నగరమా? నరకమా?
Publish Date:Sep 1, 2016
Advertisement
మరోసారి వర్షం పడింది. మరోసారి హైద్రాబాద్ నీటిపాలైంది. ఒకరు హైటెక్ సిటీ అంటే మరోకరు సైబర్ హబ్ అంటారు. ఇక మన నేతలైతే ఇప్పుడు హైద్రాబాద్ ని విశ్వనగరం అంటున్నారు. కాని, గట్టిగా ఒక్క జల్లు పడితే చాలు విశ్వనగరం విశ్వ ప్రయత్నం చేసినా కోలిక్కిరాదు! ఇదీ పరిస్థితి!
వర్షం పడగానే భాగ్యనగరం బెంబేలెత్తిపోవటం కొత్తేం కాదు. రొటీన్ గా మీడియా కూడా కెమెరాలు వేసుకుని రోడ్లపైకి వచ్చి జలమయమైన రోడ్లని చూపటమూ కొత్త కాదు. కాని, బుధవారం జరిగింది వేరు. వున్నట్టుండీ ఆకాశానికి చిల్లు పడ్డట్టు మేఘాలు వర్షించాయి. కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి... ఇలాంటి జోరు వాన ఆనందించాల్సిన విషయమే. కాని, నగరవాసులు మాత్రం బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సి వచ్చింది. అందుక్కారణం మన విశ్వనగరం మెయింటెనెన్సే!
ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. అందుకు తగ్గట్టే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు భాగ్యనగరంలో జరుగుతున్నాయి. ఇక మొన్న హైద్రాబాద్ కార్పోరేటర్ ఎన్నికల తరువాతైతే సిటీ కోసం ప్రత్యేకంగా తన కొడుకునే కేటాయించారు సీఎం. కేటీఆర్ రంగంలోకి దిగి రాజధానిపై కన్నేసినా పరిస్థితిలో మార్పు లేదు. మరీ విభ్రాంతికరం ఏంటంటే... కేటీఆరే స్వయంగా హైద్రాబాద్ రోడ్లు బాగోలేవని ఒప్పుకోవటం! తానూ, సీఎం కూడా రోజూ హైద్రాబాద్ రోడ్లపై తిరుగుతున్నామనీ, అవ్వి ఎంత దారుణంగా వున్నాయో తెలుసునని ఆయన అన్నారు! అయితే, ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏం లేదని ఆయనే అన్నారు. వచ్చే వర్షా కాలం వరకూ పరిస్థితిలో మార్పు రావొచ్చని కేటీఆర్ చెప్పుకొచ్చారు...
స్వయంగా మంత్రే హైద్రాబాద్ పరిస్థితి అద్వాన్నంగా వుందని అంగీకరించాక ఇక డిస్కషన్ చేసేదేముంది? కాకపోతే, ఆయన చెప్పిందాంట్లోనూ పాయింట్ వుంది. గత అరవై ఏళ్లుగా హైద్రాబాద్ ను పాలకులు బంగారు గుడ్లు పెట్టే బాతుగా చూస్తూ వచ్చారు కాని దాన్ని బాగోగుల మీద తగినంత దృష్టి పెట్టలేదు. అదే ఇవాళ్టి పరిస్థితికి కారణం. దాన్ని సరిద్దిద్దడానికి నేడున్న ప్రభుత్వానికి మరి కొంత టైం ఇవ్వటం కూడా సరైందే. అయితే, కనీసం మరోసారి కుంభవృష్టి కురిసే నాటికైనా మన విశ్వనగరం పేరుకి తగ్గట్టుగా వుంటే ... జనం హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. లేదంటే, నగరమో, నరకమో తెలియని స్థితిలో పేదలు, మధ్యతరగతి వాళ్లు ఎప్పటిలాగే సతమతం అవుతారు!
http://www.teluguone.com/news/content/heavy-rainfall-45-65900.html





