నావికాదళంలోకి ఐఎన్ఎస్ మహేంద్రగిరి.. ముహూర్తం ఎప్పుడంటే?
Publish Date:Jul 7, 2026
Advertisement
భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత నౌకాదళం తన అమ్ములపొదిలోకి మరో ఆస్త్రం చేరబోతున్నది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ప్రాజెక్ట్ 17 సిరీస్‌లో ఆరవ స్టెల్త్ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి అధికారికంగా నౌకాదళంలో చేరబోతున్నది. విశాఖపట్నం వేదికగా.. ఈ నెల 11న అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరిని నౌకాదళంలోకి కమిషన్ చేయనున్నారు. గత నెలలోనే ఐఎన్ఎస్ దూనగిరి భారత నౌకాదళంలో చేరి సముద్ర సరిహద్దుల్లో పహారా కాస్తుండగా.. ఇప్పుడు మహేంద్రగిరి కూడా దేశ సేవకు అందుబాటులోకి రానుంది. తూర్పు కనుమలలోని ప్రసిద్ధ మహేంద్రగిరి పర్వత శ్రేణుల పేరును సార్థకం చేస్తూ ఈ యుద్ధనౌకకు మహేంద్రగిరిగా నామకరణం చేశారు. ముంబైలోని మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎమ్డీఎల్) అత్యున్నత ప్రమాణాలతో ఈ నౌకను నిర్మించగా.. భారత నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీనికి రూపకల్పన చేసింది. శక్తిమంతమైన, గంభీరమైన, సాటిలేని అనే నినాదంతో ఈ నౌక సముద్ర గర్భంలో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయనుంది. రాబోయే రోజుల్లో ఈ యుద్ధనౌక భారత తూర్పు నౌకాదళ కమాండ్‌లో అంతర్భాగంగా మారి, బంగాళాఖాతం, హిందూ మహాసముద్ర పరిధిలో నిఘా, రక్షణ విధులను నిర్వహించనుంది. ప్రాజెక్ట్ 17ఏలో భాగంగా భారత నౌకాదళం కోసం మొత్తం ఏడు అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్‌లను సిద్ధం చేయాలనేది లక్ష్యం. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నడుస్తున్న స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ ప్రత్యేక శ్రేణిలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఆరవది కాగా, చివరిదైన ఏడవ నౌక ఐఎన్ఎస్ వింధ్యగిరి కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) వద్ద చివరి దశ నిర్మాణంలో ఉంది. ఈ శ్రేణి యుద్ధనౌకల రాకతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో శత్రు దేశాల కదలికలకు అడ్డుకట్ట వేయడం భారత్‌కు మరింత సులువు అవుతుంది. ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిస్థితులలో, ముఖ్యంగా వ్యూహాత్మక హిందూ-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ, భారత సముద్ర ప్రయోజనాల రక్షణలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి కీలక పాత్ర పోషించనుంది. ఈ అధునాతన ఫ్రిగేట్ రాకతో భారత నౌకాదళం మరింత బోలపేతం అవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. Visakhapatnam Commissioning, Project 17A Stealth Frigate, Mazagon Dock Shipbuilders, Atmanirbhar Bharat Defence
http://www.teluguone.com/news/content/ins-mahendragiri-to-join-the-navy-36-225224.html





