అతను దొంగ నోట్లు ప్రింట్ చేశాడు! మరి మోదీకి ఎందుకు నచ్చాడు?
Publish Date:Dec 2, 2016
Advertisement
తెలివి వేరు... వ్యక్తిత్వం వేరు! ఈ సత్యానికి సరిగ్గా సరిపోయే నిదర్శనం అభినవ్ వర్మ! ఇంతకీ అభినవ్ వర్మ ఎవరు అంటారా? మనోడు చాలా తెలివైన వాడు. అదే సమయంలో పెద్ద కంత్రీగాడు కూడా! అందుకే, తెలివి వుండీ వ్యక్తిత్వం లేని దేశద్రోహులకి నిలువెత్తు నిరద్శనంలా మిగిలిపోయాడు!
అభినవ్ వర్మ వయస్సు 21ఏళ్లు. చదివింది ఇంజనీరింగ్. అంతే కాదు, పోయిన సంవత్సరం ప్రధాని మోదీ ఈ శాల్తీని ప్రత్యేకంగా ప్రస్తావించి మెచ్చుకున్నాడు. అంతలా గొప్ప పని మనోడు ఏం చేశాడో తెలుసా? గుడ్డి వారి కోసం ఒక పరికరాన్ని కనుగొన్నాడు. దాని వల్ల అంధులు చేతిలో కర్ర పట్టుకునే అవసరం లేకుండా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు. జస్ట్ 21ఏళ్ల వయస్సుకే ఒక చక్కటి ఉపయోగకరమైన ఆవిష్కరణ చేయటమే కాక అభినవ్ మేక్ ఇన్ ఇండియా అవార్డ్ కూడా అందుకున్నాడు. అందుకే, మోదీ ప్రత్యేకంగా అభినందించారు!
పోయిన సంవత్సరం ఎందరో గుడ్డివాళ్లకు మేలు చేసే ఆవిష్కరణ చేసిన అభినవ్ ఈ సంవత్సరం మాత్రం తానే గుడ్డివాడైపోయాడు. స్వార్థంతో కళ్లు మూసుకుపోయి ఏకంగా దొంగ నోట్లు అచ్చేసే స్థాయికి దిగజారాడు! అవును... మేకిన్ ఇన్ ఇండియా అవార్డ్ పొందిన అభినవ్ వర్మ ప్రస్తుతం వున్న కరెన్సీ కటకటను ఆసరా చేసుకుని రెండు వేల రూపాయల నోట్లు అచ్చేశాడు. అది కూడా మేకిన్ ఇండియా అనుకున్నాడో ఏమోగాని... ఈ ఘనుడు 42లక్షల దొంగ నోట్లతో ఖరీదైన ఆడి కార్లో తిరుగుతూ పంజాబ్ పోలీసులకి చిక్కాడు. అంతే కాదు, అతి తెలివిగా తమ కార్ కు పైన వీఐపీలకు వుండే ఎర్ర బుగ్గ కూడా పెట్టుకున్నారట అభినవ్ గ్యాంగ్!
అభినవ్ వర్మ అతి తెలివి దొంగ నోట్లు అచ్చేయటంతో పూర్తి కాలేదు! పాత 500, 1000 నోట్లను తీసుకుని తమ దొంగ నోట్లు చేతిలో పెట్టడమే కాక 30శాతం కమీషన్ కూడా మాట్లాడుకున్నారట నల్ల డబ్బున్న పార్టీల వద్ద! అంటే... మొత్తం నూటా ముప్పూ శాతం లాభమన్నమాట! ఇంత తెలివి దేశం బాగు కోసం వాడితే మోదీ మళ్లీ మళ్లీ అభినవ్ ని అభినందించే వారే!కాని, ఇప్పుడు అదే అభినవ్ అతడి టీమ్ చేసిన దిక్కుమాలిన పని వల్ల... వాళ్లందరి జీవితాలూ చెల్లని రెండు వేల నోట్లే అయ్యి కూర్చున్నాయి!
http://www.teluguone.com/news/content/demonetisation-45-69808.html





