జానా గిదేం పని... ఇలాగైతే కష్టం...
Publish Date:Aug 1, 2017
Advertisement
కాంగ్రెస్ సీనియర్ లీడర్, సీఎల్పీ నేత జానారెడ్డిపై మరోసారి సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఊరంతా ఒక దారి అంటే.. ఉలిపిరి కట్టదో దారి అన్న తీరున జానా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నిసార్లు సర్దుకుపోయినా... ఆయన తీరులో మాత్రం మార్పు రావడం లేదంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. జానారెడ్డి వ్యవహార శైలి పార్టీకి తరచూ తలనొప్పులు తెచ్చిపెడుతోందని వాపోతున్నారు. పార్టీ నేతలంతా అధికార టీఆర్‌ఎస్‌పై పోరాటం చేస్తుంటే... జానా మాత్రం గులాబీ పార్టీకి అనుకూలంగా కామెంట్స్ చేయడం, కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తడం లాంటి చర్యలతో... అప్పటివరకూ చేసిన పోరాటాలన్నీ గాల్లో కలిసిపోతున్నాయని అంటున్నారు. గతంలోనూ ఇలాంటి పనులు ఎన్నోచేసినా ...పెద్దాయన కదా అని సర్దుకుపోయామని, కానీ ఎన్నికల దగ్గర పడుతోన్న సమయంలో ఇలాంటి పనులు పార్టీకి మంచిది కాదని ఫైరవుతున్నారు. ప్రత్యర్ధి పార్టీ నేతలను పొగడటం, మద్దతివ్వడం లాంటి చర్యలేంటని సీరియస్ అవుతున్నారు. తాజాగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధి వెంకయ్యనాయుడును అభినందిస్తూ నిర్వహించిన ఆత్మీయ సన్మాన సమావేశానికి జానారెడ్డి హాజరవడంపై టీకాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. జానా చేసిన పని అస్సలు మింగుడుపడటం లేదంటున్నారు. యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా గోపాలకృష‌్ణగాంధీని కాంగ్రెస్ బరిలోకి దింపితే... జానా మాత్రం వెంకయ్య మీటింగ్‌కి హాజరవడమేంటని ప్రశ్నిస్తున్నారు. వెంకయ్య సన్మానసభకు హాజరవడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు జానా ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయినా కాంగ్రెస్‌పై ఒంటికాలిపై విరుచుకుపడే వెంకయ్య సభకు జానా వెళ్లడమేంటంటున్నారు. ఇది సొంత పార్టీని కించపర్చడమేనని... అయినా కాంగ్రెస్‌ను విమర్శించే వెంకయ్య... జానాకు ఎలా ఆత్మీయుడు అవుతాడో చెప్పాలంటున్నారు. వెంకయ్యతో అంత సన్నిహిత సంబంధాలు, మిత్రత్వం ఉంటే... ఉపరాష‌్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఇంటికెళ్లి అభినందించాలే తప్ప... ఇలా ఎన్నికల సమయంలో సన్మాస సభలకు హాజరవడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జానా తీరు మరోసారి పార్టీలో చర్చనీయాంశమైంది. జానా వ్యవహార శైలి తరచూ వివాదాస్పదమవుతుండటంతో... త్వరలో జరగబోయే కోఆర్డినేషన్ మీటింగ్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు జానాపై హైకమాండ్‌కి ఫిర్యాదు చేసి ఉండటంతో... ఈసారి సీన్ సీరియస్‌గానే ఉందంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌ను తొలగించి... కుంతియాకు పూర్తి బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలోనే జానాకి గడ్డుపరిస్థితులు ఎదురుకావొచ్చనే టాక్ వినిపిస్తోంది.
http://www.teluguone.com/news/content/congress-leader-jana-reddy-45-76722.html





