లక్ష్మినారాయణకు అడ్డంకులు కల్పిస్తున్న రాష్ట్రప్రభుత్వం
Publish Date:Aug 7, 2012
Advertisement
జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం కానీ, ప్రభుతాధికారులు కానీ, ఆయనకు ఏ విషయంలో సహకరించటం లేదు. వివాదస్పద జీఓల జారీ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రులకు న్యాయసహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి జెడి లక్ష్మినారాయణకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీనికి తోడు బిపి ఆచార్య, శ్రీలక్ష్మి, రాజగోపాల్ వంటి అథికారులను సిబిఐ అరెస్టు చేయటంతో ఆగ్రహంతో ఉన్న ఐఎఎస్‌లు కూడా సిబిఐ విచారణకు అడ్డంకులు కల్పిస్తున్నారు. దర్యాప్తు ముందుకు సాగాలంటే అవసరమైన సమాచారాన్ని అధికారులే సిబిఐకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ, గత నెలరోజులుగా సిబిఐ కోరిన సమాచారం ఏదీ వీరు సమకూర్చలేదని తెలిసింది. సిబిఐ అధికారికంగా, రాతపూర్వకంగా సమాచారం కోరినప్పటికీ ఏదో సాకు చెప్పి ఆ సమాచారాన్ని ఇవ్వటానికి నిరాకరిస్తున్నారు. ఆ సమాచారం ఇవ్వవలసిన ఉద్యోగులు అందుబాటులో లేరని, లేదా ఆ ఉద్యోగులు శెలవుపై ఉన్నారన్న సాకులు చెబుతున్నారు. కొన్ని కీలకమైన ఫైళ్ల వివరాలు, ఇవ్వకుండా ఉండేందుకు కొందరు ఉద్యోగులను బలవంతంగా అధికారులు శెలవుపై పంపినట్లు తెలిసింది. దీంతో అక్రమాస్తులు, అక్రమ జీఓల వ్యవహారంలో జెడి లక్ష్మినారాయణకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు సిబిఐ కేంద్ర కార్యాలయం నుంచి కూడా లక్ష్మినారాయణకు సరైన సహకారం లభించటం లేదని తెలిసింది. ఈ కేసుల దర్యాప్తునకు తనకు మరో 25 మంది సిబ్బంది కావాలని ఆయన కోరి రెండునెలలవుతున్నా ఇప్పటివరకూ వారిని కేటాయించలేదు. అంతేకాక క్లరికల్ స్థాయి సిబ్బంది కావాలంటే రాష్ట్రప్రభుత్వ సహాయం తీసుకోవాలని సిబిఐ ఉన్నతాధికారులు లక్ష్మినారాయణకు ఒక ఉచితసలహా పడేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సిబ్బందిని ఇవ్వవలసినదిగా రాష్ట్రప్రభుత్వ అధికారులను కోరినప్పటికీ ఎటువంటి ఫలితం కనిపించలేదు. ఒకవైపు సిబ్బంది లేక, మరోవైపు తగిన సమాచారం లేక లక్ష్మినారాయణ తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురవుతున్నట్లు తెలిసింది. తనకు అడుగడుగునా అడ్డంకులు కల్పించే బదులు ఈ కేసు దర్యాప్తు నుంచి తనను బదిలీ చేయాలని ఆయన ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. రాష్ట్రప్రభుత్వ అధికారులు తనకు ఎటువంటి సహాయసహకారాలు అందించటం లేదని, దీంతో తాను తన మిత్రుల ద్వారా సమచార హక్కు చట్టం కింద ధరఖాస్తులు చేయించి సమాచారం తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిరదని ఆయన ఉన్నతాథికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/government-hurdels-to-lakshmi-narayana-24-16329.html





