గాలి జనార్ధన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం బిగ్ షాక్.. బ్రాహ్మణి స్టీల్స్ భూముల వెనక్కి.!
Publish Date:Jul 11, 2026
Advertisement
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్.! కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ ఏర్పాటు కోసం గతంలో కేటాయించిన వేల ఎకరాల భూములను వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. దాదాపు 19 ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఎలాంటి పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించారు. ఎకరం భూమి 18 వేల రూపాయల చొప్పున దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూములను అప్పట్లో గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె పేరిట ఉన్నబ్రాహ్మిణి స్టీల్స్ సంస్థకు కేటాయించింది. దీనికోసం కేవలం 19 కోట్ల రూపాయలను గాలి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. ఆ తర్వాత 2008లో విమానాశ్రయం ఏర్పాటు నెపంతో మరో 3,115 ఎకరాల భూములను 25 కోట్ల రూపాయలకే రాసిచ్చారు. పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. గతంలో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు, రుణాలు ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్ వంటి జాతీయ బ్యాంకులు కోర్టులను ఆశ్రయించాయి. భూములు తమ అధీనంలో ఉన్నాయని వాదించాయి. అయితే, పూర్తి హక్కులు లేని భూములపై బ్యాంకులు ఏ విధంగా రుణాలు ఇస్తాయని కోర్టులు సైతం తీవ్రంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ప్రస్తుత జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ 10,000 ఎకరాల భూములను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఉదంతంపై విశ్లేషకుడు మధుసూదన్ రెడ్డి తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నాటి వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి, నేడు కూటమి ప్రభుత్వంలోనూ మంత్రులుగా కొనసాగుతున్న కొందరు నేతల సమష్టి బాధ్యతను ప్రశ్నించారు. పరిశ్రమలు పెట్టకుండా కాలయాపన చేయడం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లడమే కాకుండా, స్థానిక నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. భవిష్యత్తులోనైనా ఏ ప్రభుత్వమైనా పరిశ్రమలకు భూములను శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేయకుండా, కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే ఇవ్వాలనన్నారు. అప్పుడే పారిశ్రామికవేత్తలు భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టకుండా, నిజాయితీతో పరిశ్రమలు స్థాపించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గాలి జనార్ధన్ రెడ్డి ఆర్థిక సామ్రాజ్యానికి, బ్రాహ్మణి స్టీల్స్ భూముల ఉదంతం ఒక పెద్ద ఎదురుదెబ్బేనని మధుసూదన్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి.
అన్నారు.
http://www.teluguone.com/news/content/gali-janardhan-reddybrahmani-steels-lands-kadapa-25-225748.html





