హిజబ్ వివాదంలో వాదనలు.. బుధవారం మళ్లీ హియరింగ్
Publish Date:Feb 8, 2022
Advertisement
కర్నాటకను కుదిపేస్తున్న హిజబ్ వివాదం ఆ రాష్ట్ర హైకోర్టుకు చేరింది. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలో కూడా ఉడుపి జిల్లాలోని పలు కళాశాలల్లో పోటాపోటీ నిరసనలు కొనసాగాయి. వివాదం చినికిచినికి గాలివానగా మారే ప్రమాదాన్ని ఊహించిన బస్వరాజ్ బొమ్మై సర్కారు మూడు రోజులపాటు హైస్కూల్స్, కాలేజీలను మూసేయాలని ఆదేశించింది. వివాదం కోర్టు పరిశీలనలో ఉన్నందున అందరూ సంయమనం పాటించాలని, శాంతిని కాపాడాలని పిలుపునిచ్చారు. అటు హైకోర్టు జస్టిస్ దీక్షిత్ కృష్ణశ్రీపాద్ కోర్టులో వాదనలు వినడం మొదలు పెట్టారు. కొందరు మాత్రమే ఇలా అనవసరంగా ప్రవర్తిస్తున్నారని, చాలా మంది విద్యార్థులు మంచివారేనని జస్టిస్ అభిప్రాయపడ్డారు. తను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలాంటివి జరగలేదని గుర్తు చేసుకున్నారు. నిరసనలపై బ్లాంకెట్ బ్యాన్ విధించడం పైనా జస్టిస్ దీక్షిత్ అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాలు విన్నారు. బ్లాంకెట్ బ్యాన్ విధిస్తే సంయమనం దెబ్బ తినే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. వివాదం కోర్టులో ఉన్నప్పుడు నిరసనల్ని అనుమతించరాదన్న వాదనలు కూడా కోర్టు ముందుకు రావడంతో... గతేడాది ఢిల్లీలో నిరసనలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు... అలా నిరసన తెలిపే హక్కును ఆమోదించిన విషయాన్ని దీక్షిత్ గుర్తు చేశారు. అలాగే ఇలాంటి కేసులు విచారించే ముందు మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలని, తన ముందు ఓ టీవీ చూపించి అందులో రక్తం కనిపిస్తే మనసు ప్రభావితం అవుతుందంటూ కేసును బుధవారం మధ్యాహ్నం 2.30 గం.కు వాయిదా వేశారు. హిజబ్ కోసం ఆరుగురు ముస్లిం మహిళలు కోర్టుకు వెళ్లడంతో విషయం కోర్టు విచారణ పరిధిలోకి వెళ్లింది. ఉడుపిలో కొద్ది రోజుల క్రితం ఐదారు మంది ముస్లిం యువతులు హిజబ్ ధరించి క్లాసులకు రావడం మొదలు పెట్టారని, దాంతో మిగతా అమ్మాయిలంతా హిజబ్ ధరించి రావడంతో హిందూ అబ్బాయిలు, అమ్మాయిలు కూడా కొందరు కాషాయ కండువాలు కప్పుకొని వచ్చారని కాలేజీ స్టాఫ్, స్థానికులు చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/high-court-adjourns-hijab-case-to-next-day-39-131484.html





