హెల్త్ వర్సిటీ పేరు మార్పు జగన్ తుగ్లక్ చర్య.. మాజీ ఎంపీ కంభంపాటి
Publish Date:Sep 21, 2022
Advertisement
ఏపీ సీఎం జగన్ తుగ్లక్ ను మించిపోయారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు అన్నారు. జగన్ తీరు పిచ్చి ముదిరింది రోకలి తలకు చుట్టండన్నట్లుగా ఉందన్నారు. తెలుగుజాతికి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ కుల,మతాలకు అతీతంగా అన్నివర్గాలకు అభిమానపాత్రుడు, అజాత శత్రువైన ఎన్టీఆర్ పేరు మార్చాలనుకోవడం తెలుగుజాతికే అవమానమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య రంగంలో ఎన్టీఆర్ తెచ్చిన సంస్కరణలకు నిదర్శనం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. వైద్య విద్యా రంగాన్ని ఆధునీకరించి, అన్ని మెడికల్ కళాశాలలను ఒకే గొడుగు కిందకు తేవాలన్న ఎన్టీఆర్ సత్సంకల్పానికి నిలువెత్తు సాక్ష్యమైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనుకోవడం దారుణమని, దుర్మార్గమని కంభంపాటి ధ్వజమెత్తారు. వైద్య విద్యారంగంలో ఎన్టీఆర్ కృషిని చరితార్ధం చేసేందుకే నారా చంద్రబాబు నాయుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరుపెట్టి గౌరవించారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటై ఇప్పటికి 36 ఏళ్లయ్యిందనీ, ఆ వర్సిటీకి ఎన్టీఆర్ పేరుపెట్టి 24ఏళ్లయ్యిందనీ పేర్కొన్న ఆయన ఇప్పుడు కొత్తగా యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం వైకాపా ప్రభుత్వ తుగ్లక్ చర్య అని విమర్శించారు. తక్షణమే ఈ పేరుమార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.
http://www.teluguone.com/news/content/health-vaesity-name-change-jagan-tuglak-deed-25-144220.html





