జగన్‌కు ఓటమి భయం!.. అందుకే ముందస్తు ఎన్నికల వ్యూహం?
Publish Date:Mar 9, 2022
Advertisement
ఏపీలోని జగన్ ప్రభుత్వం పతనావస్థకు చేరుకుందా? అసెంబ్లీ గడువు తీరే వరకూ ఆగితే వైసీపీకి ఓటమి తప్పదా? వైసీపీ సర్కార్ పై రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకూ వ్యతిరేకత పెరిగిపోతోందా? జగన్ రెడ్డి సర్కార్ ఆలోచనలు, కార్యాచరణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడి తప్పించేశాయా? రాష్ట్రానికి సీఎం అయినా.. ఎంత డబ్బు కొట్టేశామని రోజూ లెక్కచూసుకునేలా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారా? మహిళలకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందా? అమరావతి విషయంలో కోర్టు మొట్టికాయలతో వైసీపీ సర్కార్ తలబొప్పికట్టి, దిమ్మ తిరిగిందా? ఇంకా ఇంకా ఆలస్యం చేస్తే అధికారం దేవుడెరుగు.. అసలు వైసీపీయే అడ్రస్ లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉందా? ఒక్క అవకాశం అంటే మోసపోయి జగన్ కు ఇచ్చిన ఛాన్స్ తమ నెత్తి మీద భస్మాసుర హస్తంలా మారిందని ఏపీ ప్రజలు భావిస్తున్నారా? తమ నెత్తి మీద కుంపటిని ఎప్పుడు దించేసుకుని ఊపిరి పీల్చుకుందామా? అని ఏపీ ప్రజలు రెడీగా ఉన్నారా? అంటే అవుననే సమాధానాలే పలు వర్గాల నుంచి వస్తుండడం గమనార్హం. అనాలోచిత నిర్ణయాలు, విధానాలతో ఏపీ ఖజానాను ఖాళీ చేసి, ఎలాంటి అభివృద్ధి పనీ చేపట్టకుండా రాష్ట్రాన్ని అథోగతి పాలుచేసిన జగన్ రెడ్డి పైనా.. వైసీపీ సర్కార్ పైనా ప్రజలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారనే అంచనాలు విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. వైసీపీ నేతలు కొందరు క్రిమినల్ మైండ్ సెట్ తో రోజు రోజుకూ పేట్రేగిపోతున్నారని సాధారణ ప్రజలు మొదలు ప్రతిఒక్కరి మనసులోనూ నాటుకుపోయిందంటున్నారు. కొందరు మీడియా సాక్షిగా బూతులు తిడుతూ అందరి నోళ్లలో నానుతున్నారు. మరి కొందరు మహిళలను కించపరుస్తున్నారు. సొంత బాబాయ్ హత్యపై సరిగా స్పందించని, చెల్లెలికి న్యాయం చేయని సీఎం ఇక రాష్ట్రంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తారనే ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. ఒక పక్కన వైసీపీ సర్కార్ గ్రాఫ్ రోజు రోజుకూ పడిపోతుండడం, వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదనే సూచనలు అందుతుండడంతో భయంతో సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అంటే.. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తూ నిజమే అనిపిస్తోందంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ రాజకీయ నేతల్లో ఇప్పుడు ముందస్తు ఎన్నికల ఫీవర్ వచ్చిందంటున్నారు. మద్య నిషేధం అంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చాక ఏపీలో కొత్త బ్రాండ్లతో మద్యాంధ్రప్రదేశ్ గా మార్చడాన్ని మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్లు తాకట్టు పెట్టేయడమే కాకుండా.. వచ్చే 25 ఏళ్ల పాటు మద్యనిషేధం ఊసే ఎత్తబోమనే సంకేతాన్ని వైసీపీ సర్కార్ ఇచ్చేసిందంటున్నారు. ఒక పక్కన ఏపీ మొత్తంలో ఎక్కడ చూసినా ఒక్క రోడ్డుపై ఒక్క అంగుళం మేర కూడా డాంబర్ కనిపించని దుస్థితి నెలకొంది. ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం.. రోడ్డంతా గతుకులు, రాళ్లమయం అంటున్నారు. ఈ ప్రభుత్వం మాకొద్దు ప్రభో అంటూ రాష్ట్ర ప్రజలు విసుగెత్తిపోయారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగవు. ఒక వేళ ఒకటీ అరా జరిగినా వాటిని చేసిన కాంట్రాక్టర్లకు సర్కార్ బిల్లులు చెల్లించదు.. బిల్లులు చెల్లించకపోతే.. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఎందుకు వస్తారంటూ.. కోర్టు నుంచిమొట్టికాయలు.. అయినా.. ఏమాత్రం పట్టింపులేని సర్కార్ తీరు.. ఇలా ఒక్కటి కాదు.. అనేక విషయాల్లో జగన్ రెడ్డి సర్కార్ తప్పుల మీద తప్పులు చేసింది..చేస్తూనే ఉందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఏపీలో కొత్త ఉద్యోగాల కల్పన లేదు. మరో పక్కన వైసీపీ సర్కార్ విధానాల కారణంగా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలే బయటకు వెళ్లిపోతున్న దుస్థితి నెలకొంది. చదువుకున్న ప్రతి ఒక్కరూ పొట్ట చేతపట్టుకుని పక్కరాష్ట్రానికో.. పక్క దేశానికో వలస వెళ్లాల్సిన పరిస్థితి. టీడీపీ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ గురించి వైసీపీ సర్కార్ పట్టించుకోవడమే మానేసింది. ప్రపంచ స్థాయి రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి మూడు రాజధానుల పేరుతో వైసీపీ సర్కార్ మోకాలు అడ్డుపెట్టింది. టీడీపీ హయాంలో వచ్చిన కియా కార్ల కంపెనీ నిర్వాహకులను బెదిరించే స్థితికి కూడా వైసీపీ నేతలు వెళ్లిపోవడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు. కొత్త కంపెనీలు, కొత్త ఉద్యోగాల సంగతి ఎలా ఉన్నా.. ఉన్నవాటిని వెళ్లగొట్టేలా వైసీపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. టీడీపీ హయాంలో యువతకు వందలాది ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. జగన్ రెడ్డి హయాంలో యువతను మరుగుదొడ్ల వద్ద డబ్బులు వసూలు చేసే ఉద్యోగాలిస్తామని చెప్పడం అత్యంత దారుణం అంటున్నారు. చదువుకున్న పిల్లలు జాబ్ లు లేక చికెన్, మటన్ సెంటర్లలో ఉద్యోగాలు చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ పాలన ఈ మూడేళ్లలో మహిళలపై 15 వందలకు పైగా దాడులు, అత్యాచారాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. సాక్షాత్తూ సీఎం నివాసం వద్దే యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే నిందితులను పట్టుకోలేదు. భర్త ఎదుటే భార్యపై అత్యాచారం చేసినా వైసీపీ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. జగన్ అనుకూల సామాజిక మాధ్యమాల్లో మహిళలను కించపరిచేలా పోస్టింగ్ లు పెడుతుండడాన్ని సహించని జనం ఎప్పుడెప్పుడు బుద్ధి చెబుదామా అని ఎదురుచూస్తున్న సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. అసెంబ్లీ సాక్షిగా కూడా వైసీపీ సభ్యులు మహిళల పట్ల చులకనగా చూడడం, అవమానించేలా మాట్లాడడాన్ని సహించలేకపోతున్నారంటున్నారు. అన్ని విధాలా అనాలోచిత చర్యలతో ఏపీని దివాళా తీయించడమే కాకుండా.. దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి.. ఆపై ఆస్తులు తాకట్టు పెట్టి... అన్ని శాఖల్లోని డబ్బులు బలవంతంగా లాక్కుపోయి.. దోచుకు తింటున్న జగన్ రెడ్డి సర్కార్ చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దారుణానికి తెగబడడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఈ సర్కార్ ను ఇంకా కొనసాగనిస్తే.. బ్రిటిష్ వాళ్ల మాదిరిగా జట్టు మీద కూడా పన్ను వేస్తారేమో అనే అనుమానాలు జనంలో బాగా పేరుకుపోతున్నాయి. పేదలకు దశాబ్దాలుగా గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లకు జగన్ రెడ్డి సర్కార్ ఓటీఎస్ వసూలు చేయడం ఏంటనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అధికారం కోసం జగన్ రెడ్డి కులం, మతం, ప్రాంతం ఇలా ఏ అంశాన్నయినా అడ్డుపెట్టుకుంటారనే విమర్శలు వస్తున్నాయి. ఏ విధంగా చూసినా వైసీపీ సర్కార్ పై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో.. మరింత కాలం వేసి చూస్తే.. జనం నుంచి ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందని, ఓటమి తప్పదనే భయంతో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ఆలోచన చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. కోరి తల మీదకు తెచ్చుకున్న వైసీపీ సర్కార్ కొరివిని ఎంత తొందరగా కిందపడేద్దామా అని రాష్ట్ర ప్రజలు డిసైడ్ అయ్యారనేది చంద్రబాబు వ్యాఖ్య. ఎన్నికలు ఎప్పుడు పెట్టినా వైసీపీ సర్కార్ ను ఇంటికి పంపడం తథ్యం అని చంద్రబాబు జోస్యం చెప్పడం గమనార్హం. అమ్మ ఒడి ద్వారా కొంత సొమ్ము ఇచ్చినా.. నాన్న మందుబుడ్డి పేరుతో అంతకు మించి లాగేసుకుంటున్న వైసీపీ సర్కార్ కు గుణపాఠం తప్పదని టీడీపీ అధినేత అనడం గమనార్హం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ రెడ్డిని ఇంటికి పంపడం ఖాయమని చంద్రబాబు చేస్తున్న హెచ్చరికను రాజకీయ పండితుల ప్రస్తావిస్తున్నారు. వైసీపీ సర్కార్ ఎన్ని ఫీట్లు చేసినా.. ఎన్నికల్లో గుణపాఠం తప్పదని.. అవి సాధారణ ఎన్నికలైనా.. లేదా ముందస్తు ఎన్నికలైనా.. జనం ఛీ కొట్టి తరిమేస్తారనే అభిప్రాయాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి.
http://www.teluguone.com/news/content/is-jagan-go-for-early-elections-39-132811.html





