోంది. తమరి పరిపాలనలో ఏం వెలగబెట్టారో ముందు అది చెప్పమని సవాళ్ళు విసురుతోంది. జగన్ ఓడిపోయిన తర్వాత దారిలోకి వచ్చి, చెల్లితో సయోధ్య కుదుర్చుకుందామని అనుకున్నా షర్మిల పడనివ్వలేదు. లేటెస్ట్.గా జగన్ ప్రతిపక్ష హోదా కావాలంటూ కోర్టుకు వెళ్తే, షర్మిల వెటకారంగా ప్రతిస్పందన తెలిపింది. జగన్ ప్రతిపక్ష హోదా కావాలని హైకోర్టుకి వెళ్ళాడని, కానీ ప్రతిపక్ష హోదా కావాలి అంటే అసెంబ్లీకి వెళ్ళాలి అంటూ హితవు పలికింది. అసెంబ్లీకి వెళ్లకుండా డిల్లీలో సొంత పార్టీని నిలబెట్టుకునేందుకు ధర్నా చేస్తున్నాడు అని మండిపడింది. రాష్ట్రంలో ప్రజల సమస్యలను గాలికి వదిలేసి స్వలాభం కోసం ఢిల్లీలో ధర్నా చేస్తున్నాడని విమర్శించింది. ఎవరో కార్యకర్త మర్డరయ్యాడని ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌కి సొంత బాబాయ్ హత్య విషయంలో మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చెయ్యాలని అనిపించలేదా అని ప్రశ్నిస్తోంది. నిజమే కదా? మొత్తానికి జగన్ మీద షర్మిల పగ ఇప్పట్లో చల్లారేలా లేదు. ఈ పగ ఎప్పటికీ చల్లారకపోతేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిదని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/sharmila-grudge-cannot-be-quenched-25-181431.html





