కొడాలి నానిలా మారిపోతున్న జగన్మోహన్ రెడ్డి
Publish Date:Feb 18, 2025
Advertisement
జగన్ సంయమనం కోల్పోయారు. ఆయన నోటి నుంచి ఏం మాట వస్తోందో కూడా ఆయనకు అర్ధం కావడం లేదు. ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు వెళ్లిపోయి ముందువెనుకలాలోచించకుండా, పర్యవసానం ఎలా ఉంటుందన్న ఎరుక లేకుండా నోరు పారేసుకుంటున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఆయన కేబినెట్ సహచరులలో ఎక్కువ మంది నోటి వెంట బూతులు వినా మరో మాట వచ్చేది కాదు. జగన్ అటువంటి వారిని ప్రోత్సహించి, అందలం ఎక్కించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత జగన్ తరఫున ప్రత్యర్థులపై నోరు పారేసుకుని బూతుల పంచాగంతో విరుచుకుపడటానికి ఆయన పార్టీలో ఎవరూ సిద్ధంగా లేరు. సిద్ధంగా లేకపోవడం ఏమిటి.. ఆసలు ఆయన పొడే గిట్టదన్నట్లుగా పార్టీని వీడిపోతున్నారు. సోషల్ మీడియాలో రోత పోస్టులతో ఇష్టారీతిగా రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. చెప్పేసి తాను చాలా మంచి వాడిననీ, జగనే తనను బెదరించి, ఒత్తిడి చేసి అటువంటి అసభ్య పోస్టులు పెట్టించారనీ, ఆయన ప్రత్యర్థులపై అనుచిత విమర్శలు చేయించారనీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జగన్ మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు ఎవరినైనా ఇష్టమొచ్చినట్లు తిట్టొచ్చు. అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష పార్టీల నేతల పట్ల అత్యంత అమానవీయంగా ప్రవర్తించిన జగన్, ఆయన పార్టీ నేతలూ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. అధికారంలో ఉండగా చేసిన తప్పులకు ఇప్పుడు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితుల్లో ఉన్న వారు కూడా అధికార మదంతో తెలుగుదేశం కూటమి చట్టాలను ఉల్లంఘించి వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో తాము మళ్లీ అధికారంలోకి వస్తామనీ అప్పుడు ఇంతకింతా అనుభవించేలా చేస్తామనీ హెచ్చరికలు చేస్తున్నారు. విజయవాడ జిల్లా జైలు బయట జగన్ మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి హెచ్చరికలే చేశారు. తెలుగుదేశం ఎల్లకాలం అధికారంలో ఉండదన్న జగన్.. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోయేది వైసీపీయే అని జోస్యం చెప్పారు. అలా చెప్పి ఊరుకోకుండా.. పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. తెలుగుదేశం నేతలకు సెల్యూట్ చేస్తూ, వారి కోసం పని చేసే పోలీసు అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలనూ వదిలిపెట్టేది లేదన్నారు. ఏడు సముద్రాల అవతలదాగినా తీసుకువచ్చి శిక్షిస్తామన్నారు. అటువంటి పోలీసు అధికారులను, వారిని ప్రోత్సహించిన తెలుగుదేశం నేతలను బట్టలూడదీసి నిలబెడతానని వార్నింగ్ ఇచ్చారు. బట్టలూడదీసి నిలబెడతా అన్న వ్యాఖ్యలు జగన్ ను కచ్చితంగా ఇరుకున పెడతాయి. ఈ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైనా ఆశ్చర్యం ఉండదు.
దీంతో ఇక తాను చెప్పినట్లు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేసే వారెవరూ పార్టీలో లేకుండా పోయారు. ఉన్న రోజా, కొడాలి నాని వంటి వారు మైకులను తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో వేరే గత్యంతరం లేక జగనే స్వయంగా రంగంలోకి దిగిపోయారా? బూతుల పంచాంగం తెరిచేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో మేము ఎవర్ని ఏమన్నా తప్పులేదు.. మీరు అంటే మాత్రం తప్పు..! క్షమించరాని నేరంకూడా అన్నట్లుగా జగన్ మాటలు ఉన్నాయి. నిజానికి మొదటి నుంచి వైసీపీ నేతల తీరు ఇదే.
http://www.teluguone.com/news/content/jagan-lost--restraint-39-193059.html





