కేసీఆర్ వరం: హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు!
Publish Date:Jul 18, 2014
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్‌లో వున్న కల్లు ప్రియులు సంతోషంతో పులకరించిపోయే నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు. ఆయన మాస్టర్ బ్రెయిన్‌లో నుంచి వచ్చిన నిర్ణయం హైదరాబాద్ చరిత్రలో మరో ముందడుగు కాబోతోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే, సైబర్ సిటీ, మెట్రో నగరం, అంతర్జాతీయ స్థాయి నగరం అని చెప్పుకునే హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండగ తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కల్లు దుకాణాలు ఓపెన్ కాబోతున్నాయి. అందువల్ల కల్లు ప్రియులకు దసరా నుంచి ప్రతిరోజూ దసరా పండగే. గతంలో అంటే... 2004 సంవత్సరానికి ముందు హైదరాబాద్ నగరంలో బోలెడన్ని కల్లు కాంపౌండ్లు వుండేవి. కల్లు ప్రియులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా ఒక కల్లు బాటిల్ కొనుక్కుని తాగి ఎంజాయ్ చేసేవారు. అయితే 2004 సంవత్సరంలో తెలంగాణ ప్రజల ఆనందాన్ని, ఎంజాయ్‌మెంట్‌ని చూసి ఓర్చుకోలేని సీమాంధ్ర పాలకులు ఏవేవో సాకులు చెప్పి హైదరాబాద్ నగరం పరిధిలో కల్లు దుకాణాలను తొలగించేశారు. దాంతో కల్లుగీత కార్మికులు ఉపాధిలేక ఇబ్బందులు పడిపోయారు. వారి ఆవేదనను గమనించిన కేసీఆర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మళ్ళీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలకు అనుమతి ఇస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2004 సంవత్సరం కంటే ఇప్పుడు హైదరాబాద్‌లో జనాభా పెరిగింది కాబట్టి పెరిగిన జనాభాకి అనుగుణంగా కల్లు దుకాణాల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించారు. ఈరకంగా హైదరాబాద్‌లో పెరిగిన జనాభాలో వున్న కల్లు ప్రియులు కూడా ఎంతమాత్రం నిరాశపడకుండా తమవంతు కల్లును ఆస్వాదించవచ్చు. హైదరాబాద్ కల్లు దుకాణాలను అందరూ మెచ్చుకునేలా నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. హైదరాబాద్‌లోని కల్లు దుకాణాలలో కల్తీలేని నిఖార్సయిన కల్లును విక్రయించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. అలా చేస్తే కేవలం రెగ్యులర్ కల్లు ప్రియులను మాత్రమే కాకుండా కొత్తవారు కూడా కల్లు తాగడానికి ఆసక్తి చూపించే అవకాశం వుంది. హైదరాబాద్ కల్లు కాంపౌండ్లలో నాణ్యమైన కల్లు విక్రయించడం ద్వారా హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ హలీమ్ ఎలా పాపులర్ అయ్యాయో హైదరాబాద్ కల్లు కూడా పాపులర్ అయ్యే అవకాశం వుంటుంది. కల్లు కాంపౌండ్లకి 1956 నిబంధన విధించని కేసీఆర్‌కి హైదరాబాద్‌లోని సీమాంధ్ర సెటిలర్ కల్లు ప్రియుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.
http://www.teluguone.com/news/content/toddy-compounds-in-hyderabad-cm-kcr-45-36096.html





