టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ఎంట్రీ.. రేవంత్‌రెడ్డి ఎఫెక్ట్..
Publish Date:Feb 11, 2022
Advertisement
ముగిసిపోయింది అనుకుంటున్న టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెర మీదకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన డిజిటల్ రికార్డులను తమకు అందజేయాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లేఖ రాసింది. డిజిటల్ రికార్డులు, కాల్ డేటా, నిందితులు, సాక్షుల వాంగ్మూలానికి సంబంధించిన రికార్డులన్నీ తమకు అందజేయాలని ఆ లేఖలో ఈడీ కోరింది. కాగా.. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఎలాంటి సంబంధాలు లేవంటూ ఎక్సైజ్ శాఖ తేల్చేసింది. కానీ.. ఈడీ మాత్రం ఈ కేసు విచారణ ఇంకా తొలి దశలోనే ఉందని, మరింత లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. విచారణ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సేకరించిన డిజిటల్ రికార్డులను తమకు ఇంతవరకు సమర్పించలేదని తెలంగాణ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో ఈడీకి రికార్డులు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. యువతను డ్రగ్స్ అతలాకుతలం చేస్తున్నాయని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సహకరించాలని తెలిపింది. డ్రగ్స్ కేసు విచారణకు ఈడీ సరైన సంస్థే అని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పాటు డ్రగ్ పెడ్లర్ టోనీ వ్యవహారంపైనా ఈడీ దృష్టి సారించింది. నైజీరియాకు టోనీ భారీ ఎత్తున నిధులు మళ్లించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. టోనీ అనుచరులు, సహచరులతో పాటు వ్యాపారవేత్తలను విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూస్తాయని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భావిస్తోంది. టాలీవుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ద్వారా లావాదేవీలు నిర్వహించారనే అభియోగాల నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్, ఈడీ అధికారులు పలువురిని విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ 12 కేసులు నమోదు చేసింది. ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ వాటి అభియోగ పత్రాలు సమర్పించి, ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలు లేవని తేల్చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పజెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి గతంలో కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా డిజిటల్ రికార్డుల అంశం తెరపైకి రావడం గమనార్హం. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తామంటూ ఈడీ గతంలోనే ఇంప్లీడ్ అవడం విశేషం.
http://www.teluguone.com/news/content/ed-entry-in-tollywood-drugs-case-39-131624.html





