భారీ డెటా సెంటర్లకు డీడీఎల్ విధానం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
Publish Date:Apr 24, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు డిజిటల్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో.. డేటా సెంటర్ల నిర్వహణలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. 300 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే భారీ డేటా సెంటర్లకు సొంతంగా విద్యుత్ పంపిణీ చేసుకునే హక్కును కల్పిస్తూ డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ (డీడీఎల్) విధానాన్ని తీసుకువచ్చారు. దీనివల్ల భారీ సంస్థలు ఇకపై ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు డిస్కమ్ లపై ఆధారపడకుండా.. నేరుగా విద్యుత్ కొనుగోలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ కొత్త విధానం మేరకు.. అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ విధానం వల్ల విద్యుత్ ఖర్చు తగ్గడమే కాకుండా, సరఫరాలో నాణ్యత పెరుగుతుంది. పర్యావరణ హితానికి ప్రాధాన్యతనిస్తూ, ఈ విధానంలో ఒక కీలక నిబంధనను చేర్చారు. ఈ లైసెన్స్ పొందే సంస్థలు తమ మొత్తం విద్యుత్ వినియోగంలో కనీసం 51 శాతం పునరుత్పాదక ఇంధనం నుండే పొందాల్సి ఉంటుంది. సౌర లేదా పవన విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా అటు పరిశ్రమలకు, ఇటు పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ రంగానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ, ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న భారీ ఏఐ హబ్, డేటా సెంటర్ క్లస్టర్‌కు ఈ లైసెన్స్ లభించే అవకాశం ఉంది. విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ డీడీఎల్ విధానం దోహదపడుతుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ డిస్కమ్ లకు రాబడి తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునే కేవలం 300 మెగావాట్ల కంటే ఎక్కువ లోడ్ ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులకు మాత్రమే ఈ వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు యధావిధిగా డిస్కంల నుండే విద్యుత్ పొందాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ సంస్థల ఆదాయానికి పెద్దగా గండి పడకుండా, అంతర్జాతీయ పెట్టుబడులను సాధించవచ్చని ప్రభుత్వం చెబుతోంది.
http://www.teluguone.com/news/content/ddl-policy-for-largescale-data-centers-36-218177.html





