హైదరాబాద్ ప్రత్యేకం సదర్.. దున్నపోతుల విన్యాసాలు అదుర్స్..
Publish Date:Nov 3, 2021
Advertisement
సదర్ పండుగ వచ్చిందో పట్నంలో మన వాళ్లు డప్పుల దరువు వేసుకుంటూ కోలాటాలు ఆడతారు.. ఇదీ పవన్ కల్యాణ్ సినిమా పాటలోని ఓ చరణం. సదర్ పండుగ విశిష్టతను ఆ పాటలో అద్భుతంగా చెప్పారు. దీపావళి పండుగకు హైదరాబాద్ లో నిర్వహించే సదర్ పండుగకు ఎంతో చరిత్ర ఉంది. సదర్ పండగ హైదరాబాద్ మహానగరంలో జరిగే ప్రధాన ఉత్సవాల్లో ఒకటి. సదర్’ అంటే తెలియని హైదరాబాదీ ఉండడు. భాగ్యనగరం కేంద్రంగా దాదాపు 200 ఏండ్లకు పూర్వమే ఈ సదర్ వేడుకలు ఉన్నవని శాసనాల ద్వారా తెలుస్తుంది. మన నగరం ఎలా దినదినాభివృద్ధి చెందుతున్నదో, సదర్ ఉత్సవం కూడా అలానే ప్రాచుర్యం పొందుతున్నది. దీపావళి పండుగ తర్వాత రెండో రోజు యాదవులు ఈ ‘సదర్’ ఉత్సవాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దీనిని దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరిస్తారు. 'సదర్' అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం 'ప్రధానమైనది' అని అర్థం. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఈ ఉత్సవ ప్రత్యేక విశేషం. పురాణేతిహాసాల ప్రకారం యాదవ కులస్థులు శ్రీకృష్ణుని వారసులుగా చెప్పుకొంటారు. శ్రీకృష్ణుడు ఆలమందలను (పశువుల సంపదను) పెంచిపోషించాడు. మానవ జీవితంలోనూ కొన్ని సామాజిక తరగతులకు, కులాలకు పశువులను పెంచడం ఒక వృత్తిగా మారింది. యాదవ కులస్థులూ పశు సంపదను పెద్ద ఎత్తున కలిగి ఉంటారు. తమ వృత్తి నుంచి ఆవిర్భవించిన ఉత్సవం నేడు క్రమ క్రమంగా సదర్ ఉత్సవంగా ఆదరణ పొందుతున్నది. ద్వాపరయుగంలో యాదవుల కుటుంబాల్లో శ్రీకృష్ణుడి బాల్యం గడిచింది. అలా యాదవుల్లో శ్రీకృష్ణుడికి విశిష్టమైన స్థానం ఉన్నది. యాదవులు ఆ కాలం నుంచే యుద్ధ విన్యాసాల్లో, ధైర్య సాహసాల్లో పెట్టింది పేరుగా ఉండేవారు. మరోపక్క జంతువుల సంరక్షణ చేసేవారు. ఆలమంద (గేదె, అవు, గొర్రె, మేక)లను సొంత కుటుంబసభ్యుల వలె పెంచేవారు. అప్పటి వ్యాపార సముదాయాల్లో బియ్యం, పప్పు దినుసులు, ఆల మందలు మొదలైనవాటికి బాగా విలువ ఉండేది. అప్పట్లో డబ్బు ఉండేది కాదు. వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. అప్పట్లో పశువులకు మంచి డిమాండ్ ఉండటం వల్ల ఒకచోట నుంచి మరోచోటికి వస్తువు మార్పిడి జరిగేది. ఆ రోజుల నుంచి కాలక్రమేణా నాణేల మార్పిడి వరకు ముఖ్యమైన ప్రదేశాల్లో వ్యాపార సముదాయాల లావాదేవీల కేంద్రాలను సదరు అని పిలిచేవారు. అలా అది సదర్ ఉత్సవంగా మారింది. హైదరాబాద్లో తప్ప సదర్ పండగ దేశంలో మరే ఇతర ప్రాంతాల్లో జరగదు. తమ జీవనాధారమైన మేకలు, గొర్రెలు, ఆవులు, గేదెలను కూడా వేడుకలు జరిగే ప్రాంతాలకు తీసుకువస్తారు. నగరంలోని కాచిగూడ, నారాయణగూడ, ఖైరతా బాద్, సైదాబాద్, బోయిన్పల్లి, ఈస్ట్మారెడ్ పల్లి, చప్ప ల్బజార్, మధురాపూర్, కార్వాన్, పాతబస్తీ తదితర మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకూ నారాయణగూడలో జరిగే ఉత్సవాలు నగర దృష్టిని ఆకర్శించే స్థాయిలో సాగుతున్నాయి. యాదవ కులస్తులు ఎక్కువగా ఉండే మున్సిపల్ డివిజన్లు, కాలనీలు, అపార్టుమెంట్ల ప్రాంగణాల్లో ఎక్కువ జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ ప్రభావం నేపథ్యంలో 2009 నుండి ఈ ఉత్సవాలు కొత్త పుంతలను తొక్కాయి. ఇందుకోసం ఉత్తర భారతదేశం లోని పంజాబ్, హర్యానాల నుంచి భారీ శరీరం కలిగిన దున్నపోతులను నగరానికి తీసుకువస్తారు. పండగకోసం అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టు కొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరి కాళ్లను పెకెత్తి యువకుడిపైకి ఉరికి వస్తుంది. అయితే భారీ శరీరం కావడం వలన అది తప్పించుకుపోయే అవకాశం ఉండదు. కొన్నింటిని సుతారంగా గంగిరెద్దులా ఆడించే ప్రయత్నం చేస్తారు. ఎంపిక చేసిన ఆవరణలో గానీ, ఖాళీ ప్రదేశంలో గానీ, బస్తీల్లో గానీ ఈ వేడుకలను నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులు అంతా ఈ ఉత్సవాలను చూసేందుకు అమిత ఆసక్తిని కనబరుస్తారు. యువకులు తీన్మార్ డాన్స్లతో హోరెత్తిస్తారు యాదవులు ఈ పండగను దృష్టిలో పెట్టుకొని కొన్ని నెలలముందు ‘ముర్రా జాతికి చెందిన దున్నలను హర్యానా, పంజాబ్, జింద్, హిస్సర్, కురుక్షేత్ర లాంటి ప్రాంతాల నుంచి తీసుకువస్తారు. ఈ ముర్రా జాతి దున్నలలో ప్రధానంగా 5 రకాలుంటాయి. వాటిలో హైదరాబాద్ షెహెన్షా, రుస్తుం, యువరాజు, ట్రంప్ దూడ, మహారాజ మొదలగువాటిని సదర్కు ముస్తాబు చేస్తారు.ఈ దున్నల ఖరీదు సుమారుగా రూ.15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఉంటుంది. వీటికి ప్రతిరోజూ 50 లీటర్ల పాలు, వందల సంఖ్యలో ఆపిల్, బాదం, పిస్తా, కాన్బెర్రా, బ్లూబెర్రీ ఆహారంగా ఇస్తారు. వైన్, విస్కీ కూడా వీటికి తాగిస్తారు. ఒక్కోదానికి నలుగురు సంరక్షకులు ఉంటారు. ప్రతిరోజూ రెండు సార్లు స్నానం చేయిస్తారు! ఒక మనిషికి అవసరమైనట్లుగా వీటికి కూడా ప్రత్యేక గది, అందులో ఫ్యాన్ ఉంటుంది. రోజుకు రెండు సార్లు ఆయిల్ మసాజ్ చేస్తారు. పండుగకు వారం ముందుగానే అలంకరణ ప్రారంభిస్తారు. దున్నపోతుల శరీరంపై ఉన్న వెంట్రుకలను తొలగించి నల్లగా నిగనిగలాడేలా తయారుచేస్తారు. అందుకు వెన్న లేదా పెరుగు ఉపయోగిస్తారు. కొమ్ములను రంగురంగుల రిబ్బన్లతో చుడుతారు. నెమలీకలను అమర్చుతారు. అలంకరించిన తర్వాత సుగం ధ ద్రవ్యాలను చల్లుతారు. అలంకరించిన దున్నపోతులతో ఉత్సాహం కలిగిన యువకులు కుస్తీ పడతారు. ముక్కుతాడును చేతబట్టుకొని అదుపు చేస్తారు. ఈ క్రమంలో దున్నపోతు తన ముందరికాళ్లను పైకెత్తి యువకులతో సమానంగా డ్యాన్స్ చేస్తుంది. అయితే భారీ శరీరం కావడంతో దున్నలను జాగ్రత్తగా చూసుకుంటారు. కొన్నింటిని గంగిరెద్దులా ఆడించే ప్రయత్నం చేస్తారు. ఎంపిక చేసిన ఆవరణలో, ఖాళీ ప్రదేశంలో, బస్తీల్లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. యువకులు, మహిళలు, విద్యార్థులంతా ఈ ఉత్సవాలను చూసేందుకు అమితాసక్తిని కనబరుస్తారు. యువకులు తీన్మార్ డాన్స్లతో హోరెత్తిస్తారు. ఈ ఉత్సవాలు ‘బఫెలో కార్నివాల్స్ ఆఫ్ హైదరాబాద్’ పేరుతో ఘనంగా జరుగుతాయి. రచయిత: పి కృష్ణ యాదవ్
http://www.teluguone.com/news/content/hyderabad-yadavs-celebrate-sadar-festival-in-deepavali-39-125806.html





