సీఎం ఇల్లు సరే... పేదల డబుల్ బెడ్ రూమ్స్ మాటేంటి?
Publish Date:Dec 2, 2016
Advertisement
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయాక రెండిట్లోనూ భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో ప్రతిపక్షం ఎంతో కొంత బలంగా వుంది. కాని, తెలంగాణలో ప్రతిపక్షం ఆంధ్రాలో అంత ధీటుగా కనిపించటం లేదు. అందుకు మంచి ఉదాహరణ అసెంబ్లీ సమావేశాలే. నవ్యాంధ్రలో అసెంబ్లీ ఒక్కనాడూ గందరగోళం లేకుండా నడవటం లేదు. కాని, తెలంగాణ అసెంబ్లీ చాలా సార్లు కూల్ గా సాగిపోతోంది. ఇది మంచి విషయమే అయినా కేసీఆర్ ముందు ప్రతిపక్ష నేతలు తేలిపోతున్నారని కూడా అర్థం చేసుకోవాలి...
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కు ఎదురు లేదు. ఇది ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే. ఆయనకున్న రాజకీయ చాతుర్యంతో పాటూ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర కూడా జనంలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించి పెట్టింది. కాని, అదే ఇప్పుడు కొంత మేర దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ తనకు వీలైనంత మేర కేసీఆర్ మీద విరుచుపడుతున్నా జనంలోకి పెద్దగా వెళ్లటం లేదు. కాంగ్రెస్ విమర్శల్ని టీఆర్ఎస్ నేతలు, జనం ఇద్దరూ లైట్ గా తీసుకుంటున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి ఏం చేసినా, ఏం చేయకపోయినా గట్టిగా అడిగేవారు లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఇటు అసెంబ్లీ లోపల, బయట రెండు చోట్లా అలాగే వుంది!
కేసీఆర్ కు వ్యతిరేకంగా గళాలు లేవని కాదు. కాని, వాటికి పెద్దగా బలం వుండటం లేదన్నది సమస్య. తాజాగా సీఎం కోట్లు విలువ చేసే అధికార నివాసంలోకి మారారు. దీన్ని ఘాటుగా ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు ఎవ్వరూ లేరనే చెప్పాలి. ప్రెస్ మీట్లో నాలుగు డైలాగ్ లే తప్ప తీవ్రంగా స్పందించిన వారు మనకు కనిపించరు. పోనీ, సీఎం క్యాంప్ ఆఫీస్ సర్వాంగ సుందరంగా వుండటం తప్పు కాదని సరిపెట్టుకున్నా... పేదలకు ఇస్తామన్నా డబుల్ బెడ్ రూమ్ ల సంగతేంటని కూడా ఎవ్వరూ అడగలేకపోతున్నారు! ఒక్కో డబుల్ బెడ్ రూం ఇల్లుకి మహా అయితే పది లక్షలు అవుతాయోమో! కాని, కేసీఆర్ కోట్లు ఖర్చు చేసి ప్రగతి భవన్ నిర్మించారు కాని పేదల ప్రగతి కోసం ఇళ్లు పూర్తి చేయలేదు. దీనికి అధికార పక్షం వద్ద ఏ సమాధానం వున్నా ముందసలు గద్దించి అడిగే ప్రతిపక్షమే కరువైంది...
ఇంకా అక్కడక్కడా గుంతలతో పలకరిస్తోన్న వానకు కొట్టుకుపోయిన హైద్రాబాద్ రోడ్లు మొదలు ఆలస్యం అవుతోన్న మెట్రో వరకూ, డబుల్ బెడ్ రూం ఇళ్ల వరకూ, కూల్చేస్తామంటోన్న సచివాలయం వరకూ... దేన్ని ప్రశ్నించే వారు కనిపించటం లేదు తెలంగాణలో. ఇది అధికార పక్షానికి ఆనందం కావొచ్చేమోగాని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలతో కూడిన మొత్తం ప్రతిపక్షానికంత పెద్ద వైఫల్యం. ప్రజలకు తీవ్ర నష్టం. ఇక మీడియా కూడా టీఆర్ఎస్ అనుబంధ ఛానల్, పేపర్ కంటే భిన్నంగా , దైర్యంగా వ్యవహరించాల్సిన అవసరం వుంది. నూటికి నూరు శాతం అలా చేస్తున్నట్లుగా ప్రస్తుతం కనిపించటం లేదు. అయితే, సీఎంని విమర్శించటం అంటే జనం తరుఫున మాట్లాడటమే. వ్యక్తిగతంగా తిట్టిపోయటం కాదు. ఇది గమనిస్తే జనం కోసం మాట్లాడటానికి చాలా వుంటుంది...
http://www.teluguone.com/news/content/-kcr-45-69806.html





