24స్థానాల్లో ఉప పోరు..8లోగా జగన్ వర్గంపై చర్య!..
Publish Date:Jan 23, 2012
Advertisement
హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ రాష్ట్రంలో తన తాజా పర్యటన ద్వారా తమ పార్టీ శ్రేణులను ఉపఎన్నికలకు సన్నద్ధం చేశారు. ప్రస్తుతానికి ఏడు నియోజకవర్గాల్లోనే ఉప ఎన్నికలు జరుగుతాయని కాంగ్రెస్ నేతలు నింపాదిగా ఉన్న తరుణంలో.. మొత్తం 24 స్థానాల్లో ఉపపోరు ఉంటుందంటూ ఆజాద్ బాంబు పేల్చారు. కాగా.. ఆజాద్ తన వ్యాఖ్య ద్వారా ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు నియోజకవర్గాలతో పాటు అవిశ్వాసం సందర్భంగా గీత దాటిన జగన్ వర్గంలోని 17మంది స్థానాలకూ ఒకే సారి ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలను ఇచ్చేశారు. ఆయన ఇలా చెప్పడానికి కారణమేంటి? నిజానికి.. రాష్ట్రంలో ఇప్పటికే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు లేరు. దీంతో.. ఈ ఏడు స్థానాలకూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. కానీ.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే ఈ ఏడు నియోజకవర్గాల గురించి తాము ఆలోచిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా.. ఫిబ్రవరి 13 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆ సమావేశాలకు జగన్ వర్గం ఎమ్మెల్యేలు హాజరైతే.. ప్రభుత్వానికి అవమానకరమే. అందువల్ల బడ్జెట్ సమావేశాలకు ముందే ఆ 17 మందిపై స్పీకర్ కొరడా ఝళిపించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.
అలాంటప్పుడు ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు నియోజకవర్గాలతోపాటు జగన్ వర్గంపై వేటువల్ల ఖాళీ అయ్యే 17 స్థానాలకూ కలిపి కేంద్ర ఎన్నికల సంఘం ఒకేసారి ఎన్నికలు నిర్వహించే వీలుంటుంది. ఈ విషయాన్నే ఆజాద్ సూచన ప్రాయం గా వెల్లడించారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇలా రాష్ట్రంలో ఒకేసారి 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదు. కాబట్టి ఈ ఎన్నికలను మినీ సార్వత్రిక ఎన్నికలుగా అన్ని పార్టీలూ భావిస్తున్నాయి. పార్టీలో అసంతృప్తి, గ్రూపు రాజకీయాలు, ముఠాతత్వం పెరిగిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాంటి ఫలితాలను సాధిస్తుందన్న ఆసక్తి నేతల్లో ఉంది. ఇక రాష్ట్రంలోని ప్రధాన పార్టీల బలాబలాల నిరూపణకు కూడా ఈ ఎన్నికలు వేదికగా మారనున్నాయి. తెలంగాణలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేల సెంటిమెంట్‌ను గౌరవించి ఈ ప్రాంతంలో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే.. పరకాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావిస్తున్న కొండా సురేఖకు టీఆర్ఎస్ స్నేహ హస్తం అందిస్తుందా లేదా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. కాగా.. సీమాంధ్రలోని 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11178.html





