తెలుగు రాష్ట్రాలను తిరిగి కలపడం అయ్యే పనేనా?
Publish Date:Feb 16, 2022
Advertisement
బీజేపీకి మరోసారి అవకాశం ఇస్తే, మళ్ళీ మోడీ ప్రధాని అయితే, ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాలను మళ్ళీ కలిపేస్తారు. ఒకటి చేస్తారు. మళ్ళీ సమైక్య రాష్రం వస్తుంది. మళ్ళీ ఆంధ్రా పాలకులు వచ్చి మన నీళ్ళు, మన నిధులు, మన నియామకాలు ఎత్తుకు పోతారు, ఇంత విపులంగా కాకపోయినా, ఇదే అర్థం వచ్చేరీతిలోనే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్,హరీష్ రావు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ అదే అంటున్నారు. అదేభాష మాట్లాడుతున్నారు. అయితే, తెరాస నాయకులు అంటున్నట్లుగా, ఆందోళన వ్యక్తపరుస్తున్న విధంగా విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ విలీనం చేయవచ్చునా, అంటే, వచ్చుననే అంటున్నారు న్యాయనిపుణులు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ (ఆర్టికల్3) ఆధారంగా అయితే రాష్ట్ర విభజ జరిగిందో, అదే ఆర్టికల్ ఆధారంగా, ఉభయ తెలు రాష్ట్రాలను పునఃవిలీనం చేయవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు.అఫ్కోర్స్ అందుకు సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయనుకోండి, అది వేరే అభిప్రాయం. అయితే, ఈరోజు (బుధవారం) మంత్రి కేటీఆర్ నిజామాబాద్’లో ఓ కార్యక్రమలో మాట్లాడుతూ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర విభజన ప్రక్రియకు సమందించి పార్లమెంట్’లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా, కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే, తెలంగాణ, ఆంధ్రను కలుపుతారని’ అందులో ఏ మాత్రం సందేహం లేదని అన్నారు. అయితే, కేటీఆర్ అనుమానాలు, ఆందోళన (?) వ్యక్త పరుస్తున్న విధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటుందా, అంటే, అవుననే వారికంటే కాదనే వారే ఎక్కువ కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫల మైనది, కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసుగు చెందారని అందుకే మళ్ళీ ‘సెంటిమెంట్’ రెచ్చకొట్టేందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను మళ్ళీ కలిపేస్తుందని అసత్య ప్రచారం చేస్తున్నారని, బీజేపీ నాయకులు అంటున్నారు. అలాగే.కాంగ్రెస్ కూడా కేసీఆర్, తెరాస నాయకులు సెంటిమెంట్’ను రెచ్చకొట్టేందుకే నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. మరోవంక రాజకీయ విశ్లేషకులు, బీజేపీ ఉభయ తెలుగు రాష్రాలను పునః విలీనం చేయదలచు కుంటే, మళ్ళీ మరోసారి అధికారంలోకి వచ్చే వరకు ఆగవలసిన అవసరం లేదని, ఇప్పుడు పార్లమెంట్’లో ఉన్న బలంతో పునఃవిలీనం చేయవచ్చని అంటున్నారు. అంతే కాకుండా, ఎన్నికలకు ముందే చేస్తే, ఇక్కడ తెలంగాణలో వచ్చే నాలుగైదు సీట్లు పోయినా ఏపీలో 25 లోక్ సభ సీట్లు బీజేపీ ఖాతాలో చేరతాయని అంటున్నారు. నిజానికి, విభజన అనేది అయిపోయిన అధ్యాయం, బీజేపీనే కాదు, మరే పార్టీ అధికారంలోకి వచ్చినా, పునఃఏకీకరణ అయ్యే పనికాదు, అంటున్నారు పరిశీలకులు.
http://www.teluguone.com/news/content/is-possible-to-merge-two-telugu-states-39-131883.html





