నల్ల సముద్రంలో చావు భయం..ప్రాణాలరచేతిలో పెట్టుకుని 13 మంది భారత నావికులు.!
Publish Date:Jul 29, 2026
Advertisement
యుద్ధాలు సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ఆ యుద్ధంతో ఎటువంటి సబంధం లేకుండా బతుకు కోసం సముద్ర అలలపై కొలువులు చేసే నావికుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా నల్ల సముద్రంలో భయానక పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్లోని చోర్నోమోర్స్క్ పోర్టులో నిలిపి ఉంచిన ఎం.వీ. అమీర్1 వాణిజ్య కార్గో నౌకలో 13 మంది భారత నావికులు సహా మొత్తం 15 మంది సిబ్బంది చిక్కుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంభయంగా గడుపుతున్నారు. నిరంతర క్షిపణి, ఆత్మాహుతి డ్రోన్ దాడుల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుంతో.. ఏ క్షణాన ఊపిరి ఆగిపోతుందో అన్న భయంతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీయూఐ) సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆ నివేదిక పేర్కొంది. ఓడకు అతి సమీపంలో వరుసగా డ్రోన్లు, క్షిపణులు పడుతుండటంతో సిబ్బంది తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారని పేర్కొంది. భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ, సదరు షిప్పింగ్ కంపెనీ యాజమాన్యం తక్షణమే జోక్యం చేసుకుని, ఆ నౌకలో చిక్కుకున్న మంది బారత నావికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి స్వదేశానికి తరలించాలని ఎఫ్ఎస్యూఐ విజ్ఞప్తి చేసింది. యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోకుంటే ఆ నావికుల ప్రాణాలు పోయే అవకాశం ఉందని పేర్కొంది. నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం ఇదే మొదటిసారి కాదు. గత వారంలో ఎంవీ ఒమోర్ఫీ అనే నౌకపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారత నావికుడు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై ఇండియా తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పాలిష్చుక్ను విదేశాంగ శాఖ నేరుగా పిలిపించి.. నావికులపై, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఇప్పుడు మరో 13 మంది ఇండియన్స్ నల్ల సముద్రంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని క్షణమొక యుగంగా గడుపుతున్న పరిస్థితి ఆందోళనకలిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే విదేశాంగ దౌత్య మార్గాల ద్వారా ఒత్తిడి పెంచి తమ వారిని సురక్షితంగా ఇంటికి చేరుస్తుందని నావికుల కుటుంబ సభ్యులు కంటిమీద కునుకు లేకుండా నిరీక్షిస్తున్నారు. Indian sailors stuck in Ukraine, Chornomorsk port attack, MV Amir 1 cargo ship, Black Sea drone attacks, Forward Seamens Union of India, TeluguOne
http://www.teluguone.com/news/content/indian-sailors-stuck-in-ukraine-36-227421.html





