చంద్రబాబుకి నెల రోజులు గడువు ఇస్తున్నా: జగన్
Publish Date:Jul 17, 2014
Advertisement
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న విద్వేషం గురించి తెలియనివారులేరు. అవకాశం దొరికితే చంద్రబాబుపై నిప్పులు చెరిగే జగన్మోహన్ రెడ్డి, నెలరోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మొత్తం మాఫీ చేయకపోయినట్లయితే ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఈలోగా అసెంబ్లీ సమావేశాలలో ఎలాగూ ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. వ్యవసాయ రుణాల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటం చూస్తుంటే రైతుల పట్ల ఆయనకు చాలా అపేక్ష ఉందని అందరూ పొరబడుతుంటారు. కానీ నిజానికి చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే, ఆయనను ప్రజలలో దోషిగా నిలబెట్టాలనే తపనే జగన్ లో ఎక్కువగా కనిపిస్తోంది. రైతుల పట్ల నిజంగా అంత అపేక్ష ఉంటే, తెలంగాణా రైతుల రుణాల మాఫీ గురించి కూడా మాట్లాడి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా వారి ప్రసక్తి ఎత్తలేదు. దీనిని బట్టి ఆయన రైతుల గురించి కాక చంద్రబాబును నిలదీసి, ప్రజలలో దోషిగా నిలబెట్టి, ఎన్నికలలో తనను ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే రైతు రుణాల మాఫీ గురించి పదేపదే మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చును. జగన్ తన తండ్రి మరణించిన నాటి నుండి ముఖ్యమంత్రి అవుదామని తపించిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్న జరిగిన ఎన్నికలలో ఆ అవకాశం చేతివరకు వచ్చి తప్పిపోవడానికి చంద్రబాబే కారణమని దుగ్ధ జగన్ లో ఉంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా. తను గెలుపుపై ధీమాతో అతివిశ్వాసం ప్రదర్శించితే, చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని రైతుల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలుపొందారని చాలా సార్లు చెప్పుకొన్నారు. నీతి నిజాయితీకి కట్టుబడిన తాను ప్రజలను మభ్యపెట్టడం ఇష్టంలేకనే అటువంటి హామీలు ఇవ్వలేదని అందుకే తను ఓడిపోయానని, చంద్రబాబు మాటలు నమ్మిన ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారని చెప్పుకొన్నారు. తను నీతి నిజాయితీలకు కట్టుబడి రుణాల మాఫీపై హామీ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొన్నప్పటికీ, తమ పార్టీ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తుందనే ధీమాతోనే రుణాల మాఫీపై వెనకడుగు వేసినట్లు ఆయన చెప్పకనే చెప్పారు. ఒకవేళ ఓడిపోతున్నామని ఏమాత్రం ముందు పసిగట్టినా ఆయన కూడా రుణాల మాఫీకి హామీ ఇచ్చి ఉండేవారే! ఎన్నికలలో గెలిచేందుకు ఫ్యాను గాలి వీస్తోంది...దుమ్ము దులపండి....ఐదు సంతకాలు పెడతా.. కేంద్రం మెడలు వంచుతా...ముప్పై యంపీ సీట్లు..115 యం.యల్యే సీట్లు నావే.. నాకు నచ్చిన వాడినే ప్రధాన మంత్రిని చేస్తా...అంటూ ఉత్తర ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి రుణాల మాఫీపై హామీ ఇవ్వనప్పటికీ అంతకు పదింతలు వ్యయం అయ్యే అనేక సంక్షేమ, అభివృద్ధి పధకాలు ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు. ఆ సంగతి ఆయన ఇప్పుడు చెప్పుకోకపోవచ్చు కానీ, ఆయన ఇచ్చిన అనేక హామీలను కొంతమంది ప్రజలు నమ్మబట్టే వైకాపాకు అన్ని సీట్లు వచ్చాయనే సంగతి ఆయన అంగీకరిస్తే బాగుంటుంది. ఏమయినప్పటికీ వ్యవసాయ రుణాలను మూడేళ్ళ పాటు రీషెడ్యూల్ చేయడానికి రిజర్వు బ్యాంక్ అంగీకరించింది. ఆ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది తప్ప రైతులు కాదనే సంగతి జగన్ గుర్తిస్తే బాగుంటుంది. అందువల్ల చంద్రబాబు ప్రజలలో దోషిగా నిలబెట్టాలనే ఆయన కోరిక తీరే అవకాశం లేదనే అనుకోవాలి. ఇటీవల చెన్నైలో జరిగిన భవన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఓదార్చేందుకు హడావుడిగా విజయనగరం బయలుదేరిపోయిన జగన్మోహన్ రెడ్డి, వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసిందో లేదో తెలుసుకోకుండానే, ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని నిందించి అభాసుపాలయ్యారు. అయినా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసి నవ్వుల పాలయ్యేందుకు ఉవ్విళ్లూరుతుంటే ఎవరు మాత్రం కాదంటారు.
http://www.teluguone.com/news/content/jagan-45-36058.html





