పెదరత్తయ్య రాకపై 'దేశం'లో కలవరం
Publish Date:Mar 29, 2012
Advertisement
మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారంటూ వస్తున్నా వార్తలు జిల్లాలోని తెలుగుదేశం పార్టీలో గల ఆయన వ్యతిరేక వర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. గతంలో పెదరత్తయ్య వల్ల నష్టపోయిన ఈ వర్గం ఇప్పుడు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పెదరత్తయ్యను తిరిగి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే సహించేది లేదని ఆయన వ్యతిరేక వర్గీయులు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. గుంటూరులో మాకినేని పెదరత్తయ్య దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేశారు. అయితే పెదరత్తయ్య తెలుగుదేశం పార్టీలో చేరితే తిరిగి జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత మెరుగుపడుతుందని ఆయన వర్గీయులు అంటున్నారు. 2009లో ప్రత్తిపాడు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు సీటుగా మారిపోవటం, అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పెదరత్తయ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆయన అక్కడ కూడా ఎక్కువకాలం నిలువలేకపోయారు. తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. పెదరత్తయ్య అభ్యర్థనను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మన్నించినప్పటికీ జిల్లాలోని ఆయన వ్యతిరేక వర్గీయులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అయితే పెదరత్తయ్య తెలుగుదేశం పార్టీలో చేరడంవల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది వుండబోదని ఆయన వర్గీయులు భరోసా ఇస్తున్నారు. ఎంపి మోదుగుల ఎన్నికలకు రెండునెలల ముందు తెలుగుదేశం పార్టీలో చేరితే పార్టీ ఆయనకు టిక్కెట్ ఇచ్చి ఆదరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుని తిట్టిన దేవేందర్ గౌడ్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/exminister-makineni-pedarattaiah-24-12993.html





