అప్రూవర్ గా మారతా.. జగన్ కు విజయసాయి పరోక్ష హెచ్చరికేనా?
Publish Date:Mar 13, 2025
.webp)
Advertisement
విజయసాయి రెడ్డి ప్రతి మాటా, ప్రతి కదలికా.. వైసీపీ కాళ్ల కింద భూమిని కదిలించేస్తోంది. విజయసాయి రెడ్డి ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడతాడా అన్న టెన్షన్ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేని వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన తరువాత ఆయన ప్రతి కదలికా వైసీపీని గాభరాపెడుతూనే ఉంది. వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన తరువాత ఆయన మొదటిగా కలిసింది వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిలను. ఇది కచ్చితంగా జగన్ ను ఇబ్బంది పేట్టే చర్యేననడంలో సందేహం లేదు. ఆ తరువాత ఆయన వ్యవసాయం చేస్తున్నానంటూ కొన్ని ఫొటోలూ, వీడియోలూ విడుదల చేసినా వైసీపీలో కంగారు, భయం తగ్గలేదు. అందుకు నిదర్శనమే విజయ సాయి పార్టీకి దూరమైన తరవాత చాలా రోజులకు జగన్ ఓ మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావించకుండానే విశ్వసనీయత లేని వ్యక్తి అంటూ విమర్శలు గుప్పించారు. ఆ వెంటనే జగన్ వ్యాఖ్యలను విజయసాయి ఖండించారు.
ఆ తరువాత మళ్లీ విజయసాయి వైసీపీకి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా జగన్ కోటరీ అంటూ కొందరు నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేరుకి కోటరీ అంటూ పేర్లు ప్రస్తావించకుండా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలపైనే అని ఎవరికైనా ఇట్టే అవగతమౌతాయి.
కాకినాడ షేర్ల బలవంతపు బదలాయింపు కేసులో సీఐడీ విచారణకు విజయసాయి బుధవారం విజయవాడ సీఐడీ కార్యాలయానికి వచ్చారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ మాటలలో ఆయన వెల్లడించిన విషయాలు, ఆయన వినిపించిన ధిక్కార స్వరం ఇప్పుడు వైసీపీలో కలవరానికి కారణమయ్యాయి. కాకతాళీయమే అయినా వైసీపీ ఆవిర్భావ దినం అయిన మార్చి 12నే విజయసాయి జగన్ కోటరీ గురించి4 చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నైతిక స్థైర్యాన్ని బాగా దెబ్బతీశాయి. వైసీపీ యువత పోరు కార్యక్రమం నుంచి అందరి దృష్టినీ మళ్లించాయి. కాకినాడ పోర్టు విషయంలో సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డే ‘కర్త కర్మ క్రియ' అని కుండబద్దలు కొట్టడం, అలాగే జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ లో ప్రధాన పాత్రధాని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పడం ద్వారా వెనుక ఉన్న సూత్రధాని జగనేనా అన్న అనుమానాలకు తెరతీసేలా చేశారు విజయసాయిరెడ్డి.
ఎందుకంటే వైవీ సుబ్బారెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఇద్దరూ జగన్ బంధువులే. వీటికి సబంధించి అవసరమైతే ముందు ముందు మరిన్ని విషయాలు, వివరాలు వెల్లడిస్తానని విజయసాయి చెప్పడం ఒక రకంగా తాను అప్రూవర్ గా మారడానికి కూడా వెనుకాడనని విజయసాయి పరోక్షంగా జగన్ కు హెచ్చరిక జారీ చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాకినాడ పోర్టు షేర్ల వ్యవహారంలో జగన్ ప్రమేయం లేదని ఓ వైపు చెబుతూనే.. వైవీ సుబ్బారెడ్డి పుత్రరత్నమే కర్తాకర్మాక్రియా అనడం ద్వారా జగన్ ప్రమేయం, అంగీకారం లేకుండానే విక్రాంత్ రెడ్డి ఇంత పెద్ద వ్యవహారం చక్కబెట్టగలడా అన్న అనుమానాలు అందరిలో వ్యక్తమయ్యేలా చేశారు విజయసాయిరెడ్డి. ఇక్కడే తన వ్యాఖ్యలతో వైసీపీయులు తనపై విమర్శల దాడికి పాల్పడకుండా విజయసాయి చెక్ పెట్టారంటున్నారు పరిశీలకులు.
ఇప్పుడు విజయసాయిరెడ్డిపై వైసీపీయులు తమకు మాత్రమే చేతనైన రీతిలో విమర్శల దాడికి దిగితే.. జగన్ ఇబ్బందుల్లో పడేలా విజయసాయి గళం మరింత పెంచుతారన్న భయం వారిలో పాదుకునేలా చేయడంలో విజయసాయి విజయం సాధించారని చెబుతున్ేనారు. ఇప్పుడు విజయసాయిని రెచ్చగొడితే జగన్ పై పది సీబీఐ, 11 ఈడీ కేసులలో ఏ2 అయిన విజయసాయి అప్రూవర్ గా మారితో కొంప కొల్లేరౌతుందని వారికి తెలుసు. అందుకే దొంగకు తేలు కుట్టిన చందంగా విజయసాయి వ్యాఖ్యలపై అరకొర ఖండనలకే వైసీపీయులు పరిమితమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/did-vijayasai-warn-jagan-that-he-will-turn-approver-39-194369.html












