దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అరెస్ట్
Publish Date:Apr 8, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం (ఏప్రిల్ 7) ఆమె నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలలో భారీగా అక్రమాస్తులు బయటపడటంతో కాళింగిర శాంతిని ఏసీబీ అదుపులోనికి తీసుకుంది. మంగళవారం (ఏప్రిల్ 7) తాడేపల్లి, ఉండవల్లితో పాటు మొత్తం నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల్లో విశాఖపట్నం ఎండాడలో ఒక విలాసవంతమైన ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో జీప్లస్ 2 భవనాన్ని గుర్తించారు. వీటితో పాటు 770 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 కిలోల వెండి వస్తువులు, రూ.1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో మరో రూ.3 లక్షలు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం ఉన్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. కాళింగిరి శాంతి గతంలోనూ పలు వివాదాలతో వార్తల్లో నిలిచారు. అక్రమాల ఆరోపణల కారణంగా గత ఏడాది జులై నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఆమె సస్పెన్షన్‌లో ఉన్నారు. హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరుతో ముడిపడి పలు ఆరోపణలు రాగా, వాటిని ఆమెతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఖండించిన సంగతి తెలిసిందే. మొత్తంగా వైసీపీ హయాంలో శాంతి దేవాదాయ శాఖలో చక్రం తిప్పారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.
http://www.teluguone.com/news/content/endowments-department-assistant-commissioner-shanti-arrested-36-216903.html





