ఎస్మాకు వెరవం.. ఫిబ్రవరి 3న ఉద్యోగులంతా చలో విజయవాడ
Publish Date:Jan 30, 2022
Advertisement
ఎస్మా గిస్మా జాన్తానై.. మా పోరాటంలో నిజాయతీ ఉన్నప్పుడు ఎవరేం చేస్తారో చూస్తాం అంటున్నారు ఏపీ ఉద్యోగులు. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు దిగుతామని ఇదివరకే నోటీసిచ్చిన ఉద్యోగ సంఘాల జాక్ నేతలు... ఆ సమ్మెకు ముందు ఓ భారీ నిరసన కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు. ఫిబ్రవరి 3వ తేదీన అంటే గురువారం చలో విజయవాడ పేరుతో భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఆ ప్రదర్శన ద్వారా ఏపీ ప్రజలకు, విపక్షాలకు, పక్క రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని భారీ పథకరచన చేశారు. ఇందుకోసం జాక్ నేతలు ఆయా సంఘాల జిల్లాల బాధ్యులకు, ఇంచార్జులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఉద్యోగులందరినీ ఉద్యమంలోకి తీసుకొచ్చేలా, ప్రభుత్వం తీరును అందరూ గ్రహించేలాా, తమ పోరాటంలో చిత్తశుద్ధి హైలైట్ అయ్యేలా నిరసన ప్రదర్శనకు పూనుకున్నారు. ప్రభుత్వం ఒకవేళ ఎస్మా ప్రయోగించినా భయపడేది లేదని, 3వ తేదీన లక్షలాది మందితో నిర్వహించే చలో విజయవాడ నిర్వహించి తీరతామంటున్నారు... ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు. మెరుగైన పీఆర్సీ కోసం మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నామని, కార్మికులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లను జాగృతం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్నారు. ఇటీవల మంత్రుల కమిటీ పేరు మీద చర్చలకు పిలిస్తే... తాము హాజరు కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఆ రోజున 9 మంది ప్రతినిధుల బృందం చర్చలకు వెళ్లిందని, నలుగురు నేతలు నిర్ణయించుకుని తాము లిఖితపూర్వకంగా డిమాండ్స్ ఇచ్చామంటున్నారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి సమాధానం లేదని విమర్శిస్తున్నారు. అంతేకాదు.. గత మూడేళ్లుగా ప్రభుత్వాన్ని నమ్మి మోసపోతూ వచ్చామని వాపోతున్నారు. రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనీసం అశుతోష్ మిశ్రా రిపోర్టునైనా బయట పెట్టి ఉండేదని, జగన్ సర్కారు ఆ చిత్తశుద్ది లేదు కాబట్టే ఉద్యోగులతో కూడా రాజకీయాలు చేస్తోందంటున్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు పెట్టి తయారు చేసిన నివేదికను బయట పెట్టడం ప్రభుత్వ భాద్యత అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు.. జగన్ సర్కారును ఉద్యోగ సంఘాల నేతలు తమ వాదనాపటిమతో గుక్కు తిప్పుకోకుండా చేస్తున్నారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్ల భారం పడుతుందని అంటున్నారని, అలాంటప్పుడు ఆ రూ. 10 వేల కోట్లు మీరే అట్టిపెట్టుకొని పాత వేతనాలు మాత్రమే ఇవ్వాలంటూ ఇరుకున పెడుతున్నారు. రూ.1800 కోట్ల సప్లిమెంటరీ బిల్లులు, రూ. 2100 కోట్ల బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. సీపీఎస్, పెన్షనర్లకు రావాల్సిన 5 వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని, రూ. 25 కోట్ల హెల్త్ బకాయిలు కూడా వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు అన్ని విధాలా సిద్ధమయ్యే ఉద్యమంలోకి దిగారని ప్రభుత్వం గ్రహించింది. అయినా కొత్త పీఆర్సీ విషయంలో వెనుకడుగు వేసినట్టయితే ఉద్యోగుల ముందు చులకనైపోతామని, ఆ తరువాత వారు చేసే ఏ చిన్న డిమాండ్ కైనా స్పందించాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఆచితూచి అడుగులు వేస్తూ.. ఉద్యోగుల్లో ఎమర్జెన్సీ సేవలను గుర్తించి వారి ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలని భావిస్తోంది. అందుకోసం ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించే అంశంపై ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగుల్లోని కీలక విభాగాలు కూడా ఉద్యమంలోకి వస్తాయని పేర్కొనడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో ఎస్మా ప్రయోగించే అంశంపై సమాలోచనలు చేస్తోంది. ఏయే ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఉన్నతాధికారులు మాత్రం అత్యవసరం అయితేనే ఎస్మా ప్రయోగించాలని లేకపోతే ప్రభుత్వం అభాసుపాలవుతుందని జగన్ కు సూచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
http://www.teluguone.com/news/content/employees-planning-for-huge-protest-39-130928.html





