మూడేళ్ల క్రితం దొంగతనం.. ఫంక్షన్‌లో చీరతో దొరికిపోయిన దంపతులు..!
Publish Date:Aug 15, 2026
Advertisement
హైదరాబాద్ శివార్లలో చోటుచేసుకున్న ఒక దొంగతనం ఉదంతం ఇప్పుడు నగరవాసులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మూడేళ్ల క్రితం మిస్టరీగా మిగిలిపోయిన ఒక దొంగతనం కేసులో అనుకోని రీతిలో ట్విస్ట్ వెలుగు చూసింది. ఏ పోలీసు విచారణకూ దొరకని దొంగలు, ఒకే ఒక్క చీర కారణంగా చివరకు బురిడీ కొట్టి కటకటాల పాలయ్యారు. 2023లో జరిగిన ఒక నేరం, 2026లో అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగి బాధితురాలి సమయస్ఫూర్తితో కొలిక్కి వచ్చింది. ఈ క్రైమ్ కథనం వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ జాగీర్ పరిధిలోని వినాయకనగర్‌లో యాదయ్య తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న యాదయ్య తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి, సెప్టెంబర్ 19న తిరిగి ఇంటికి వచ్చేసరికి వారికీ ఊహించని షాక్ తగిలింది. ఇల్లు గుల్లైపోయి ఉంది. ఇంట్లో దాచి ఉంచిన రూ. 2,50000 నగదు, 9 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లోని విలువైన చీరలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అయితే ఎంత వెతికినా ఆధారాలు దొరక్కపోవడంతో ఆ దొంగతనం కేసు మూడేళ్ల పాటు మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక శుభకార్యానికి యాదయ్య భార్య హాజరయ్యారు. అక్కడ వేడుకలో పాల్గొన్న ఒక మహిళ కట్టుకున్న పట్టు చీరను చూసి బాధితురాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆ చీర డిజైన్, రంగు సరిగ్గా మూడేళ్ల క్రితం తమ ఇంట్లో చోరీకి గురైన చీరనే పోలి ఉంది. నిశితంగా పరిశీలించిన తర్వాత, అది ఖచ్చితంగా తన దొంగిలించబడిన చీరేనని ఆమె స్పష్టంగా నిర్ధారించుకున్నారు. ఆ చీర ధరించిన మహిళ మరెవరో కాదు.. తమ ఇంటి వెనుక నివాసముండే స్వప్న (29) అనే మహిళే. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు స్వప్నతో పాటు ఆమె భర్త రాములు (35)ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రారంభంలో స్వప్న ఆ చీర తనదేనని, కొనుగోలు చేశానని బుకాయించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు తమదైన శైలిలో గట్టిగా ప్రశ్నించేసరికి దంపతులిద్దరూ నోరు విప్పక తప్పలేదు. 2023 సెప్టెంబర్ 19న యాదయ్య ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించి తామే రూ. 2.50 లక్షల నగదు, 9 తులాల బంగారం, చీరలను దొంగిలించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దొంగిలించిన చీరను సరదాగా ఫంక్షన్‌కు కట్టుకెళ్లి దొరికిపోవడంతో మూడేళ్ల నాటి కేసు ఎట్టకేలకు ముగిసింది. పోలీసులు రాములు, స్వప్న దంపతులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Hyderabad theft case, Stolen saree exposes thieves, Bandlaguda Jagir crime news, Hyderabad police arrest, 3 year old theft case, Telangana crime news
http://www.teluguone.com/news/content/hyderabad-theft-case-36-228973.html





