రాళ్లు రువ్వే గుంపుపై… ఇండియన్ ఆర్మీ కంపు బాంబు!
Publish Date:Jul 8, 2017
Advertisement
ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ జోక్ చక్కర్లు కొడుతోంది! ఒకాయన పులావ్ ఆర్డర్ చేస్తే అందులో విపరీతంగా రాళ్లు వచ్చాయట. ఏంటని ప్రశ్నించిన ఆతడికి… హోటల్ సర్వర్ ఇలా చెప్పాడట… ‘’ నువ్వు ఆర్డర్ చేసింది కాశ్మీరీ పులావ్ మరి! రాళ్లు రాక ఏం వస్తాయ్?’’ కాశ్మీర్లో అల్లరి మూకల రాళ్ల వర్షం ఇప్పుడు నిత్యకృత్యం అయిపోయింది. నెలల తరబడి పాకిస్తాన్ నుంచి వస్తోన్న డబ్బుతో కాశ్మీర్లో ఎందరో యువకులు రాళ్లు పట్టుకుని భీభత్సం సృష్టిస్తున్నారు. మరప్పుడు దేశ రక్షణలో వున్న సైన్యం చేయగలిగింది ఏముంటుంది? కాల్పులు జరిపితే ప్రాణాలే పోతాయి కాబట్టి పెల్లెట్ గన్స్ వాడుతున్నారు జవాన్లు! వాటి వల్ల కూడా రాళ్లు రువ్వే వారికి, చాలా సార్లు అమాయక ప్రజలకి తీవ్రమైన గాయాలవుతున్నాయి. కొందరికి శాశ్వతంగా చూపు కూడా పోయింది. ఇదంతా కోర్టు దాకా వెళ్లింది. ఆ మధ్య ఓ ఆర్మీ అధికారి రాళ్లు రువ్వే అల్లరి మూకల్ని నియంత్రించటానికి మరో రాళ్లు రువ్వే కాశ్మీరీనే జీపుకి కట్టుకుని తీసుకెళ్లటం కూడా పెద్ద దుమారం రేపింది! కాశ్మీర్లో రాళ్ల వర్షంతో నానా ఇబ్బందులు పడుతోన్న ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయాల గురించి తీవ్రంగా అన్వేషిస్తున్నాయి. అయితే, మరి కొద్ది రోజుల్లో రాళ్లు రువ్వే ఆకతాయిల ఆటకట్టించే ఛాన్స్ వచ్చేసింది. అదీ ఉత్తర్ ప్రదేశ్ లోని కనౌజ్ ప్రాంతం నుంచీ! అవును… కాశ్మీరీ రాళ్ల రువ్వే గుంపుల మీద ప్రయోగించటానికి యూపీలో కంపు రెడీ అయింది! కనౌజ్ ప్రాంతం సుగంధ భరితమైన వాసనలు పుట్టించే అత్తర్లు, సెంట్లకి ఫేమస్. అక్కడ అవ్వి ఉత్పత్తి చేసే పరిశ్రమ విస్తృతంగా వ్యాపించి వుంది. అక్కడే వుంది… ఫ్రాగరెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్. ఎఫ్ఎఫ్ డీసీగా పిలవబడే ఈ సెంటర్లో సైంటిస్టులు కొత్త కొత్త పర్ఫ్యూమ్ లని, స్ప్రేలని తయారు చేస్తుంటారు. అయితే, ఈసారి రొటీన్ కి భిన్నంగా వారు ఇంపైనది కాకుండా కంపైన ఐటెమ్ తయారు చేశారు. క్యాప్సుల్ రూపంలో వారు తయారు చేసిన స్టింక్ బాంబ్ టియర్ గన్ లో పెట్టి పేల్చేవచ్చు! ఒక్క సారి ఈ కంపు బాంబు గన్ లోంచి దూసుకు వెళ్లిదంటే అది పడ్డ చోట దట్టంగా పొగలు కమ్ముకుంటాయి. ఆ తరువాత అమాంతం తట్టుకోలేని దుర్వాసన వచ్చేస్తుంది! రాళ్లు రువ్వే బ్యాచ్ ఇక చేసేది లేక అక్కడ్నుంచి ముక్కు మూసుకుని పారిపోవాల్సిందే! అయితే, ఈ కంపు బాంబు లోంచి పుట్టుకొచ్చే దుర్వాసన ఎలాంటి ఆరోగ్య సమస్యలు తీసుకురాదని చెబతున్నారు సైంటిస్టులు! ప్రస్తుతం వివిధ రకాల పరీక్షల దశలో వున్న కనౌజ్ కంపు బాంబు… మరి కొద్ది రోజుల్లోనే కేంద్ర రక్షణ శాఖ ద్వారా సైన్యానికి, అక్కడ్నుంచీ రాళ్లు రువ్వే కాశ్మీరీ గుంపుల మీదకి వెళ్లనుంది! మరి స్టింక్ కాశ్మీరీ అల్లరి మూకల పని పడుతుందా? అదే జరగాలని ఆశిద్దాం…
http://www.teluguone.com/news/content/drdo-45-76169.html





