కేసీఆర్ జాతీయ ప్రస్థానానికి ఫుల్ స్టాపేనా?
Publish Date:Aug 4, 2023
Advertisement
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ గతంలో రాష్ట్రాలు చుట్టేసిన కేసీఆర్ ఇప్పుడు తన యాత్రలను మహారాష్ట్రకే పరిమితం చేశారు. ఇందుకు కారణాలేమిటన్నది పక్కన పెడితే.. ఆయన జాతీయ రాజకీయాలలో ప్రత్యర్థి మాత్రం బీజేపీ ఎంత మాత్రం కాదని తన తీరు ద్వారా తేటతెల్లం చేస్తున్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యం అంటూ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించిన కేసీఆర్.. ఆ తరువాత మోడీ సర్కార్ పై విమర్శలు చేయడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. పైపెచ్చు మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి వస్తున్న విపక్ష కూటమితో కూడా అడుగులు కలపడం లేదు. దీంతో బీఆర్ఎస్ తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ ను సాటి తెలుగు రాష్ట్రమైన ఏపీలో విస్తరణ విషయాన్ని పట్టించుకోకుండా మహాపైనే ఎందుకు దృష్టి పెట్టారన్న ప్రశ్నలూ ఉత్పన్నమౌతున్నాయి. మహారాష్ట్రలో శివసేనను నిట్టనిలువునా చీల్చి దొడ్డి దారిన అధికారంలోకి వచ్చిన బీజేపీపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఆ వ్యతిరేకత వచ్చే సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలో బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ఉద్దేశంతోనే కేసీఆర్ మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణకు శ్రీకారం చుట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో విపక్ష కూటమిలో భాగస్వామి కాకుండా దూరంగా ఉండటం ద్వారా బీజేపీ వ్యతిరేక శక్తులు బలోపేతం కాకుండా తన వంతు ప్రయత్నం చేశారని భావించాల్సి ఉంటుందని అంటున్నారు. తొలుత జాతీయ రాజకీయాలలో ప్రవేశం అంటూ హడావుడి చేసిన కేసీఆర్.. అప్పట్లో ఇప్పుడు విపక్ష కూటమి ‘ఇండియా’లోని భాగస్వామ్య పార్టీల నేతలందరితో భేటీ అయ్యారు. అప్పట్లో కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేసినప్పుడే పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. నెలల తరబడి అదిగో ఇదిగో అంటూ ఆయన చేసిన తాత్సారంతో ఆయన జాతీయ రాజకీయ ప్రవేశం నాన్నా పులి కథ చందంగా ఉందన్న విమర్శలు సైతం అప్పట్లో గట్టిగా వినిపించాయి. ఇక ఇపుడు ఇంత దూరం వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం సంగతి అటుంచి ఉనికి కూడా అనుమానమేనన్న అనుమాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన జాతీయ రాజకీయాల అంశానికి ఇంట్రవెల్ కాదు, ఫుల్ స్టాప్ పడిపోయినట్లేనని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఈసీ ప్రమాణాల మేరకు ఓట్లు, సీట్లు రాకుంటే భారత్ రాష్ట్ర సమితి అనబడే బీఆర్ఎస్ కేవలం తెలంగాణకు పరిమితమైన ప్రాతీయపార్టీగానే మిగిలిపోవడం ఖాయమని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/is-it-a-full-stop-to-kcr-national-political-juorney-39-159474.html





