నెక్ట్స్ వేరియంట్ మరింత డేంజరస్!.. ఒమిక్రాన్ వీక్ అందుకేనా?
Publish Date:Jan 8, 2022
Advertisement
అల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్.. కొవిడ్ వైరస్ అపరిచితుడిలా రూపాలు మార్చేసి కుమ్మేస్తోంది. అల్ఫా నుంచి ఒమిక్రాన్ వరకూ అన్నీ ప్రమాదకరమే. కాకపోతే.. ఒమిక్రాన్‌తో కాస్త తక్కువ ప్రమాదం అంతే. ఈ తక్కువ ప్రమాదకరంగా మారడం కూడా పొరబాటుగా జరిగి ఉంటుందని.. వచ్చే వేరియంట్ మళ్లీ డేంజరస్‌గా మారే ఛాన్సెస్ ఉన్నాయని హెచ్చరిస్తున్నారు ఓ సైంటిస్ట్. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన పరిశోధకుడు రవీంద్ర గుప్తా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటంటే.... ఊపిరితిత్తుల్లోని కణాల్లో ఒమిక్రాన్ చాలా తక్కువగా ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నట్లు గుప్తా గమనించారు. పరిణామక్రమం పరంగా జరిగిన ‘పొరపాటు’ వల్లే ఒమిక్రాన్ ‘తేలికపాటి వైరస్’గా ఉందని ఆయన తెలిపారు. అందువల్ల తదుపరి వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారొచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెప్పారు. శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఈ రకం వైరస్ మరింత స్పష్టంగా కనిపించేందుకు కారణమవుతున్న కీలక యంత్రాంగాన్ని ఆయన గుర్తించారు. "కొంతకాలం తర్వాత వైరస్లు తక్కువ ప్రమాదకరంగా మారతాయన్న భావన ఉంది. దీర్ఘకాల పరిణామ క్రమంలోనే అలాంటివి జరుగుతాయి. పరిణామక్రమం పరంగా జరిగిన తప్పిదమే ఒమిక్రాన్ బలహీనంగా మారడానికి కారణం. తదుపరి వచ్చే వేరియంట్ కూడా ఒమిక్రాన్ తరహాలో తక్కువ ఇన్ఫెక్షన్ను కలిగిస్తుందని భావించకూడదు. మునుపటి వైరస్ రకాల తరహాలో అది చెలరేగొచ్చు." అని తెలిపారు. "కొందరు అంటున్నట్టు ఒమిక్రాన్.. కొవిడ్‌కు సహజసిద్ధ టీకా కాదు. దాన్ని అలా పరిగణించడం ప్రమాదకరం." అని హెచ్చరించారు. ప్రస్తుతం ఒమిక్రాన్ వల్ల స్వల్ప స్థాయి ఇన్ఫెక్షన్ మాత్రమే కలుగుతున్నందున ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టీకాల విస్తృతిని పెంచాలని ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా సూచించారు.
http://www.teluguone.com/news/content/is-next-variant-more-dangerous-than-omicron-39-129872.html





