మకాం మార్చేస్తున్న జగన్... రహస్యంగా పూజలు...
Publish Date:Aug 1, 2017
Advertisement
ప్లీనరీలో గేరు మార్చి స్పీడ్ పెంచిన వైసీపీ.... వేగంగా అడుగులేస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లే సమయం ఉండటంతో దూకుడు పెంచింది. ప్లీనరీ వేదికగా ముందస్తు మేనిఫెస్టోను ప్రకటించడమే కాకుండా... అన్న వస్తున్నాడంటూ ప్రచారం ముమ్మరం చేసింది. మరోవైపు రాజధాని ప్రాంతంలో నిర్వహించిన ప్లీనరీకి భారీ స్పందన రావడంతో... తన మకాం కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు మార్చేస్తున్నారు జగన్. అదేవిధంగా రాష్ట్ర కార్యాలయానికి సైతం కొబ్బిరికాయ కొట్టేశారు. మరోవైపు ప్రజల పల్స్ పట్టేందుకు పీకే టీమ్ సైతం విస్తృతంగా పర్యటిస్తోంది. ఇప్పటివరకూ అంశాలవారీగా ప్రభుత్వంపై పోరాటం చేసిన జగన్, ఇక నుంచి ముప్పేట దాడికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి ఏపీ రాజకీయం నడిపిన జగన్, ఇకపై అమరావతి కేంద్రంగా పార్టీ వ్యవహారాలను చక్కపెట్టనున్నారు. హైదరాబాద్‌లో ఉండటం వల్ల నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు విజయవాడ కనకదుర్గమ్మ వారధి సమీపంలో గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న తాడేపల్లిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటివరకూ స్టేట్ ఆఫీస్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీ నేతలకు అధునాతన కార్యాలయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం బందరు రోడ్డులో విజయవాడ నడిబొడ్డున సీనియర్ నేత పార్ధసారధి స్థలంలో రహస్యంగా భూమిపూజ కూడా పూర్తిచేశారు. అధికార-ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా... వైసీపీ ఎన్నికలకు కాస్తంత ముందుగానే సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండేళ్లముందే మేనిఫెస్టోని ప్రకటించిన వైసీపీ, ఇప్పుడు రాజధాని కేంద్రంగా అధికారపార్టీపై పోరాటానికి సిద్ధమవుతోంది.
http://www.teluguone.com/news/content/jagan-45-76724.html





