అంధత్వపు అడ్డుగోడలని కూల్చేసిన ఘనుడు.... ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం2025
Publish Date:Jan 4, 2025
Advertisement
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్న సామెత అందరికీ తెలిసిందే. దీనర్ధం ఇంద్రియాలన్నింటిలోనూ కళ్ళు చాలా ముఖ్యమైనవి అని. అలా ఎందుకన్నారంటే మనిషి తన జ్ఞానంలో 80 శాతందాకా కళ్ల ద్వారా చూసి నేర్చుకోవటంవల్లనే పొందుతాడు. కంటిచూపున్నవారు కళ్ళతో చూసి, చదివి విద్యావంతులై జీవితంలో స్థిర పడతారు. మరి రోజువారీ జీవితంలోనే ఎన్నో ఇబ్బందులు పడే అంధులెలా చదువుతారు? చదవాలనే తపన వాళ్ళలో ఉన్నా కూడా వారికున్న వైకల్యమే వారిని వెక్కిరిస్తుంది. కానీ, అంధుల భవిష్యత్తుని పూర్తిగా మార్చేసే తన ఆవిష్కరణతో వారికి ఒక ఆశాకిరణంలా నిలిచాడు ఫ్రెంచ్ విద్యావేత్త, ఆవిష్కర్త అయిన లూయీ బ్రెయిలీ. ఆయన చేసిన సేవలకి గుర్తింపుగా ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరుపుకుంటారు. చీకటికి అక్షరాలతో చూపును ఇచ్చి.. ప్రపంచంలో ఉన్న అంధుల జీవితాలలో వెలుగులు నింపిన లూయీ బ్రెయలీ గురించి తెలుసుకుంటే..
లూయీ బ్రెయిలీ ఎవరు….
లూయీ బ్రెయిలీ 1809, జనవరి 4న ఫ్రాన్స్‌లోని కూప్రే అనే గ్రామంలో జన్మించారు. అతని తండ్రి సైమన్-రెనె బ్రెయిల్ రాచరిక గుర్రాలకు పగ్గాలు, సాడిల్స్ తయారు చేసే పని చేస్తుండేవారు. అయితే, మూడు సంవత్సరాల వయసులో జరిగిన ప్రమాదంలో పాక్షికంగా దెబ్బతిన్న బ్రెయిలీ చూపు, తర్వాత అయిదేళ్లలోపే అతన్ని పూర్తిగా అంధుడిగా మార్చేసింది. అయినాసరే ధైర్యం కోల్పోని ఆయన పారిస్ లోని ఒక అంధుల పాఠశాలకి వెళ్ళి చదువుకుని అసాధారణ ప్రతిభావంతుడుగా గుర్తించబడ్డాడు. అప్పటివరకూ అంధులకి అందుబాటులో ఉన్న ‘’లైన్ టైప్’’ పద్ధతిలోనే కష్టపడి చదువుకుని 17ఏళ్లకే అదే స్కూల్లో ప్రొఫెసర్గా నియమించబడ్డాడు. అక్కడున్నప్పుడే అంధులకి సులువుగా ఉండే లిపి తయారుచేయాలన్న తపన మొదలైంది.
బ్రెయిలీ లిపి ఆవిష్కరణ ఇలా జరిగింది.....
అప్పటి వరకు అంధుల కోసం ఉన్న పుస్తకాల ప్రింటింగ్ విధానాలు సరైనవి కాదనిపించేవి. అందుకే ప్రొఫెసర్గా పగలు విధ్యార్ధులకి బోధిస్తూ, రాత్రిళ్ళు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారు చేయటానికి లూయీ బ్రెయిలీ కృషి చేశాడు. చీకట్లో కూడా సందేశాలను చదవడానికి అనువుగా 12 ఉబ్బెత్తు చుక్కలతో రూపొందించబడిన ప్రత్యేకమైన సైనిక గూఢచార పద్ధతి గురించి తెలుసుకున్నాడు. దీని ప్రేరణతో ఆరు ఉబ్బెత్తు చుక్కలని అవసరమైన రీతిలో పేర్చుతూ అక్షరాలను, అంకెలని, సంగీత చిహ్నాలని సూచించే బ్రెయిలీ లిపిని తయారుచేశారు. అప్పటినుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక సాధనంగా నిలిచింది.
బ్రెయిలీ లిపి అంటే.....
బ్రెయిలీ లిపి ఒక స్పర్శ ఆధారిత వ్రాతపద్ధతి. ఇందులో ఉబ్బెత్తుగా ఉండే ఆరు చుక్కల ద్వారా అక్షరాలు, సంఖ్యలు, విరామ చిహ్నాలను సూచిస్తారు. ఉబ్బెత్తు చుక్కల సమూహాన్ని 'సెల్' అని అంటారు. ప్రతీ సెల్లోనూ భిన్నంగా అమర్చిన చుక్కల ఆధారంగా అంధులు అక్షరాలు, అంకెలని గుర్తించి చదవగలుగుతారు. ఈ విధానం దృష్టిలోపం ఉన్నవారికి వ్రాతపూర్వక సమాచారం పొందడానికి సహాయపడుతుంది. బ్రెయిలీ వివిధ భాషలతో పాటు గణితం, సంగీతం వంటి సాంకేతిక నోటేషన్లకు అనుకూలంగా తయారు చేయబడింది. బ్రెయిలీ వ్రాయడానికి బ్రెయిలీ రైటర్ యంత్రం లేదా స్టైలస్, స్లేట్ వంటి సాధనాలని ఉపయోగిస్తారు.
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ల మంది పూర్తి అంధులుగా ఉన్నారు. 253 మిలియన్ల మంది ఏదో ఒక విధమైన దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వీరందరికీ బ్రెయిలీ లిపి ఒక చేయూతలా పనిచేస్తుంది. అలా ఇంతమంది అంధులకి సహాయపడుతున్న బ్రెయిలీ లిపి ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ, 2018 నవంబర్ 6న ఒక తీర్మానాన్ని ఆమోదించింది. లూయీ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరపాలని నిర్ణయించారు.
అంధుల కోసం ఏం చేయాలి?
దృష్టి లోపం ఉన్నవారికి సాధికారత కల్పించడం, వారికి విద్యా, వృత్తి అవకాశాలు అందించడం, సమాజంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం సగటు పౌరులుగా అందరి బాధ్యత. పెరుగుతున్న టెక్నాలజీవల్ల బ్రెయిలీ కూడా అభివృద్ధి చెందుతోంది. రిఫ్రెషబుల్ బ్రెయిలీ డిస్ప్లేలు, స్మార్ట్‌ఫోన్లు వంటి ఆధునిక పరికరాలు దృష్టి లోపం ఉన్నవారికి డిజిటల్ కంటెంట్‌ను చేరువ చేయడంలో పెద్ద మార్పును తెచ్చాయి. అయితే, బ్రెయిలీ పుస్తకాలు, ఇతర వనరులు ఎక్కువగా అందుబాటులో ఉండేలా చేయడం, దాని ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన పెంపొందించడం అవసరం.
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం లూయీ బ్రెయిలీ చేసిన అమూల్యమైన సేవలకు నివాళి . దృష్టి లోపం ఉన్నవారి హక్కులు, గౌరవానికి గుర్తింపు. దృష్టి లోపం ఉన్నవారిని తక్కువ చేసి చూడకుండా, జాలి పడి వదిలేయకుండా మనలో ఒకరిగా, వారికి కాస్త ప్రోత్సాహం అందిస్తే వాళ్ళు కూడా అద్భుతాలు సాధిస్తారు.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/history-of-world-braille-day-35-190796.html