సీఎం అభ్యర్ధిగా ఈటల?.. కేసీఆర్‌కు బీజేపీ రిటర్న్ గిఫ్ట్!
Publish Date:Nov 5, 2021
Advertisement
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్’ తంతే గారెల బుట్టలో పడ్డారా? ఇప్పుడు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఆయన స్థాయి, హోదా అనూహ్యంగా పెరిగి పోయాయా? ఇంతవరకు కేసీఆర్’కు ప్రత్యర్ధి ఎవరు అనే సమాధానం లేని ప్రశ్నకు, ఇప్పుడు ఈటల సమాధానంగా నిలుస్తున్నారా? ఈటల తెలంగాణ హేమంత్ బిశ్వ శర్మ (అస్సాం ముఖ్యమంత్రి) కాబోతున్నారా? అంటే, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి, ఈటల మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో, ఏమో కానీ, ఆయన ఎప్పుడూ కూడా, ఆ కోరికలను అంతగా బయట పెట్టుకోలేదు. ఎక్కడో ఏదో సందర్భంలో, గులాబీ జెండాకు మేమే (బీసీలు) ఓనర్లమని అన్నా, అది పూర్తి స్థాయి ధిక్కార స్వరం కాదు. తిరుగుబాటు సంకేతం కూడా కాదు. రాజకీయ ప్రసంగాలలో అలాంటి దూకుడు వ్యాఖ్యలు రావడం సహజం. అయినా, ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఎందుకనో ఈటలను అదే విధంగా హరీష్ రావును తమ కుటుంబ ఆధిపత్యానికి ముప్పుగా, ప్రమాదంగా భావించారు, భయ పడ్డారు. బహుశా ఆ భయంలోంచే ఆయన ఈటలపై వేటు వేశారు. హరీష్ రావు తమ వేలితోనే తమ కంటినే పొడుచుకునేలా చేశారు. ఈరోజు హరీష్ రావు పరిస్థితి ఏమిటో చెప్పనవసరం లేదు. అడకత్తెరలో పోక చెక్కలా నలిగి పోతున్నారు. ఓ వంక అవమాన భారం, మరో వంక రేపేమిటో.. తెలియని అయోమయం. ఎవరో ఆయన సన్నిహితులే అన్నట్లుగా, పగవాడికి కూడా రాకూడని కష్టాలే హరీష్ రావుకు వచ్చాయని అంటున్నారు. అయినా, అదే సమయంలో చేసుకున్న వారికి చేసుకున్నంత అనే మాట కూడా వినిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయం తర్వాత, బీజేపీలో ఈటల గ్రాఫ్’ పెరిగిపోయిందని పార్టీ వర్గాల సమాచారం. ముఖ్యంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసకు ప్రత్యాన్మాయ శక్తిగా బీజేపీని నిలపాలని, ఆశపడుతున్న బీజేపీ కేంద్ర నాయకత్వం,ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. అస్సాంలో, కాంగ్రెస్ నుంచి వచ్చిన హేమంత్ బిశ్వ శర్మకు ఏ విధంగా అయితే కీలక బాధ్యతలు అప్పగింఛి, ఈశాన్య రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చారో, అదే విధంగా, ఈటలకు కీలక బాధ్యతలు అప్పగింఛి అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా, ముందు ముందు ఈటలను బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో వ్యూహాత్మకంగానే కావచ్చును బీజేపీ, ప్రధాని మోడీ ప్రస్తావన అంతగా తీసుకురాని, ఈటల ఎన్నికల తర్వాత స్వరం మార్చారు. మోడీ, షా, నడ్డా పేర్లను పదే పదే ప్రస్తావిస్తున్నారు. పార్టీతో దూరాన్ని దగ్గర చేసుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. మరో వంక ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాత స్నేహాన్ని పక్కన పెట్టి, తనను ఎంతగా తూలనాడినా, ఈటల ఎక్కాడా పెద్దగా గీత దాటలేదు. మాట తూలలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో కీలుబోమ్మగా మారి చేస్తున్న తప్పులకు మూల్యం చెల్లించక తప్పదనే హెచ్చరిక మాత్రమే చేశారు. కానీ, ఫలితాలు వెలువడిన తర్వాత ఎమ్మెల్యే హోదాలో కడుపులో దాచుకున్న కత్తులను బయటకు తీశారు. ముఖ్యంగా,తనను ఓడించేందుకు గట్టి కుట్రలు చేసిన హరీష్ రావు టార్గెట్’గా విమర్శలు గుప్పిస్తున్నారు, హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీలకు మద్దతుగా త్వరలోనే సిద్దిపేటలో దళితగర్జన సభ నిర్వహిస్తామని వివరించారు. దళిత గర్జన సభకు తానే నాయకత్వం వహిస్తానని వెల్లడించారు అంతే కాదు, హరీశ్‌రావు అధర్మం, అన్యాయం వైపు నిలబడ్డారని, మద్యం, కుట్రలు, డబ్బు, దౌర్జన్యాలను నమ్ముకున్న హరీశ్‌రావు వాటికే బలవుతారని శాపం పెట్టారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ఈటల సిద్దమవుతున్నారు.ఈ నేపధ్యంలోనే బీజేపీ నాయకులు, ఈటలలో మరో హేమంత్ బిశ్వ శర్మను చూస్తున్నారు.
http://www.teluguone.com/news/content/is-etela-rajender-as-bjp-cm-candidate-39-125854.html





