చొక్కా పైకి మడిచే ఉంది: పులివెందులలో జగన్.. ప్రత్యర్థులకు సవాలా, క్యాడర్ కు భరోసానా.?
Publish Date:Oct 28, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్కు దూకుడుగా, ప్రత్యర్థలను రెచ్చగొట్టేలా, అవమానపరిచేలా పరుష పదజాలం ఉపయోగించే నేతగా, ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు ఒకింత వివాదాస్పదమే అయినా జగన్ ది అటువంటి వాటిని ఖాతరు చేసే తీరు కాదు. 2019 ఎన్నికల ముందు వరకూ ఆయన తన ప్రసంగాలలో, ఎన్నికల ప్రచారంలో బోలెడు సార్లు గీత దాటి విమర్శలు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద కాల్చేయాలి అంటూ అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఏకవచన ప్రయోగాలతో ఆయన దూకుడు ప్రదర్శించారు. అయితే, 2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే 2024 ఎన్నికల్లో వైసీపీ అవమానకరరీతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిందో.. అప్పటి నుంచీ జగన్ నెమ్మది నెమ్మదిగా తన పాత పంథాలోకి వెడుతున్నారు. రప్పా రప్పా, సినిమా చూపిస్తా వంటి వ్యాఖ్యలు, హెచ్చరికలతో పాత జగన్ కనిపించేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పులివెందులలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పలు సవాళ్లు విసిరారు. వాటిలో తాను ఇప్పటికే నేపథ్యంలో పులివెందుల ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, జగన్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికే చొక్కా చేతులు పైకి మడిచి సిద్ధంగా ఉన్నాననీ, ఎవరినైనా, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను పులివెందులలో ఓటు వేస్తాననీ, ఎవరైనా తనను అడ్డుకోవాలనుకున్నా, ఇంకేమైనా చేయాలనుకున్న ప్రయత్నించి చూడాలని సవాల్ విసిరారు. అయితే పులివెందులలో జగన్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రత్యర్థులను రెచ్చగొట్టడం కంటే.. సొంత క్యాడర్ ను తాను నిలబడతానన్న సంకేతం ఇవ్వడానికే చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి కాలంలో పులివెందులలో జగన్ పలుకుబడి, వైసీపీ ప్రతిష్ట ఒకింత మసకబారిన పరిస్థితులు కనిపిస్తుండటంతోనే జగన్ ఈ రీతిలో క్యాడర్ లో ఉత్సాహిం నింపడానికీ, తాను ఉన్నానన్న భరోసా ఇవ్వడానికీ చేసి ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇటువంటి దూకుడు వ్యాఖ్యలు నిజంగా పులివెందులలో వైసీపీ క్యాడర్ లో జోష్ నింపుతాయా అంటే అదే పరిశీలకులు అనుమానమేనంటున్నారు. 2024 ఎన్నికల పరాజయం తరువాత.. రాష్ట్రాన్ని వదిలి బెంగళూరులో మకాం వేసిన జగన్ చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి వస్తున్న పరిస్థితుల్లో ఆయనపై క్యాడర్ నమ్మకముంచే అవకాశాలు అంతంత మాత్రమేని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
[Jagan Comments Pulivendula Local Body Elections, YCP, AP Politics, Andhra Pradesh, Telugu One]
http://www.teluguone.com/news/content/jagan-comments-pulivendula-local-body-elections-39-235616.html





