వీర్రాజు అవుట్?.. బీజేపీ హైకమాండ్ సీరియస్!.. చీప్ టాక్‌తో చేటు!
Publish Date:Dec 30, 2021
Advertisement
సోము వీర్రాజు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు. ఏపీ రాజకీయాల్లో కేఏ పాల్ తర్వాత అంతటి కామెడీ లీడర్‌గా మారారంటున్నారు. వీర్రాజు వ్యవహారశైలి మొదటినుంచీ బాగా కాంట్రవర్సీగా మారింది. జగన్‌కు, వైసీపీకి అనుకూలంగా ఉంటారని.. టీడీపీ, చంద్రబాబును పదే పదే టార్గెట్ చేస్తారనే విమర్శ ఉంది. తాజాగా, విజయవాడ ప్రజాగ్రహ సభతో సోము వీర్రాజు వ్యవహారం మరింత వివాదాస్పదమైంది. నాయకుడు అనేవాడికి నాలుక మీద కంట్రోల్ ఉండాలంటారు. వీర్రాజుకు ఆ కంట్రోల్ అసలేమాత్రం లేదంటారు. బీజేపీకి అధికారమిస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామంటూ ప్రకటించి కలకలం రేపారు. అటు, విజయవాడ సభ ముగియగానే సోము వీర్రాజుపై పార్టీ హైకమాండ్‌కు కంప్లైంట్స్ వెళ్లిపోయాయని తెలుస్తోంది. ఆయన మాట్లాడిన ప్రసంగాన్ని.. ఇంగ్లీష్, హిందీ సబ్ టైటిల్స్‌తో పార్టీ పెద్దలకు పంపించారట. జాతీయ మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ కూడా ఢిల్లీ చేరాయని తెలుస్తోంది. అన్నీ చూసి.. రాష్ట్ర అధ్యక్షుడేంటి.. ఇలా మాట్లాడటమేంటని మండిపడుతోందట జాతీయ నాయకత్వం. ఇటీవలే తిరుపతిలో అమిత్‌షా సోము వీర్రాజుకు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అమరావతి ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదంటూ నిలదీశారు. తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా, వీర్రాజు వారు మారనేలేదు. ఏదో అమిత్‌షా చెప్పారు కాబట్టి.. ఓసారి అమరావతి రైతుల పాదయాత్రకు వచ్చి అటెండెన్స్ వేసుకు వెళ్లారు. ఇక అంతే. అమరావతి కోసం పార్టీ వాయిస్ బలంగా వినిపించింది లేదు. కనీసం తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభకు కూడా హాజరవలేదు. జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించింది లేదు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా.. తీవ్రంగా స్పందించలేదు. మీడియా సమావేశాల్లో, ట్విట్టర్లో హడావుడి చేయటమే తప్పించి క్షేత్రస్ధాయిలో వీర్రాజు బలమైన నేతకాదు. బీజేపీని పూర్తిగా వైసీపీ అనుబంధ పార్టీగా మార్చేశారని అంటారు. అమరావతిపై మాట్లాడిన వారిని సస్పెండ్ చేసి.. పార్టీలో చేరిన కొంత మంది బలమైన నేతలను కోవర్టులుగా చూస్తూ.. ఏపీలో బీజేపీని ఎదగనీయకుండా చేశారన్న అభిప్రాయం ఉంది. ఇవన్నీ చాలవన్నట్టు.. విజయవాడ ప్రజాగ్రహ సభలో నోటికొచ్చినంత మాట్లాడి.. పార్టీని తీవ్ర ఇబ్బందులో పడేశారు. పరోక్షంగా ఆ సభను ఫ్లాప్ చేయాలనే ఉద్దేశంతోనే.. తన రహస్య స్నేహితుడైన జగన్‌కు లబ్ది చేకూర్చాలనే దురుద్దేశంతోనే.. ఆయనలా మాట్లాడారనే ఆరోపణ కూడా వినిపిస్తోంది. అదే విషయం అధిష్టానం చెవిలో వేశారట కాషాయవాదులు. సోము వీర్రాజు తీరుపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న బీజేపీ పెద్దలు.. అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని దాదాపు డిసైడైపోయారని చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు అధికారాలు కట్ చేశారు. 13 మందితో కోర్ కమిటీని నియమించారు. ఇక త్వరలోనే వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తీసేస్తారని ఢిల్లీ బీజేపీ వర్గాలు అంటున్నాయి.
సోము వీర్రాజు గంటసేపు చేసిన సుదీర్ఘ ప్రసంగం పార్టీ పరువు తీసిందంటున్నారు. వీర్రాజు వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళలంతా మండిపడుతున్నారు. ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇదే ఛాన్స్ అంటూ సోము కామెంట్లను 'వాహ్.. ఎంత గొప్ప పథకం.. ఎంత సిగ్గుమాలిన హామీ.. చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనేదే బీజేపీ జాతీయ విధానమా?' అంటూ ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ఈ డైలాగ్ నేరుగా నేషనల్ బీజేపీ లీడర్స్‌ను హర్ట్ చేసిందంటున్నారు. అటు, పలు జాతీయ పత్రికల్లోనూ, నేషనల్ న్యూస్ ఛానెల్స్‌లోనూ సోము వీర్రాజు స్టేట్మెంట్పై వార్తలు రావడంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఉలిక్కిపడింది. ఏపీలో అసలేం జరుగుతోంది? వీర్రాజు సంగతేంటంటూ ఆరా తీసిందట బీజేపీ అధిష్టానం.
http://www.teluguone.com/news/content/is-bjp-going-to-take-action-on-somu-veerraju-39-129356.html





