కాంగ్రెస్ పార్టీని ఇక ఆ దేవుడే రక్షించాలిట!
Publish Date:May 30, 2015
Advertisement
శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య నిన్న తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యతును, తమ భవిష్యత్తును దేవుడే చూసుకొంటాడని” చెప్పడం రాష్ట్రంలో ఆ పార్టీ దైన్య స్థితికి అద్దం పడుతోంది. ఇటీవల కొంత కాలంగా రాష్ట్రంలో మిగిలిన కాంగ్రెస్ నేతలు తమ పార్టీ ఉనికిని, తద్వారా తమ రాజకీయ ఉనికిని కాపాడుకొనేందుకు ప్రత్యేక హోదా అంశం పట్టుకొని పోరాడుతున్నప్పటికీ దానికి ప్రజల నుండి స్పందన కరువయింది. రాష్ట్ర విభజన చేసిన పాపానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నేటికీ దానికి ప్రజలు దూరంగానే ఉంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్క రఘువీరారెడ్డి తప్ప మరెవరూ కనబడటం లేదు. ఉన్న ఒక్క చిరంజీవి తన 150సినిమాతో తీరిక లేకుండా ఉన్నారు. గుంటూరు జిల్లాలో పార్టీకి కొండంత అండగా ఉండే కన్నా లక్ష్మి నారాయణ ఇదివరకే గుట్టు చప్పుడు కాకుండా బీజేపీలోకి జంప్ అయిపోగా, ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి వైకాపాలో వెళ్ళిపోతున్నారు. ఆయనతో బాటే విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా వైకాపాలో చేరిపోవడం ఖాయం. ఒకపక్క రోజురోజుకి పార్టీ ఖాళీ అయిపోతుంటే అదే సమయంలో మరోపక్క తెదేపా, బీజేపీ, వైకాపాలు క్రమంగా బలపడుతున్నాయి. మిగిలిన ఈ నాలుగేళ్లలో ఇంకా ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడుతారో ఎవరికీ తెలియదు. కనుక వచ్చే ఎన్నికలలో పోటీ చేయడం మాట దేవుడెరుగు, ఆసలు అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగిలే ఉంటుందా లేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. బహుశః ఇక కాంగ్రెస్ నేతలెవరూ కూడా రాష్ట్రంలో పార్టీని కాపాడలేరని భావించిన మాజీ దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య తమ పార్టీని కాపాడే బాధ్యత, భారం ఆ దేవుడికే అప్పగించేసినట్లున్నారు. కానీ రాజకీయ పార్టీలను కాపాడే అదనపు బాధ్యతలు కూడా దేవుడికి అప్పగిస్తే చూసుకొంటాడో లేదో?
http://www.teluguone.com/news/content/god-45-46859.html





