డీల్, జానా శాఖలకు కత్తెర? చీఫ్ విప్‌గా గండ్ర
Publish Date:Feb 6, 2012
Advertisement
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం నుండి ఇద్దరికి, కోస్తా నుండి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కడంతో పాటు పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశముందని వినిపిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానారెడ్డిలు ఇప్పటి వరకు నిర్వహిస్తున్న ఫోర్ట్పోలియోలకు కత్తెర వేయనున్నట్టు తెలుస్తోంది. అధిష్ఠానం అనుమతితో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న వాణిజ్య, విద్యుత్, చేనేత శాఖలు ఉన్నాయి. పాత మంత్రుల శాఖల్లో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ కొత్త మంత్రుల శాఖల్లోనే మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. వాణిజ్య, విద్యుత్ శాఖల కోసం పోటా పోటీ ఉన్నట్లుగా సమాచారం. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఆ పదవి చేపట్టినప్పటి నుండి హోంమంత్రి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. సబితా ఇంద్రా రెడ్డిని ఆ శాఖ నుండి తప్పించి ఆయనకు కట్టబెట్టవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే సిఎం కిరణ్ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి సాహసానికి పూనుకునే అవకాశం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్ని మార్పులు జరిగినప్పటికీ సామాజిక సమీకరణాల ఆధారంగా జరగనుందని తెలుస్తోంది.
కాగా, వరంగల్‌కు చెందిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అదేవిధంగా మరో ఇద్దరికి విప్ పదవులు కట్టబెట్టినట్టు తెలుస్తోంది. బొబ్బిలికి చెందిన సుజయ్ కృష్ణారంగారావుతో పాటు పీఆర్పీ నుంచి వచ్చిన అనిల్‌కుమార్‌కు విప్ పదవులు కట్టబెట్టినట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11635.html





