నా పాస్ట్ గురించి చెప్పాక భర్త టార్చర్ చేస్తున్నాడు...భార్య ఆవేదన!
Publish Date:May 26, 2026
Advertisement
గతాన్ని నిజాయితీగా చెప్పడమే ఆ యువతికి శాపంగా మారింది.. భర్త వేధింపులు తాళలేక 16 నెలలకే చంటి బిడ్డతో పుట్టింటికి చేరిన భార్య... నేటి ఆధునిక కాలంలో పెళ్లి అనేది నూరేళ్ల పంట అనుకుంటారు. కానీ, కొందరి జీవితాల్లో అది ఒక పీడకలగా మారుతోంది. వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదని, తన గతాన్ని (పాస్ట్) భర్తకు నిజాయితీగా చెప్పడమే ఆ యువతి చేసిన పాపమైంది. పెళ్లికి ముందు జరిగిన విషయాల గురించి భర్తకు పూర్తిగా వివరించినప్పటికీ, అందులో ఆమె తప్పు ఏమీ లేదని క్లారిటీ ఇచ్చినప్పటికీ, ఆ భర్త మనసు కరగలేదు. పైగా, ఆ నిజాయితీనే ఆ యువతికి ఒక శాపంగా మారింది. గతాన్ని సాకుగా చూపిస్తూ పెళ్లైన కొద్ది రోజుల నుంచే భర్త మానసిక, శారీరక వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. చివరకు పెళ్లైన కేవలం 16 నెలలకే ఆ కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి పంపించేశాడు. దీంతో ఏడాది కూడా నిండని చంటి బిడ్డను చేతుల్లో పట్టుకుని, ఆ యువతి కన్నీరుమున్నీరుగా పుట్టింట్లోనే కాలం వెళ్లదీస్తోంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలను ఆ యువతి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన బాధను వివరిస్తూ ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తమది పెద్దలు కుదిర్చిన వివాహం (అరేంజ్డ్ మ్యారేజ్) అని ఆ యువతి ఆ వీడియోలో పేర్కొంది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నామని, కానీ కొన్ని నెలల నుంచే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని, క్రమంగా నరకం చూపించడం మొదలుపెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. పదే పదే తన గతాన్ని గుర్తుచేస్తూ, వేరే వాళ్లతో లేనిపోని సంబంధాలు అంటగడుతూ సైకోలా ప్రవర్తించేవాడని కన్నీరు పెట్టుకుంది. తాను పవిత్రమైనదినని, ఎలాంటి తప్పు చేయలేదని ఎంత మొత్తుకున్నా భర్త వినలేదని చెప్పింది. కనీసం తాను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా ఆ భర్త కరుణ చూపించలేదని, కడుపుతో ఉన్న సమయంలో కూడా కనీస ప్రేమను కూడా పంచకుండా టార్చర్ చేశాడని ఆ యువతి వాపోయింది. డెలివరీ అయి బిడ్డ పుట్టిన తర్వాత కూడా భర్త వేధింపులు మితిమీరిపోవడంతో, ఆ నరకాన్ని భరించలేక చివరకు పుట్టింటి బాట పట్టాల్సి వచ్చిందని తెలిపింది. ఇది చాలదన్నట్టుగా, పెళ్లి సమయంలో లక్షల్లో కట్నం సమర్పించుకున్నప్పటికీ, అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తామామలు సైతం తనను తీవ్రంగా వేధించారని ఆ యువతి ఆరోపించింది. లక్షల రూపాయల కట్నం ఇచ్చినప్పటికీ ఇంకా ఆశ చావక, చిన్న పిల్లాడితో ఉన్న కోడలిని ఇలా రోడ్డున పడేయడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోతోంది. నిజాయితీగా గతాన్ని చెబితే అర్థం చేసుకోవాల్సింది పోయి, ఇలా 16 నెలలకే సంసారాన్ని ముక్కలు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు. చంటిపాపను కూడా చూడకుండా ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తారంటూ భర్త, అత్తామామలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నేటి సమాజంలో పెళ్లిళ్ల వ్యవస్థ ఏ తీరానికి చేరుతోందో చెప్పడానికి ఈ ఘటనే ఒక ఉదాహరణ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. బాధితురాలికి న్యాయం జరగాలని, వేధింపులకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/husband-harassment-36-220954.html





