2 లక్షలకంటే తక్కువ కేసులు.. మూడో వేవ్ ముగుస్తోందా?
Publish Date:Feb 1, 2022
Advertisement
ఒకటితో స్టార్ట్ అయి.. వంద, వెయ్యి, లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలు దాటేశాయి కరోనా కేసులు. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కుమ్మేసింది. థర్డ్ వేవ్లో భారీగా కేసులు నమోదయ్యాయి. కొన్ని వారాల పాటు రెండు, మూడు లక్షల మధ్య కేసులు వచ్చాయి. తొలిసారి, 2 లక్షలకు దిగువన కొవిడ్ కేసులు నమోదవడం కాస్త ఊరట నిచ్చే అంశం. దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గి.. 2 లక్షలకు దిగువకు చేరాయి. కరోనా పాజిటివిటీ రేటు 11.6 శాతానికి తగ్గిపోయింది. ఒమిక్రాన్ కారణంగా మొదలైన మూడో ముప్పు.. గత కొద్ది రోజులుగా అదుపులో ఉండటం ఊరటనిస్తోంది. అన్ని వయస్సుల వారికి టీకాలు వేస్తుండటం వల్లే.. థర్డ్ వేవ్ ఉద్ధృతి తగ్గిందని భావిస్తున్నారు. సోమవారం 14 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,67,059 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. అంతకుముందు రోజు 2.09 లక్షల కేసులు రాగా.. తాజాగా 20 శాతం తగ్గుదల నమోదైంది. ఒక్కరోజే 2,54,076 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 94 శాతానికి పెరిగింది. క్రియాశీల కేసులు 17.4 లక్షలకు తగ్గాయి. ఆ కేసుల రేటు 4.20 శాతానికి పడిపోయింది. అయితే, మరణాల సంఖ్య భారీగా పెరగడం ఆందోళనకర పరిణామం. ఒక్కరోజులోనే వెయ్యిమందికి పైగా చనిపోయారు. ఆదివారం 959గా ఉన్న మృతుల సంఖ్య.. సోమవారం నాటికి 1,192కి పెరిగింది. ఒక్క కేరళలోనే 729 మంది చనిపోయారు.
http://www.teluguone.com/news/content/huge-drop-in-positive-cases-in-india-39-131016.html





