గోరంట్ల.. ది లీడర్.. 40 ఇయర్స్ ఇన్ టీడీపీ..
Publish Date:Mar 29, 2022
Advertisement
ఎన్నికలు వచ్చాయంటే చాలు.. నిన్నటి వరకు ఓ పార్టీలో ఉండి.. ఆ పార్టీ జెండానే కాదు.. ఆ పార్టీ అధ్యక్షుడిని సైతం తమ కీర్తనలతో చిడతలు వాయించి మరీ భజనలు చేసి తెగ మోసేయడం.. ఆ తర్వాత సదరు పార్టీ పనైపోయిందంటే.. ఓకే... ఆ పార్టీతో మన పని కూడా అయిపోయిందంటూ... సదరు నేతలు.. పక్క పార్టీల్లోకి జంప్ చేసే జంప్ జిలానీ గాళ్లు ఈ కాలంలో కోకొల్లలు. కానీ ఓ పార్టీలో చేరి.. నాటి నుంచి నేటి వరకు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉండే నాయకులు.. నేడు చాలా అరుదైపోయారు. అలాంటి అరుదైన నాయకుల్లో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందు వరుసలో ఉంటారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 1982లో విశ్వవిఖ్యత నట సార్వభౌమ ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపించడం.. ఆ క్రమంలో ఆ పార్టీ కండువానే భుజాన వేసుకోవడం.. ఆ పార్టీ జెండానే ఎత్తుకోవడం.. అలాగే ఆ పార్టీ అధినేత ఎన్టీఆర్.. సమాజమే దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లంటూ ఇచ్చిన పిలుపునే తారక రాముని మంత్రంగా చేసుకోవడం... అన్నీ ఈ గోరంట్ల బుచ్చయ్య చౌదరి జీవితంలో చక చక జరిగిపోయాయి. ఇక అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైనే కాదు... ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరగాలంటే మాత్రం ఈ గోరంట్ల వారు మూడో కాలు మీద లెస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. అధికార పార్టీ నిర్ణయాలను తూర్పార పట్టడంలోనే కాదు.. ఆ పార్టీ నేతల అరాచకాలను సైతం అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టడంలో కూడా గోరంట్లకు గోరంట్లే సాటి అని నియోజకవర్గ ప్రజలంతా అంటుంటారు. ఇంకా ఆయన గురించి క్లియర్ కట్‌గా చెప్పాలంటే మాత్రం ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ జగన్‌ను మంగలి కృష్ణ తెలుసా అంటూ సూటిగా నాటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించి.. సభలో రచ్చకు కేంద్రబింధువయ్యారీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. సీఎం వైయస్ జగన్‌ను టార్గెట్ చేసుకుని సంక్రాంతి వేళ.. కోడి పందాల నేపథ్యంలో కోడి కత్తిపై సోషల్ మీడియా సాక్షిగా సెటైర్లు వేయడం గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి గట్స్‌కు నిదర్శనం అయితే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం గుంటూరు జిల్లా బాపట్ల తాలూకాలోని నరసాయపాలెంలో సంపన్న రైతు కుటుంబంలో 1945, మార్చి 15న గోరంట్ల బుచ్చయ్య చౌదరి జన్మించారు. ఆయన తండ్రి గోరంట్ల వీరయ్య చౌదరి, తల్లి అనసూయమ్మ. బుచ్చయ్య చౌదరి బాపట్లలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆ తర్వాత రాజమండ్రిలోని కందుకూరి వీరేశలింగం గారి విద్యాసంస్థల్లో ఇంటర్ చదివారు. ఆ తర్వాత 1967లో ఆంధ్ర యూనివర్శిటీ నుంచి బీఎస్సీ డిగ్రీ పట్టా తీసుకున్నారు. బుచ్చయ్య చౌదరి గారు సోదరులు ముగ్గురు. వారిలో చివరి వాడైన రాజేంద్ర ప్రసాద్.. ఎన్టీఆర్ వీరాభిమాని. ఆ క్రమంలో టీడీపీ స్థాపించినప్పుడు.. ఈయనే పార్టీలో కీలకంగా వ్యవహరించే వారు. అలా.. ఆయన సోదరుడు బుచ్చయ్య చౌదరిని సైకిల్ పార్టీలోకి తీసుకు వచ్చి.. ఆయన వెంట నడిచారీ గోరంట్ల రాజేంద్రప్రసాద్. స్వతహాగా కమ్యూనిస్టు కుటుంబం గోరంట్ల బుచ్చయ్య చౌదరి వారిది. కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపల్లి సుందరయ్యగారితో వీరి ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇక బుచ్చయ్య చౌదరి గారి భార్య ఝాన్సీ లక్ష్మీ. గోరంట్ల వారు.. ఇంటర్ చదువుతున్నప్పుడే ఝన్సీ లక్ష్మీ ప్రేమలో పీకల్లోతూ మూనిగిపోయారని.. ఆ తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి.. వివాహం చేసుకున్నారని ఆయనే చెబుతారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.. ఇద్దరు కంప్యూటర్ సైన్స్ చదివి.. యూఎస్‌లో స్థిరపడ్డారు. ఇక టీడీపీ స్థాపించిన తర్వాత ఉభయగోదావరి జిల్లాలతోపాటు ఆ పక్కనే ఉన్న విశాఖపట్నం జిల్లాలో సైకిల్ పార్టీని బలంగా ప్రజల్లోకీ తీసుకు వెళ్లడంలో గోరంట్ల వారు అన్ని తానై వ్యవహరించారు. ఆ క్రమంలో ఆయా జిల్లాలో దాదాపు అన్ని సీట్లు సైకిల్ పార్టీ కైవసం చేసుకుందంటే.. అదంతా.. గోరంట్ల వారి పుణ్యమేనంటుందీ పసుపు పార్టీలోని కేడర్ అంతా. అందుకే ఎన్టీఆర్ సైతం.. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని విపరీతంగా అభిమానించే వారని నేటికి ఆ పార్టీలో ఓ టాక్ అయితే ఉంది. అందుకే.. టీడీపీ అధికారంలోకి రాగానే.. మమ్మల్ని కేబినెట్‌లోకి తీసుకుందామంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటూ ఎన్టీఆర్ మాట్లాడుతుంటే.... ఆ మాటలకు అడ్డు పడి మరీ నాకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. మీరు.. మీ పార్టీనే అంటూ ఆ మహానీయుడు ఎన్టీఆర్‌కు చాలా క్లియర్ కట్‌గా చెప్పిన మోనగాడు టీడీపీలో ఎవరైనా ఉన్నారంటే అదీ గోరంట్ల వారేనంటారీ ఆ పార్టీలోని సీనియర్లంతా. అలాగే నాదెండ్ల ఎపిసోడ్‌లో సైతం టీడీపీలో గోరంట్ల కీలకంగా వ్యవహరించడమే కాకుండా.... ఎన్టీఆర్‌కు సైతం బాసటగా నిలిచి... మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడానికీ ఆయన కీలక భూమిక పోషించారు. 1994లో మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఎన్టీఆర్ కేబినెట్‌లో ఏడు నెలలు పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత అంటే 1995లో లక్ష్మీ పార్వతి వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తోందంటూ.. ఎన్టీఆర్‌పై చంద్రబాబు అండ్ కో తిరుగుబాటు చేసింది. ఆ సమయంలో కూడా గోరంట్ల.. ఎన్టీఆర్ వెన్నంటే ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ తుది శ్వాస వరకు ఆయన చేతిని గోరంట్ల వదల లేదంటే.. వారి బంధం ఎలాంటిందో అర్థం చేసుకోవచ్చు. 1983 నుంచి నిన్న మొన్నటి ఎన్నికలు అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు అంటే... తొమ్మిది సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 1985, 1994, 1999, 2014, 2019 ఎన్నికల్లో ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే 1989, 2004, 2009 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓటమి చవిచూశారు. అలాగే ఎన్టీఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కేబినెట్ హోదాలో రాష్ట్రానికి సేవలందించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. పాలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా గోరంట్ల వారు సేవలందించారు. 2014 ఎన్నికల వేళ.. రాజమండ్రి అసెంబ్లీ స్థానం.. బీజేపీకి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తే.. ఈ నిర్ణయం తప్పంటూ.. పార్టీ అధినేతకు సూచించి.. ఆ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందారీ బుచ్చయ్య చౌదరి. టీడీపీ అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకు తనకు ఇది కావాలని ఏనాడు పార్టీ అగ్రనాయకత్వాన్ని అడగని.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ఆ నాడు మాత్రం తనకు మంత్రి పదవి కావాలని నోరు తెరిచి అడిగారు. కానీ బీజేపీతో టీడీపీ పొత్తు నేపథ్యంలో ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. ఆ తర్వాత అంటే.... 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా ఫ్యాన్ పార్టీ గాలే వీస్తున్నా.. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యేగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. ఇక 2021, ఆగస్టు 19న టీడీపీనే కాదు.. ఎమ్మెల్యే పదవికీ సైతం రాజీనామా చేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నట్లు ప్రకటించారీ బుచ్చయ్య చౌదరి. దీంతో పార్టీ అగ్రనాయకత్వం.. రంగంలోకి దిగి.. గోరంట్ల నిర్ణయాన్ని వెనక్కీ తీసుకునేలా ఒత్తిడి చేసింది. టీడీపీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు పూర్తి కాలంగా పని చేస్తున్న మీలాంటి వారే పసుపు పార్టీకి అండదండ.. అంటూ పార్టీ అధిష్టానం.. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించడంలో.. ఆయన కూల్ అయి.. పార్టీ సేవలో నిమగ్నమయ్యారు. పసుపు పార్టీ నేటిని ఇంత పచ్చగా... గోదావరిలా కళకళలాడుతోందంటే.. అందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నాయకుల చలవే.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వయస్సు 76 ఏళ్లు. అందులో సగం వయస్సు పార్టీకే అంకితం చేశారు. అయితే గోరెంట్ల వారిది మాత్రం ఇంకా చిన్న పిల్లవాడి మనస్తత్వమేనని.. అలాగే మంచి మనస్సుతో .. పది మందికి సేవ చేయాలనే తపన ఆయనలో నేటికి ఉందంటారు ఆయన మనస్సెరిగిన వారు. అందుకే టీడీపీపై కోపం వచ్చిన.. ఆ పార్టీ అధినేతపై ఆగ్రహం కలిగినా.. అందంతా పాలపొంగేనని వారంతా గుర్తు చేస్తారు.
http://www.teluguone.com/news/content/gorantla-buchaiah-chowdhery-40-years-in-tdp-39-133680.html





