ఉద్యమంలో హీరో!.. పాలనలో జీరో!.. కేసీఆర్ బర్త్‌డే స్పెషల్
Publish Date:Feb 17, 2022
Advertisement
అవసరం లేకపోయినా ఆర్భాటంగా 68వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఒక్క రేవంత్‌రెడ్డి మినహా.. ప్రధాని మోదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వరకూ.. అంతా ఆయనకు మర్యాదపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఇక గులాబీ శ్రేణుల హంగామా అయితే అంతాఇంతా కాదు. ఏ 60వ, లేక 70వ బర్త్‌డేనో స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఓ అర్థం.. అంతేకానీ, 68వ పుట్టిన రోజుకు ఎందుకింత హడావుడి చేస్తున్నారనే ప్రశ్న రాకమానదు. ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పతనమై.. తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. మళ్లీ ఉద్యమ కాలం నాటి ఊపు తీసుకొచ్చేలా మోదీ-కేంద్రం-బీజేపీపై విమర్శలు.. ఇలా పుట్టిన రోజు పేరుతో వేడుకలు చేస్తున్నారనే చర్చా జరుగుతోంది. నిజమే.. ఉద్యమ సారధిగా కేసీఆర్ తెలుగు ప్రజల్లో చెదరని ముద్ర వేశారు. అసమాన నాయకత్వ పటిమతో తెలంగాణ సాధించారు. ఇచ్చింది కాంగ్రెసే అయినా.. ఆ క్రెడిట్ కేసీఆర్ ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ నెత్తిన చెయ్యి పెట్టారు. ఉద్యమ సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో, అవమాన, అవహేళనలతో ఆంధ్రుల మీదా అంతే ప్రభావం చూపారు. అందుకే, అప్పట్లో ఆయన తెలంగాణ హీరో అయితే.. ఇప్పటికీ ఏపీలో విలన్. అడ్డగోలు మాటలు, వ్యూహాలు, రాజకీయ ప్రయత్నాలు, ప్రయోజనాలతో తెలంగాణను ఎలాగోలా సాకారం చేసుకున్నారు కేసీఆర్. అంతా హ్యాపీ. ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు నాయకత్వంతో ఫస్ట్ టర్మ్ రెండు రాష్ట్రాలు వెలిగిపోయాయి. సెకండ్ టర్మ్ వచ్చే సరికే.. కేసీఆర్ ప్రభ పూర్తిగా మసగబారిపోయింది. ఆయన్ను పొగిడిన నోళ్లే.. ఇప్పుడు తిట్టిపోస్తున్నాయి. జై కొట్టిన చేతులే.. ఇప్పుడు డౌన్ డౌన్ అంటున్నాయి. కేసీఆర్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. అలాగని.. ఆయనేమైనా ప్రజావ్యతిరేక పనులు చేశారా? అంటే లేదనే చెప్పాలి. ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌లా ఇసుక దోచేయడం.. అడ్డగోలు మద్యం బ్రాండ్లు అమ్మడం.. రాజధానిని మూడు ముక్కలు చేయడం.. ఉద్యోగుల జీతాలు తగ్గించడం.. ఓటీఎస్ పేరుతో పేదలను లూటీ చేయడం తరహా దుందుడుకు చర్యలేమీ చేయలేదు. అయినా, కేసీఆర్‌పై అంతటి కోపం రావడానికి కారణం.. ఆయన చేసిన పనులకు కాదు.. కేసీఆర్ చెప్పిందేదీ చేయనందుకు. అవును, దళితులకు మూడెకరాల భూమి నుంచి.. తాజా దళితబంధు వరకూ అన్నీ పిట్టల దొర మాటలే అంటున్నారు. మూడెకరాలు ఇచ్చింది లేదు.. దళితుడిని సీఎం చేసింది లేదు.. దళితబంధు కంటిన్యూ చేస్తున్నదీ లేదు. కాళేశ్వరం పేరుతో వేల కోట్లు నీళ్ల పాలు చేశారో.. జేబులో వేసుకున్నారో తెలీదు కానీ.. కొత్తగా ఒక్క ఎకరం పారిందిలేదు. అందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు లేవు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. గొర్రెలు, మేకల పంపకం ఎప్పుడో బంద్. ఎలక్షన్లు జరిగే చోట మాత్రమే.. ఓటర్లను గొర్రెల్లా మార్చేందుకు మమ అనిపిస్తున్నారు. కొత్తగా రేషన్ కార్డులు లేవు.. పింఛన్లు ఇచ్చింది లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే.. అన్నీ లేవు..లేవు..లేవులే. ఇలా, చెప్పిందేమీ చేయని సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు కేసీఆర్. రైతు బంధు, కరెంట్ కోతలు లేవనే రెండు కారణాలతో ఇంకా ఎన్నాళ్లని ఈ ముఖ్యమంత్రిని భరిస్తారు ప్రజలైనా?. అన్నేసి మాటలు చెప్పడం ఎందుకు.. అవేవీ చేయకుండా ఇలా ప్రజాగ్రహానికి గురి కావడం ఎందుకు? ఆ కోపాన్ని కేంద్రం వైపు డైవర్ట్ చేసేందుకు.. అలా ప్రెస్‌మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు?. తెలంగాణలో ప్రతిపక్షాలు బాగా బలపడ్డాయంటే అందుకు రెండే కారణాలు. మొదటిది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఘోర వైఫల్యం. ఇక రెండు.. కాంగ్రెస్‌కు రేవంత్‌రెడ్డి, బీజేపీకి బండి సంజయ్ అనే బలమైన నాయకత్వం లభించడం. ఆ విషయం గుర్తెరిగే.. ప్రజల్లో మునుపటి ఉద్యమ జోష్ రగిలించేందుకే.. కేంద్రంపై దండయాత్ర మొదలుపెట్టారని అంటారు. ఆనాడు ఆంధ్రులను బూచీగా చూపించి.. సొంతరాష్ట్రంతో అందలమెక్కితే.. ఇప్పుడు కేంద్రాన్ని భూతంలా చూపించి.. ముచ్చటగా మూడోసారి తెలంగాణను ఏలాలనేది కేసీఆర్ ఎత్తుగడలా కనిపిస్తోందని చెబుతున్నారు. అప్పుడేదో వర్కవుట్ అయిందిగానీ.. ఈసారి అదంత ఈజీ కాదంటున్నారు. బర్త్‌డే వేడుకలంటూ ఎంత హంగామా చేసినా.. ప్రజలెవరూ స్వచ్చందంగా కేసీఆర్‌కు జై కొట్టడం లేదనే వాస్తవాన్ని గుర్తిస్తే మంచిదంటున్నారు. ఇక తనవల్ల కాదని అర్థమైందో ఏమో.. ప్రశాంత్ కిశోర్‌ను తెచ్చిపెట్టుకున్నారు కేసీఆర్. మరి, ఈ తెలంగాణ చాణక్యుడు, ఆ బీహార్ చాణక్యుడు కలిసి.. తెలంగాణను ఏం చేస్తారో..!?
http://www.teluguone.com/news/content/is-kcr-hero-or-zero-39-131925.html





