బ్యాంక్ అకౌంట్‌కి పోర్టబిలిటీ పెట్టుకోవచ్చట..?
Publish Date:Aug 1, 2017
Advertisement
మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆప్షన్ దేశ టెలికాం రంగాన్ని పెద్ద కుదుపు కుదిపింది. అప్పటి వరకు మొబైల్ నెట్‌వర్కింగ్ కంపెనీలు ఇష్టానుసారం వ్యవహరించేవి..టాక్‌టైం, డేటాలకు సంబంధించిన టారీఫ్ సామాన్యులను బెంబేలెత్తిచ్చేవి. అలా అనీ నెట్‌వర్క్ ఆపివేద్దామంటే.. సన్నిహితులు, బంధువులు, కార్యాలయాలు, ప్రభుత్వ పథకాలు అన్నింటా ఇదే నెంబర్ . ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారుడు ఒకే నెంబర్‌తో తమకు నచ్చిన నెట్‌వర్క్‌లోకి మారేందుకు అవకాశం కల్పిస్తూ ట్రాయ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నెట్‌వర్క్ కంపెనీలు దిగివచ్చాయి..వినియోగదారుడు పోర్టబిలిటీకి మారుతున్నాడంటే చాలు వెంటనే అదిరిపోయే ఆఫర్లతో అతణ్ణి సంతృప్తిపరచేందుకు ప్రయత్నించాయి. మొబైల్ నెంబర్ పొర్టబిలిటీ లాగే బ్యాంకు అకౌంట్‌కు కూడా పోర్టబిలిటీ ఉంటే ఎంత బావుండు అని చాలా మందికి చిన్న ఆలోచన వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా సాకారం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రాన్స్‌ఫర్ ఛార్జీలు, కార్డు ఛార్జీలు, ఐఎంపీఎస్ ఛార్జీలు..అవి ఇవి అంటూ ఖాతాదారుడి జేబులు గుల్ల చేస్తున్నాయి కొన్ని బ్యాంకులు..దీంతో అకౌంట్‌ను క్లోజ్ చేసి మరో బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తున్నారు చాలా మంది. అయితే ఆ అవసరం లేకుండా అదే అకౌంట్ నెంబర్‌తో వేరే బ్యాంకులో లావాదేవీలు నిర్వహించుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ కసరత్తు చేస్తోంది. అకౌంట్ నెంబర్ పోర్టబిలిటీ సౌకర్యం కల్పించే విషయమై దృష్టి సారించాలని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా బ్యాంకులను ఆదేశించారు. దీని ద్వారా ఒక బ్యాంకు ఇచ్చే సౌకర్యాలతో సంతృప్తి చెందని ఖాతాదారుడు అకౌంట్‌ను రద్దు చేయకుండా.. అదే అకౌంట్ నెంబర్‌తో వేరే బ్యాంకులో వ్యవహారాలు కొనసాగించేందుకు అవకాశం కలుగుతుంది. అంతే కాదు దేశ ఆర్థిక రంగంలో పోటీతత్వం పెరుగుతుంది..వినియోగదారులకు మరింత మేలైన సేవలు అందించవచ్చని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. డీమోనిటైజేషన్, నల్లధనం వెలికితీత వంటి కార్యక్రమాల ద్వారా దేశ ఆర్థిక రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు నడుం కట్టిన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అకౌంట్ నెంబర్ పోర్టబిలిటీ ద్వారా ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్‌ని మరింత బలోపేతం చేస్తుందేమో వేచి చూడాలి.
http://www.teluguone.com/news/content/account-number-portability-45-76727.html





