ప్రేమించలేదని.. పొడిచేశాడు..
Publish Date:Mar 3, 2021
Advertisement
హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించడం లేదంటూ యువతిపై కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించలేదని అమ్మాయి రక్తం కళ్ల చూశాడు కిరాతకుడు. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్‌లో ఈ ఘటన జరిగింది. వారిద్దరికీ రెండు ఏళ్ళ పరిచయం ఉంది. ఆ పరిచయం స్నేహంగా ఉండాలని అమ్మాయి భావిస్తే.. ప్రేమగా మారాలని అబ్బాయి ఒత్తిడి తెచ్చేవాడు. ప్రేమించమని తరుచూ వేధిస్తుందనడంతో .. ఆ అమ్మాయి షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. తన ప్రేమను ఒప్పుకోలేదని కక్షతో కత్తితో పొడిచేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. హైదర్షాకోట్ లక్ష్మీనగర్ కాలనీలో ఓ యువతి (23) తల్లిదండ్రులతో కలసి ఉంటోంది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కేంద్రంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమెకు.. స్థానికంగా ఓ సెలూన్‌లో పనిచేసే హరియాణా నివాసి షారుక్‌సల్మాన్‌తో రెండేళ్ల క్రితం పరిచయమైంది. ప్రేమ పేరుతో అతడు తనను తరచుగా వేధించడంతో ఆమె షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. అయినా అతడి వేధింపులు ఆగలేదు. ఈ క్రమంలోనే.. ఆమెకు వచ్చే మే నెలలో పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు.
ఈ విషయం తెలియడంతో షారుక్ సల్మాన్ మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వెళ్లి ఆమెతో మాట్లాడాడు. మళ్లీ రాత్రి 8 గంటల సమయంలో ఆమెను ఇంట్లో నుంచి పక్కకు తీసుకెళ్లి.. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో.. కత్తితో ఆమె కడుపులో పలుమార్లు పొడిచాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతణ్ని అడ్డుకొని కేకలు పెట్టడంతో పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు అతణ్ని పట్టుకుని నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. యువతిని లంగర్‌హౌజ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/hyderabad-news-if-not-stabbed-with-a-knife-39-111025.html





