శ్వేతపత్రం విడుదుల చేయండి.. బుగ్గన సారూ.. సిద్దమా ?
Publish Date:Jan 29, 2022
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్వాన్నంగా ఉందంటే, మీరు అంగీకరిస్తారా? అని ఆన్లైన్ ఒపీనియన్ పోల్ నిర్వహిస్తే, కనీసం 60 నుంచి 70 మంది అయినా, అవును అద్వాన్నంగా ఉందనే అంటారు. నిజానికి, అంటారు కాదు, ఇప్పటికే వివిధ సంస్థలు నిర్వహించిన సర్వే, ఆన్లైన్ ఒపీనియన్ పోల్స్’ లో అదే ఫలితం వచ్చింది. అయినా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్’ మాత్రం, “అబ్బో.. అద్భుతం” రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని అంటారు. విపక్షాలు పనిలేక విమర్శలు చేస్తున్నాయని, అప్పుల గురించి అనవసరంగా గగ్గోలుపెడుతున్నాయని, అంటారు. “అవును. అప్పులు చేస్తున్నాం. కానీ గీత దాటాడంలేదు” అంటూ సర్కార్ చేస్తున్న మితిమీరిన అప్పులను ఆర్థిక మంత్రి సమర్ధించుకుంటారు. మరో వంక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సహా పలువురు నాయకులు, ఆర్థిక విశ్లేషకులు రాష్ట్ర ఆర్థిక /అప్పుల పరిస్థతి పై ఆందోళన వ్యక్త పరుస్తూనే ఉన్నారు.
ఈ నేపధ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే, పయ్యావుల కేశవ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.నిజమే, రాష్టంలోఅసలేమి జరుగుతోంది? ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉంటే ప్రభుత్వం సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వలేక పోతోంది? ఎందుకు ఆర్థిక మంత్రి నెలలో సగం రోజులు ఢిల్లీలోనే ఉంటున్నారు? ఎందుకు బ్యాకులు ఏపీకి అప్పులు ఇచ్చేది లేదని ఖరాఖండిగా కుండబద్దలు కొడుతున్నాయి ?
ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానం రావాలంటే, పయ్యావుల కోరిన విధంగా రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడమే ఉత్తమ మార్గమని, ఆర్థిక రంగ నిపుణులు కూడా అంటున్నారు. కాగా, ఈరోజు (శనివారం) మీడియా తో మాట్లాడిన కేశవ్, ఆర్థిక పరిస్థితి గురించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు ఇంకెన్నాళ్లు కల్లబొల్లి కబుర్లు చెబుతారని మండిపడ్డారు. మీరు చెప్పే కథలను వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని చెప్పారు. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ఆదాయం, మూలధన వ్యయం ఎంతో స్పష్టంగా చెప్పాలని కేశవ్ కోరారు. పథకాలకు పెడుతున్న ఖర్చు కన్నా.. వాటి ప్రచారం ప్రకటనల కోసం పెడుతున్న ఖర్చులే ఎక్కువని ఆరోపించారు. ఇదీ పేపర్, టీవీలలో వచ్చే యాడ్ బట్టి అర్థం అవుతుందని చెప్పారు. సంక్షేమ పథకాలకు డబ్బులు వెచ్చించాలే కానీ.. ప్రచారం కోసం చేయడం మంచిది కాదని సూచించారు. ప్రజల సొమ్మును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
అలాగే, రాష్ట్రంలో కొత్త పెట్టుబడులేవీ రాలేదని పయ్యావుల విమర్శించారు. అభివృద్దిలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు నెట్టారని ఆయన విమర్శించారు. మరో తరం కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. శాఖల వారీగా ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని పయ్యావుల కేశవ్ సవాల్ విసిరారు. ఆదాయం బాగున్నప్పుడు పొరుగు రాష్ట్రాల్లాగా ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని సూటిగా ప్రశ్నించారు.
గతంలో తమ ప్రభుత్వం ఉన్న సమయంలో మంచి పేరు ఉండేదని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి ఏ బ్యాంకూ అప్పులిచ్చే పరిస్థితి లేదని అన్నారు. దీనిని బట్టి జగన్ సర్కార్ ఎలా పేరు సంపాదించిందో చూసుకోవచ్చని ఆయన అన్నారు. వచ్చిన కంపెనీలే వెనక్కి వెళ్లాయని గుర్తుచేశారు. ఉన్న భూములను, ఆస్తులను విక్రయించి.. కాలం వెళ్లదీయాలని జగన్ చూస్తున్నారని ఆరోపంచారు. కానీ సంపద సృష్టి గురించి మాత్రం ఆలోచించలేదని చెప్పారు. ఉన్న ఆస్తులను అమ్మడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.నిజానికి ఇవి పయ్యావుల ప్రశ్నలు కాదు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు, అందుకే ప్రభుత్వం సమాధానం చెప్పాలని అంటున్నారు
http://www.teluguone.com/news/content/challenge-to-buggana-for-white-paper-39-130924.html





